– నిషేధిత భూములు 22ఏ జాబితాపై సభలో రగడ
– ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభలో బీజేపీ నినాదాలు
– 22ఏపై చర్చకు సిద్ధంగా ఉన్నాం
– సభ సజావుగా సాగేందుకు సహకరించాలి
– 22ఏ జాబితాపై మంత్రి శ్రీధర్ బాబు వివరణ
– వచ్చే బోనాల నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి
– అసెంబ్లీలో మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్7 : అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన వెంటనే నిషేధిత భూములు 22ఏ జాబితా వ్యవహారంపై సభలో రగడ మొదలైంది. 22 A నిషేధిత భూముల నిబంధన కింద ప్రైవేట్ భూముల నమోదుపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభలో నినాదాలు చేశారు. ఈ వివాదంపై తక్షణమే విచారణ కమిటీని వేయాలని ప్రభుత్వాన్ని పట్టుబట్టారు. ఈ ఆందోళనపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు. 22A అంశంపై సభలో స్వల్పకాలిక చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సంపూర్ణ సిద్ధంగా ఉందన్నారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈ అంశానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని, నిబంధనలకు అనుగుణంగా చర్చపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం సభను అడ్డుకోవడం సరికాదని, సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని బీజేపీ ఎమ్మెల్యేలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబు సర్దిచెప్పినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గకుండా పోడియం వద్ద కాసేపు నినాదాలు చేశారు. విచారణకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటన చేసేవరకు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దాంతో 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఆ తరువాత సభ ప్రారంభం కాగా బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యాయని బయట వాళ్లు, లోపల వీళ్లు ఆందోళనకు దిగుతున్నారంటూ కాంగ్రెస్ సభ్యులు వ్యాఖ్యానించారు. సభలో ప్రజా సమస్యల పరిష్కారానికి, అర్థవంతమైన చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కై సభా సమయాన్ని వృధా చేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎస్సీల అభివృద్ధితోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్, క్రీడల అభివృద్ధి వంటి కీలక అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నా వాటిని వదిలేసి బురదజల్లే రాజకీయం చేయడం ప్రతిపక్షాలకు తగదని అన్నారు. రాష్ట్రంలో కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లక్ష కోట్ల కుంభకోణంపై విచారణ కోరుతూ ప్రభుత్వం ఏడాది క్రితమే కేంద్రానికి లేఖ రాసినా ఆ ఎంక్వయిరీని ఎందుకు తొక్కిపెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యేల్ని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో విచారణను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఎందుకు ఆపుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ సభ్యులు కూర్చోవాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ కోరారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలన్నారు. బీఏసీలో నిర్ణయం తీసుకుని 22ఏపై చర్చిద్దామని తెలిపారు.
వచ్చే బోనాల పండుగ నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి
వచ్చే బోనాల పండుగ నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేస్తామని శాసనమండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు నియోజకవర్గాన్ని •••నిట్?గా తీసుకున్నట్లుగా వివరించారు. లబ్ధిదారులకు మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే సిమెంట్ ఇప్పిస్తామని చెప్పారు.పేదలు నివసించే ప్రాంతంలోనే ఇందిరమ్మ ఇళ్లను కట్టించి ఇస్తామని పొంగులేటి వెల్లడించారు. 2023 ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వం హడావిడిగా కొంతమందికి పట్టాలిచ్చిందన్నారు. వారు ఇచ్చిన ఇళ్లలో చాలామంది నివసించట్లేదని చెప్పారు. పేదలు నివసించే ప్రాంతానికి 30-40 కి.మీ దూరంలో ఇళ్లు ఇచ్చారని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివసించే వారిని అంటరాని వారిగా చూసేవారని ఆయన తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు