సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్‌చిట్

– ‘నీట్‌’ యూజీ-2024 ప్రశ్నాపత్రం లీక్ కేసులో

న్యూదిల్లీ, జూలై 23: ‘నీట్‌’ యూజీ-2024 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న సంజీవ్ కుమార్ అలియాస్ సంజీవ్ ముఖియా పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ స్పష్టం చేసింది. దీంతో ఆయనపై ఈ కేసులో చార్జిషీట్‌ దాఖలు చేయలేదని వెల్లడించింది. సీబీఐ ప్రకటన ప్రకారం 2024లో బీహార్ పోలీసులు నమోదు చేసిన తొలి ఎఫఐఆర్‌లో సంజీవ్ ముఖియా పేరును చేర్చారు. గతంలో ఇతర ప్రశ్నాపత్రాల లీక్ కేసుల్లో ఆయన పేరు వినిపించడం వల్ల ప్రాథమిక అనుమానాల ఆధారంగా నిందితుడిగా పేర్కొన్నారు. అనంతరం ఈ కేసు సీబీఐకి బదిలీ అయింది. దర్యాప్తు సందర్భంగా ప్రశ్నాపత్రం చోరీ, పంపిణీ, లీక్ ద్వారా లబ్ది పొందిన ప్రతి వ్యక్తినీ గుర్తించామని, అయితే సంజీవ్ ముఖియా ప్రశ్నాపత్రం చోరీ లేదా పంపిణీలో పాల్గొన్నట్లు నిర్ధారించే ఎలాంటి విశ్వసనీయ సాక్ష్యాలు లభించలేదని సీబీఐ తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే మొత్తం 45మందిపై పట్నా కోర్టులో పలు చార్జిషీట్లు దాఖలు చేసినట్లు వెల్లడించింది. దర్యాప్తులో మొత్తం కుట్రను ఛేదించి బాధ్యులందరినీ గుర్తించినట్లు సంస్థ పేర్కొంది. సంజీవ్ ముఖియా బీహార్ పోలీసుల అదుపులోకి వచ్చిన తర్వాత నీట్ యÖజీ- 2024 కేసులో విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించినా ఆయన ప్రమేయాన్ని నిరూపించే ఆధారాలు దొరకలేదని, అందువల్ల ఆయనపై చార్జిషీట్ దాఖలు చేయలేదని తెలిపింది. అయితే ఇతర కేసుల్లో బీహార్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నందున ఆయనపై వేర్వేరు న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని కూడా పేర్కొంది. దీంతో ఈ కేసులో సంజీవ్ పాత్రపై ఊహాగానాలకు తెరపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *