చల్లబడిన వాతావరణం

– పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో వర్షం
– కల్లాల్లో తడిసిన ధాన్యం.. రైతుల ఆందోళన
– తక్షణమే ధాన్యం కొనుగోళ్లు చేయాలని డిమాండ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు భారీ వర్షం ఉపశమనం కలిగించినా అన్నదాతలకు కన్నీరు మిగిల్చింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలకు పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల చెట్లు విరిగిపోయాయి రవాణాకు అంతరాయం ఏర్పడింది. సంగారెడ్డిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కామారెడ్డి జిల్లాలో వర్షాలకు కల్లాల్లోని ధాన్యం కొట్టుకుపోయింది. సిద్దిపేట జిల్లా ముత్స్యాలో అత్యధికంగా 12.3 సెం.మీ వర్షపాతం నమోదయింది. మహబూబూనగర్ జిల్లా భూత్పూర్ మండలంలో 11 సెం.మీ, నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో 8.4 సెం.మీ, నల్లగొండ జిల్లా గుండ్లపల్లిలో 6.2 సెం.మీ వర్షం కురిసింది. సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. మెదక్ జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మంగళవారం రాత్రి నుంచి ఈదురు గాలులతో భారీ వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం వర్షానికి తడిసిపోయిందిభారీ ఈదురు గాలులతో చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి.

 

మెదక్ జిల్లాలోని మెదక్, హవేలీ ఘనాపూర్, పాపన్నపేట, కుల్చారం, కౌడిపల్లి, చిలిపిచెడ్, చిన్న శంకరంపేట్, రామాయంపేట, చేగుంటతోపాటు పలు మండలాల్లో కల్లాల్లోని ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోో దాన్యం బస్తాలు తడిసిపోవడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కొన్నిచోట్ల వడ్ల కుప్పలు ఉండగా మరికొన్నిచోట్ల ధాన్యాన్ని బస్తాý్లో నింపించారు. కాంటా వేసినా లారీలు సకాలంలో రాకపోవడంతో ధాన్యం బస్తాలను కొనుగోలు కేంద్రాలలో నిల్వ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాంటా పెట్టాల్సిన వడ్లు అకాల వర్షాలకు కండ్ల ముందే నీళ్లలో కొట్టుకుపోతుంటే రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. పుట్లకొద్ది పండిస్తే ధాన్యం కొనుగోలు చేయకపోవడం, అరకొర కొన్నా కాంటాలు పెట్టకపోవడం, నెలలతరబడి గన్నీ సంచులు అందక, మద్దతు ధర లభించక, తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ, తీరా కాంటాలు పెట్టాక లారీల కొరతతో లోడింగ్ చేయకపోవడంతో కల్లాల్లోనే ధాన్యం తడిసి ముద్దయింది. సకాలంలో కొనుగోలు చేసి ఉంటే తమకు నష్టం జరిగేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనాలని డిమాండ్ చేస్తున్నారు.

అధికారులూ అప్రమత్తంగా ఉండాలి 
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలన్న సీఎం రేవంత్

వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులపై అలర్ట్‌గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని, జాగ్రత్తలు పాటించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల నుంచి టార్పాలిన్లను అవసరమైన ప్రాంతాలకు తరలించాలన్నారు. రైతుల ధాన్యం భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. వాతావరణ కేంద్రం బలమైన ఈదురుగాలుల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో అధికారులు వెంటనే స్పందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది: వాతావరణ శాఖ హెచ్చరికలు 

రాష్ట్రంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోవిÖటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు హైదరాబాద్ సహా పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. జనగామ, మహబూబ్‌నగర్, మేడ్చల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రానున్న మÖడు గంటల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఈదురుగాలుల హెచ్చరికలు జారీ చేశారు. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు, మÖడు రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని నెలలుగా ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది ఉపశమనం కలిగించినట్లు అయ్యింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *