– మహనీయుల స్ఫూర్తితో విద్యావంతులు కావాలి
– ఈసారి అడ్వాన్స్‌గా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తాం
– నైపుణ్యం ఉంటేనే ఉద్యోగావకాశాలు
– అందుకే విద్యావ్యవస్థలో సంస్కరణలు
– ఇంత మంచి ప్రభుత్వం మళ్లీ రాదు
– జ్యోతి బాఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహావిష్కరణ సభలో సీఎం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : చదవు ఒక్కటే ఆత్మగౌరవాన్ని, గుర్తింపును ఇస్తుంది.. తలెత్తుకునేలా చేస్తుంది.. కుల నిర్మూలన జరగాలన్నా సామాజిక చైతన్యం రావాలన్నా అందరూ కలిసి కట్టుగా చదువుకోవడం, జీవించడం ద్వారా సాధ్యం అవుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకే ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొస్తున్నామన్నారు. నెక్లెస్ రోడ్డులో జ్యోతి బాఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలను శుక్రవారం ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. ఒక వైపు అంబేద్కర్, మరో వైపు ఇందిరా గాంధీ, ఇంకో వైపు పీవీ నరసింహారావు, మరో వైపు జ్యోతి బాఫూలే విగ్రహాలను ఇక్కడ ఆవిష్కరించుకున్నామని, వారి స్పూర్తితో విద్యలో రాణించాలని పిలుపునిచ్చారు. నెక్లెస్ రోడ్డు చౌరస్తా ఇప్పుడు అద్భుతమైన చౌరస్తాగా మారిందన్నారు. 150 యేళ్ల క్రితం జ్యోతి బాఫూలే చదువు ఒక్కటే మార్గమని, తను చదువుకోవడమే కాక తన సతీమణిని చదివించడం ద్వారా ఆదర్శంగా నిలబడ్డారని గుర్తు చేశారు. ఈ తరం కూడా ఆదర్శ పురుషుడిగా ఆయనను స్మరించుకుంటున్నామంటే అది వారి ఆలోచనా గొప్పతనం అని అన్నారు. తమ ప్రభుత్వంలో జ్యోతి బాఫూలే ఆలోచనలను కొనసాగిస్తున్నామంటూ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. నర్సరీ నుంచి బ్రేక్ ఫాస్ట్‌తోపాటు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, ఈ విద్యా సంవత్సరం నుంచి రూ.2400 కోట్ల ఫీజు రీయింబర్స్‌ను అడ్బాన్స్‌గా బ్యాంక్ ఖాతాల్లో వేస్తున్నామని సీఎం వివరించారు. ఏటా రూ.2300 వేల కోట్లను విద్యార్థుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్ వేస్తామని, ఆన్ లైన్‌లో అప్లై చేసుకుంటే నెలలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యార్థుల ఖాతాల్లో పడుతుందని చెప్పారు. ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వమని ఏ కాలేజీ చెప్పకుండా ముందుగానే ఫీజులు చెల్లిస్తామన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు విద్యతోపాటు స్కిల్స్ నేర్పిస్తున్నామని తెలిపారు. సర్టిఫికెట్లు ఉంటే సరిపోదు.. స్కిల్స్ ఉంటే ఉపాధి లభిస్తుంది అని స్పష్టం చేశారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో రూ.2 లక్షలతో నర్సింగ్ ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి.. సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకోవాలి.. ఐటీ నిపుణులు కూడా ఉద్యోగాలు పోయి వెనక్కి వస్తున్నారు అని అన్నారు. 2024లో టాటా సంస్థతో కలిసి 119 నియోజకవర్గాల్లో ఏటీసీలను ఏర్పాటు చేశామని, వీటిల్లో చేరిన విద్యార్థులకు నెలకు రూ.2000 స్టైఫండ్ ఇస్తున్నామని, విద్యతోపాటు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పుతున్నామని సీఎం చెప్పారు. గ్రూప్-1 నియామకాలు చేపడితే అందులో 60 శాతం మంది బీసీలు ఉన్నారు.. ఇప్పుడు నూటికి నూరు మార్కులు వచ్చిన విద్యార్థులు 90 శాతం మంది ఉంటున్నారు.. విద్యతో పోటీ బాగా పెరిగిందన్నారు. పోటీ ప్రపంచంలో రాణించాం.. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం.. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని వివరించారు. క్రీడల్లో రాణించి పతకాలు తీసుకువస్తే నగదు నజరానాలతోపాటు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని ఆయన హామీ ఇచ్చారు. చదువుకుంటేనే అవకాశాలు వస్తాయంటూ అవకాశాలను అందిపుచ్చుకోవాలి అని పిలుపునిచ్చారు. సామాజిక చైతన్యంతో ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు దశాబ్దాలు కొట్లాడారు.. మీ రేవంతన్న దేశంలోనే మొదటిసారి ఎస్సీ వర్గీకరణ చేసి సమస్యను పరిష్కరించారు అని చెప్పారు. బీసీ జనగణన చేయడానికి దేశంలో ఎవరూ ధైర్యం చేయలేదు.. కానీ మేం యేడాదిలో బీసీ జనగణన చేసి బీసీల లెక్క తేల్చాం అన్నారు. కులగణనలో భాగస్వామ్యం పంచుకోకుండా మాజీ ముఖ్యమంత్రులు, మాజీ వ్యతిరేకించారని విమర్శించారు. కులగణన చేసిన మొదటి రాష్ట్రం, చివరి రాష్ట్రం మనదే అన్నారు. బలహీనవర్గాలకు ఉద్యోగాలు కల్పించాలంటే వాళ్ల లెక్క ఉండాలి.. అందుకే కులగణన చేశామని చెప్పారు. ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్త్తున్నామని, గత ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు పెంచుకోండి, చెప్పులు కుట్టుకోండి, చేపలు పట్టుకోమని చెప్పింది.. బీసీలు రాజ్యాధికారంలో భాగం అడుగుతారన్న ఉద్దేశంతోనే గొర్రెలు, బర్రెలు పెంచుకోమని చెప్పారని విమర్శించారు. ఈ సమాజం చదువుకోవద్దా.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు కావద్దా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. చదవు ఒక్కటే తలరాతలు మారుస్తుంది.. తెలంగాణను మారుస్తుంది.. చదువు ఒక్కటే పరిష్కారం.. అదే మార్గం.. తెలంగాణను ప్రపంచ పటంలో పెట్టడానికి చదువే మార్గం అని ఉద్ఘాటించారు. జ్యోతి బాఫూలేను స్పూర్తిగా తీసుకుని విద్యార్థులు చట్టసభల్లోకి రావాలి.. డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి అని పిలుపునిచ్చారు. నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నాది.. నాణ్యమైన విద్యను, పౌష్టికాహారాన్ని అందించే బాధ్యత నాది.. మీ బంగారు భవిష్యత్తు కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తా.. ఇంత మంచి అవకాశం మళ్లీ రాదు.. ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాలి అని సీఎం విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, అజరుద్దీన్, విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారులు వి.హనుమంత రావు, కె.కేశవ రావు, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, ఆర్ కృష్ణయ్య, సురేష్ షెట్కర్, ఎంఎల్ఏలు దానం నాగేందర్, నవీన్ యాదవ్మం, దుల సామేల్, మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్, ప్రకాష్ గౌడ్, శ్రీ గణేష్, బీసీ సంఘాల నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మహనీయుల స్ఫూర్తితోనే కాంగ్రెస్ పాలన : భట్టి
బలహీనవర్గాల ఆత్మగౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, పూలే దంపతుల ఆశయాల సాధనకు కంకణం కట్టుకుని ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్య, సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పూలే ఆలోచనలను అమలు చేస్తున్నామన్నారు. సామాజిక అసమానతలను పారద్రోలి అణగారిన వర్గాలు ఆత్మగౌరవంతో బతకాలనే లక్ష్యంతో జీవితాంతం కృషి చేసిన మహానుభావులు పూలే దంపతులని ఆయన కొనియాడారు. వారి విగ్రహాలను ఆవిష్కరించుకోవáడం మనందరి అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా బలహీనవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న స్పష్టమైన సందేశాన్ని ఇచ్చామన్నారు. పూలే ఆశయాలను మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో అమలు చేస్తున్న ఏకైక ప్రజా ప్రభుత్వం తమదేనని ఉద్ఘాటించారు. గత ప్రభుత్వ హయాంలో జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లను కేవలం 300మందికే ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ సంఖ్యను 700కు పెంచినట్లు తెలిపారు. బీసీల రిజర్వేషన్ల అమలుకు శాస్త్రీయమైన గణాంకాలు అవసరమని గతంలో అనేకసార్లు న్యాయస్థానాలు చెప్పినప్పటికీ ఏ ప్రభుత్వమూ ఆ సాహసం చేయలేదన్నారు. కానీ, దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రంలో శాస్త్రీయంగా కులగణన(సోషియో, ఎకనామిక్, పొలిటికల్ సర్వే) చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని భట్టి గుర్తుచేశారు. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో బలహీన వర్గాలు 56 శాతం ఉన్నారని తేల్చామని, ఈ శాస్త్రీయ గణాంకాల ఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు లేవని సభలో ఆర్.కృష్ణయ్య ప్రస్తావించిన అంశంపై ఆయన స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఏడాది కాలంలోనే ఒక్కో భవనానికి రూ.200 కోట్లు కేటాయించి రాష్ట్రవ్యాప్తంగా వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినట్లు వచ్చిన వెంటనే రెసిడెన్షియల్ స్కూళ్లలో డైట్ చార్జీలు 40శాతం, కాస్మెటిక్ చార్జీలు 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకునేది వారి మార్గంలో ప్రయాణించి, వారు చెప్పిన సిద్ధాంతాలను అమలు చేసేందుకు, స్ఫూర్తి పొందడానికేనని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఆ మహానుభావుల స్ఫూర్తి ప్రస్తుత ప్రభుత్వ పాలనలో చాలా స్పష్టంగా కనిపిస్తోందంటూ వారి విగ్రహావిష్కరణలో పాలుపంచుకునే అవకాశం రావడం సంతోషం కలిగిస్తోందన్నారు.
————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





