– ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో మేమూ ఉన్నాం
– బస్సులు, నియామకాలు పెంచాం
– డీజిల్ ఖర్చు తగ్గించేందుకే ఈవీ బస్సులు
– ఆర్టీసీ కార్మిక సంఘాలతో సీఎం రేవంత్
– మూడు రోజుల సమ్మె కాలపు వేతనానికి ఓకే
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : ఆర్టీసీ సంస్థ అభివృద్ధి, మనుగడ, గౌరవాన్ని పెంపొందించి ప్రజలకు మంచి సేవలు అందించడానికి కార్యచరణ కోసం ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్టీసీ కార్మిక యÖనియన్లకు అభినందనలు తెలిపారు. నేను వేరు.. మీరు వేరు అన్న భావన నాకు ఎప్పుడూ లేదని.. అందరం కలిస్తేనే ప్రభుత్వమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆర్టీసీ కార్మికులు కోరుకున్నారు.. ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో మేం ఉన్నాం.. బస్సులు పెంచాం, నియామకాలు పెంచాం.. ఆదాయం పెంచాం.. ప్రజలకు సేవలు అందించే విషయంలో కార్మికులు పట్టుదలతో పనిచేయడం వల్లనే ఆర్టీసీ దేశంలోనే గొప్ప సంస్థగా నిలిచింది అని అన్నారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో తనను కలిసిన ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తమ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపించినందుకు సీఎంకు కార్మిక సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. గాజులరామారంలో బస్ టెర్మినల్ కోసం వంద ఎకరాలు కేటాయించామని, శంషాబాద్‌లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్ నిర్మిస్తామని, వెయ్యి ఈవీ బస్సులు కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తున్నామని సీఎం వివరించారు. మినీ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అందజేయాలనుకుంటున్నామన్నారు. డీజీల్‌పై ఆర్టీసీ యేటా రూ.2000 కోట్లు ఖర్చు చేస్తున్నదని, ఈ ఖర్చు తగ్గించుకోవడానికి ఈవీ బస్సులను తీసుకురావాలని, ఆదాయం పెరగాలంటే ఖర్చు తగ్గించుకోవాలని చెబుతూ ఇందుకోసం పక్కా ప్రణాళిక కావాలన్నారు. ఆర్టీసీలో బకాయిలు తమ హయాంలో పెట్టినవి కావు.. కానీ వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, పెండింగ్‌లోని కారుణ్య నియామాలను చేపట్టామని, సమస్యలు తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కరించానని చెప్పారు. యూనియన్లు విలీనం వంటి అంశాలపై ప్రణాళికాబద్ధంగా కార్మిక సంఘాలే చర్చించుకుని నిర్ణయం చెప్పాలన్నారు. ఆర్థిక అంశాలలో కూడా పీఆర్సీ వంటి వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటూ శాశ్వత పరిష్కారం కోసం చర్చించుకుని ప్రభుత్వం ముందు ఆప్షన్స్ పెట్టాలని సూచించారు. రాజకీయాల ప్రభావానికి లోనైతే సంస్థకు నష్టం జరుగుతుందన్నారు. ఆర్టీసీ అప్పులపై ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సంస్థను బలోపేతం చేసుకుని నిలబెట్టుకోవడానికి కార్మికులు సహకరించాలని సీఎం కోరారు. ఆర్టీసీలో ఒక్క డ్రైవర్‌ను కూడా తగ్గించమని, డీజిల్ ఖర్చు తగ్గించడానికే ఈవీ బస్సులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకం అమలు ద్వారా రూ.8 వేల కోట్లను ఆర్టీసీకి ఇచ్చామని తెలిపారు. ఆర్టీసీని బాగు చేసుకునే అవకాశం కార్మికులపైనే ఉందని, కార్మికులు, డిపో మేనేజర్ల మధ్య తేడా రాకుండా అధికారులు చూడాలని సూచించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల బకాయిలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈసారి ఉద్యోగులకు రూ.1000 కోట్ల బకాయిలు విడుదల చేశామని, ఆర్టీసీ సమస్యలను వంద శాతం పరిష్కరిస్తామని చెప్పారు. కార్మికులతో ప్రభుత్వం ఉంటుంది.. సంస్థ ఆగిపోతే ఊపిరిపోయినట్లే.. సంస్థకు నష్టం జరిగే పనులు చేయొద్దు.. కార్మికులు, ఆర్టీసీ యాజమాన్యం మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలి అని సూచించారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల హక్కులను కాపాడుతుంది అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కేసులు ఎత్తివేతకు అంగీకారం
తమ మూడు రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని, సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల వేతనం ఇచ్చేందుకు, కేసుల ఎత్తివేతకు ముఖ్యమంత్రి అంగీకరించారు. సమ్మె కాలంలో వేతనం, కేసుల ఎత్తివేతకు వెంటనే చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులను ఆదేశించారు. సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ ఠాగూర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్(ఆర్), టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, టీఎస్‌ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్, టీఎస్ ఆర్టీసీ కార్మిక పరిషత్, టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, తెలంగాణ ఆర్టీసీ బహుజన కార్మిక యూనియన్, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘ్, టీఎస్‌ఆర్టీసీ సామాజిక తెలంగాణ మజ్దూర్ యూనియన్, టీఎస్‌ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్, తెలంగాణ స్టేట్ ఆర్టీసీ బహుజన్ వర్కర్స్ యÖనియన్లు పాల్గొన్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





