– బెదిరింపు ఈ-మెయిల్
– అప్రమత్తమైన భద్రతా బలగాలు
న్యూదిల్లీ, ఆగస్ట్ 14 : దేశ రాజధాని రేపటి స్వాతంత్య్ర దిన వేడుకలకు సిద్ధమవుతోన్న వేళ దిల్లీలో తీవ్ర కలకలం రేగింది. దిల్లీ హైకోర్టుకు వచ్చిన ఒక బెదిరింపు ఈ-మెయిల్ భద్రతా దళాలను, పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించే సమయంలోనే దాడులకు పాల్పడతామని ఆగంతకులు ఆ మెయిల్‌లో హెచ్చరించడం సంచలనంగా మారింది. ఆగస్టు 15న ఎర్రకోట లక్ష్యంగా బాంబు పేలుళ్లకు పాల్పడతామని మెయిల్‌లో పేర్కొన్నారు. ఉగ్రవాదులు లేదా అసాంఘిక శక్తులు పోలీసు యూనిఫామ్‌లో ఎర్రకోట ప్రాంగణంలోకి ప్రవేశించి ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉందని వెల్లడించారు. దేశ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ సందేశమిచ్చే అత్యంత కీలక సమయంలోనే ఈ పేలుళ్లు జరుపుతామని సవాలు విసిరారు. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక హింసాకాండకు బాధ్యులైన రాజకీయ నేతలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఈ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డిమాండ్ చేశారు. బెదిరింపు ఈ-మెయిల్ రాగానే దిల్లీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ వర్గాలు తక్షణమే రంగంలోకి దిగాయి. స్వాతంత్య్ర దిన వేడుకలు జరిగే ఎర్రకోట పరిసర ప్రాంతాలలో భద్రతను అత్యున్నత స్థాయికి పెంచారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఉన్న ఐపీ అడ్రస్ ఏంటనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పోలీస్ డ్రస్‌లో వస్తారన్న హెచ్చరికల నేపథ్యంలో భద్రతా విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను పునఃపరిశీలించడం, తనిఖీలు చేపట్టడం ప్రారంభించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





