మంత్రి చొరవతో 90 శాతం కేంద్రాలకు ఉచిత విద్యుత్
ఆరు నెలల్లోనే 9,800 కేంద్రాలకు సౌకర్యం
భవిష్యత్ తరాలకు విద్యుత్ ఇవ్వని గత ప్రభుత్వం : మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చీకట్లు తొలగిపోతున్నాయి. చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేసే అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక చొరవతో యుద్ధప్రాతిపదికన అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు. కేవలం గత ఆరు నెలల్లోనే 9,800 అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్తగా విద్యుత్ సౌకర్యం కల్పించడం విశేషం. రాష్ట్రంలో మొత్తం 35,781 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం 32,109 కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అంటే దాదాపు 90 శాతం అంగన్‌వాడీ కేంద్రాలు విద్యుత్ వెలుగులతో కళకళలాడుతున్నాయి. మిగిలిన కేంద్రాలకు సైతం త్వరితగతిన విద్యుత్ సౌకర్యం కల్పించి నూరు శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని చేరుకునేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ చర్యలు వేగవంతం చేసింది. గతంలో దాదాపు 40 శాతం అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యమే లేకపోవడంతో చిన్నారులు, అంగన్‌వాడీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చీకటి గదులు, ఉక్కపోత వాతావరణంలో చిన్నారులు కేంద్రాలకు రావాలంటేనే భయపడే పరిస్థితులు ఉండేవి. ఫ్యాన్లు, లైట్లు లేకపోవడంతో వేసవిలో పిల్లలను కేంద్రాల్లో ఉంచడం అంగన్‌వాడీ కార్యకర్తలకు సవాల్‌గా మారేది. డిజిటల్ బోధనకు సైతం విద్యుత్ లేమి ప్రధాన అడ్డంకిగా నిలిచింది. ఈ పరిస్థితిని గుర్తించిన మంత్రి సీతక్క అంగన్‌వాడీ కేంద్రాల విద్యుదీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. 
ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న విధానాన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సైతం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. చిన్నారుల సంక్షేమానికి సంబంధించిన అంశం కావడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సరఫరాకు మార్గం సుగమమైంది. విద్యుత్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సీతక్క నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ కొత్త కనెక్షన్ల ప్రక్రియను వేగవంతం చేశారు. శాఖల మధ్య సమన్వయంతో పెండింగ్ కనెక్షన్లను గుర్తించి యుద్ధప్రాతిపదికన విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఫలితంగా 11,194 కేంద్రాలకు నూతనంగా విద్యుత్ సదుపాయం కల్పించారు. ‘బలమైన భవిష్యత్‌కు బాల్యమే పునాది.. చిన్నారులు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణంలో ఎదగాలి.. అంగన్‌వాడీ కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాల కల్పన మా ప్రభుత్వ బాధ్యత.. త్వరలోనే మిగిలిన కేంద్రాలకు కూడా విద్యుత్ సౌకర్యం కల్పించి నూరు శాతం లక్ష్యాన్ని సాధిస్తాం’ అని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటూ గొప్పలు చెప్పుకుందని, కానీ భవిష్యత్ తరాలకు పునాది వేసే వేలాది అంగన్‌వాడీ కేంద్రాలకు కనీస విద్యుత్ సౌకర్యం కూడా కల్పించలేకపోయిందని ఆరోపించారు. ప్రచారంలో వెలుగులు చూపించారు తప్ప.. అంగన్‌వాడీల్లో చీకట్లు తొలగించలేదు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వలోని ప్రజా ప్రభుత్వం మాటలతో కాదు.. చేతలతో చిన్నారుల కేంద్రాల్లో వెలుగులు నింపుతోంది అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




