పౌర హక్కులే కాదు ..బాధ్యతలూ కలిగివుండాలి

  కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి జరుగుతున్న సమయంలో   పౌరులు స్పందించి, కానిస్టేబుల్ ప్రాణాలను కాపాడి ఉంటే, రియాజ్ పోలీసులకు సకాలంలో చిక్కి, అతనిపై చట్టపరమైన విచారణ మాత్రమే జరిగి ఉండేది. తద్వారా, రియాజ్ మరణానికి దారితీసిన ఎన్కౌంటర్ వంటి పరిస్థితిని నివారించగలిగే వారేమో..! పౌరుల నిర్లక్ష్యం, సామాజిక బాధ్యత పట్ల లోపించిన స్పృహ ఒక ప్రాణాన్ని తీయడమే కాకుండా, మరొక వ్యక్తి అకాల మరణానికి, న్యాయ వ్యవస్థపై అనేక ప్రశ్నలు తలెత్తడానికి కారణమైంది..

నిజామాబాద్‌లో విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ ప్రమోద్ ఒక రౌడీ షీటర్ చేతిలో దారుణంగా హత్యకు గురికావడం, ఆ తరువాత జరిగిన పరిణామాలు భారతీయ పౌర సమాజం  ప్రస్తుత స్థితిని కళ్ళకు కట్టినట్టు చూపించాయి. ఈ హృదయ విదారక ఘటనలో కొన ఊపిరితో ఉన్న పోలీసును ఆదుకోవడానికి సంఘటన స్థలంలో ఉన్న పౌరులు స్పందించకపోవడం, పైగా వీడియోలు తీయడం, హాస్పిటల్  తరలించడానికి ఆటో డ్రైవర్లు నిరాకరించడం వంటివి ‘మానవత్వం’ అనే విలువ సమాజంలో ఎంతగా క్షీణించిందో తెలియజేస్తున్నాయి. ఈ ఘటన కేవలం ఒక వ్యక్తిగత విషాదంగానే కాకుండా, సామాజిక బాధ్యత పట్ల ప్రజలలో పెరుగుతున్న ఉదాసీనతకు, ‘మాకెందుకు?’ అనే స్వార్థపూరిత వైఖరికి నిదర్శనంగా నిలుస్తుంది.
ఈ సంఘటనలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, పౌరులు సకాలంలో స్పందించి ఉంటే రెండు ప్రాణాలను కాపాడగలిగేవారు. రౌడీ షీటర్ రియాజ్, కానిస్టేబుల్ ప్రమోద్‌పై దాడి చేస్తున్నప్పుడు ధైర్యం చేసి ఇద్దరు ముగ్గురు పౌరులు అడ్డుకుని ఉంటే, ఆ దాడి తీవ్రత తగ్గి, ప్రమోద్ ప్రాణాలు నిలిచి ఉండేవి. అంతేకాకుండా, తీవ్ర గాయాలతో పడి ఉన్న ప్రమోద్‌ను ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా హాస్పిటల్  తరలించి ఉంటే, ప్రాణాపాయం నుంచి రక్షించే అవకాశం ఉండేది. దురదృష్టవశాత్తు, ప్రజలు సహాయం అందించడానికి బదులు సెల్‌ఫోన్లలో దృశ్యాలను బంధించడానికి మొగ్గు చూపారు. ఈ నిస్సహాయత, మానవత్వం లేని స్పందన కారణంగానే ఒక  కానిస్టేబుల్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవాల్సి వొచ్చింది.
పౌరుల ఈ ఉదాసీనత పరోక్షంగా తరువాత జరిగిన మరొక తీవ్ర పరిణామానికి దారితీసింది.. నిందితుడు రియాజ్ ఎన్ కౌంటర్. కానిస్టేబుల్ హత్య తరువాత పోలీసులు రియాజ్‌ను అరెస్టు చేశారు. చట్టం ప్రకారం అతనికి శిక్ష పడాల్సింది. కానీ, రియాజ్ హాస్పిటల్ లో  చికిత్స పొందుతున్నప్పుడు పోలీసులపై దాడి చేసి తుపాకీ లాక్కోవడానికి ప్రయత్నించాడని, ఆత్మరక్షణలో పోలీసులు కాల్పులు జరపడంతో అతను మరణించాడని వార్తలు వొచ్చాయి. కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి జరుగుతున్న సమయంలో   పౌరులు స్పందించి, కానిస్టేబుల్ ప్రాణాలను కాపాడి ఉంటే, రియాజ్ పోలీసులకు సకాలంలో చిక్కి, అతనిపై చట్టపరమైన విచారణ మాత్రమే జరిగి ఉండేది. తద్వారా, రియాజ్ మరణానికి దారితీసిన ఎన్కౌంటర్ వంటి పరిస్థితిని నివారించగలిగే వారేమో..! పౌరుల నిర్లక్ష్యం, సామాజిక బాధ్యత పట్ల లోపించిన స్పృహ ఒక ప్రాణాన్ని తీయడమే కాకుండా, మరొక వ్యక్తి అకాల మరణానికి, న్యాయ వ్యవస్థపై అనేక ప్రశ్నలు తలెత్తడానికి కారణమైంది.
ప్రజాస్వామ్యంలో, పౌరులకు వాక్ స్వాతంత్య్రం , జీవించే హక్కు వంటి ప్రాథమిక హక్కులు ఉంటాయి. అయితే, ఈ హక్కులను అనుభవించడంతో పాటు, పౌరులు సమాజం పట్ల కొన్ని బాధ్యతలను కలిగి ఉంటారు. సామాజిక బాధ్యత అంటే కేవలం పన్నులు కట్టడం, వోటు వేయడం మాత్రమే కాదు. ఆపదలో ఉన్న తోటి మనిషికి, మరీ ముఖ్యంగా తమ భద్రత కోసం నిరంతరం శ్రమించే పోలీసు సిబ్బందికి సహాయం చేయడంలో కూడా అది ఇమిడి ఉంటుంది. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే భయం కారణంగానే చాలామంది సహాయం చేయడానికి వెనుకాడుతుంటారు. కానీ, సుప్రీంకోర్టు ‘గుడ్ సమారిటన్’ (Good Samaritan) చట్టం ద్వారా, ప్రమాదంలో ఉన్నవారికి సహాయం చేసే వ్యక్తులకు న్యాయపరమైన రక్షణ కల్పించింది. ఈ చట్టంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి.
పౌరుల బాధ్యత అనేది హక్కుల పునాది. ప్రతి పౌరుడు తన చుట్టూ ఉన్న సమాజంలో ఒక భాగమని, తన చుట్టూ జరిగే సంఘటనలకు తాను బాధ్యుడినని గుర్తించాలి. ముఖ్యంగా, ‘ఎవరో ఒకరు చూసుకుంటారులే’ అనే నిష్క్రియాత్మక ఆలోచన నుంచి బయటపడాలి. మానవత్వం, సామాజిక బాధ్యత, సానుభూతి వంటి విలువలను తిరిగి పెంపొందించుకోవాలి. నిజామాబాద్ ఘటన మన పౌర సమాజం నిర్వీర్యమయిందనడానికి నిదర్శనం. ఈ దురదృష్టకర సంఘటనను ఒక గుణపాఠం గా తీసుకుని, ప్రతి పౌరుడు తమ హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించి, నిర్వర్తించినప్పుడే ఆరోగ్యకరమైన, సురక్షితమైన సమాజం ఏర్పడుతుంది. పౌర స్పందన అనేది ఒక ప్రాణం కంటే విలువైనదై ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page