– కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ ఎంపీ రఘునందన్ రావు
– యూనిటీమాల్ ఒప్పందాలపై విచారణ జరగాలని డిమాండ్
న్యూదిల్లీ, ఆగస్ట్ 13: రాష్ట్రంలో ప్రజల సొమ్ము దోచుకోవడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లు పోటీ పడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల అవినీతిని మించి కాంగ్రెస్ దోచుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఈ రెండు పార్టీలు నాణెనికి ఇరువైపులా ఉన్నటువంటివని పేర్కొన్నారు. యూనిటీ మాల్ పేరుతో జరిగిన ఒప్పందంపై సమగ్ర విచారణ జరపాలని ఎంపీ డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన రూ.202 కోట్లతో యూనిటీ మాల్ నిర్మించాలని నిర్ణయించారన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు ఎకరాలకుపైగా భూమి ఇచ్చిందన్నారు. అయితే ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలపై విచారణ జరగాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని విమర్శించారు. వీళ్లిద్దరూ అవినీతిలో అన్నదమ్ములంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. హైదరాబాద్‌లో భూముల విలువ ఎకరాకు వందల కోట్లకు చేరిందని, ప్రజల ఆస్తులను విక్రయించే హక్కు ప్రభుత్వాలకు లేదని ఎంపీ తేల్చి చెప్పారు. ప్రజల ఆస్తులకు ప్రభుత్వాలు కస్టోడియన్లుగా ఉండాలన్నారు. కేటీఆర్ తప్పు చేస్తే విచారణ జరిగినప్పుడు కాంగ్రెస్ తప్పు చేస్తే విచారణ ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. 2018లో బీఆర్‌ఎస్ హయాంలో 10 ఎకరాల భూమిని ప్రైవేట్ సంస్థకు కేటాయించారని, దానిపైనా విచారణ జరగాలన్నారు. ఈ రెండు భూకేటాయింపు ఒప్పందాలపై సమదృష్టితో దర్యాప్తు జరపాలని రఘునందన్ డిమాండ్ చేశారు. యూనిటీ మాల్, బీఆర్‌ఎస్ భూకేటాయింపులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ కోరుతూ కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు ఎంపీ చెప్పారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టుపై డీపీఆర్ నుంచి చివరి చెల్లింపు వరకు సీబీఐ విచారణ జరపాలన్నారు. కేవలం మూడు బ్యారేజీలపై కాక మొత్తం ప్రాజెక్టుపై దర్యాప్తు జరిపించాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలని ఎంపీ సూచించారు. దానిపై కేంద్ర హోంమంత్రిని కలిసి దర్యాప్తు జరిగేలా కృషి చేస్తానన్నారు. మరోవైపు రింగ్ రోడ్డు, ఫార్ములా-ఈ రేస్, కాళేశ్వరం అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిందని ఎంపీ మండిపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




