– రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములుగా నిలవాలి
– సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్కు గార్డియన్గా ఉంటా
– పారిశ్రామికవేత్తలకు డిప్యూటీ సీఎం భట్టి భరోసా
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : పెట్టుబడులకు తెలంగాణ అత్యంత సురక్షితమైన, అనుకూలమైన గమ్యస్థానం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్కు తాను గార్డియన్గా వ్యవహరిస్తానని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే పారిశ్రామికవేత్తలకు సహకారం అందించేందుకు కృషిచేస్తానని స్పష్టం చేశారు. హైటెక్స్లో జరుగుతున్న సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ బిజినెస్ మీట్-2026 రెండో రోజు గురువారంనాటి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సంపద సృష్టికర్తలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను సింగిల్ విండో విధానం ద్వారా అందించడంతోపాటు, పారిశ్రామిక పార్కుల ద్వారా భూమి, అవసరమైన విద్యుత్, నీటి సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో భౌగోళికంగా అనువైన ప్రాంతంలో ఉండటం, పారిశ్రామిక అవసరాలకు తగిన భూమి అందుబాటులో ఉండటం, మెరుగైన మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థల ద్వారా అభివృద్ధి చెందిన నైపుణ్యవంతమైన మానవ వనరులు రాష్ట్రానికి ప్రధాన బలాలని అన్నారు. హైదరాబాద్ వాతావరణం, బహుభాషా సంస్కృతి, వివిధ ప్రాంతాల ప్రజలను ఆదరించే సంప్రదాయం కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటాయని చెప్పారు. మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం మరిన్ని పెట్టుబడులను తీసుకురావడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని వివరించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల అభివృద్ధికి కోర్, ప్యూర్, రేర్ అనే మÖడు విధానాల ద్వారా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వాటి గురించి సవివరంగా భట్టి విక్రమార్క తెలిపారు.
సంపద సృష్టిలో పారిశ్రామికవేత్తలదే కీలక పాత్ర
మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో సంపద సృష్టికి వ్యవసాయంతోపాటు పరిశ్రమలు, సేవారంగం కీలకంగా మారాయని ఉప ముఖ్యమంత్రి అన్నారు. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో వ్యవసాయ రంగం వాటా సుమారు 16 శాతం ఉండగా, పరిశ్రమలు, సేవారంగం కలిపి ఆర్థిక వ్యవస్థకు ప్రధానంగా దోహదపడుతున్నాయని వివరించారు. సేవారంగం వాటా సుమారు 65 శాతంగా ఉందని, పారిశ్రామిక రంగం కూడా ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఫార్మా, కోర్ ఇండస్ట్రీలు, ఆక్వా, ఎగుమతులు, దిగుమతులు, ఐటీ, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు వంటి విభిన్న రంగాల్లో ఉన్న వ్యాపారవేత్తలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మరింతగా తోడ్పడాలని పిలుపునిచ్చారు. సంపద సృష్టించే వారికి ప్రతి రాష్ట్రం, ప్రతి సమాజం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామికవేత్తలు ఎదగడంతోపాటు రాష్ట్రానికి ఉపాధి, పెట్టుబడులు, ఆదాయం పెరగడానికి దోహదపడాలని ఆకాంక్షించారు.
పరిశ్రమలకు ప్రభుత్వ అండ
సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సహా రాష్ట్ర మంత్రివర్గం మొత్తం పెట్టుబడిదారులకు అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. పరిశ్రమల స్థాపనలో ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పెట్టుబడులకు అవసరమైన అనుమతులు, భూమి, విద్యుత్, నీరు వంటి సదుపాయాల కల్పనలో ప్రభుత్వ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయాలు, వ్యాపారం, సినీ పరిశ్రమ, వ్యవసాయం, ఐటీ, ఏరోస్పేస్, రక్షణ రంగం తదితర అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడుతుందని చెప్పారు.
అందరినీ కలుపుకుని అభివృద్ధి సాధించాలి
సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందాలని ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పారిశ్రామికవేత్తలు తమ అనుభవం, పరిజ్ఞానాన్ని ఇతర వర్గాలతో పంచుకోవాలని, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. సమాఖ్య వంటి సంస్థల ద్వారా ఈ తరహా కార్యక్రమాలకు వేదికలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పెట్టుబడిదారులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ప్రభుత్వం కూడా వారితో కలిసి పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలికిన భట్టి విక్రమార్క వ్యాపారాలు విస్తరించుకుంటూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు సహకరించాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





