స్త్రీ చైతన్యానికి మార్గదర్శకురాలు

చెమ్మ : వారాల ఆనంద్

మంచి రచయిత రచన కేవలం జరిగినదాన్ని మాత్రమే నమోదు చేయదు. జరిగినదానికి అర్థం చెబుతుంది. విశ్లేషిస్తుంది. అందుకే ఒకరచన కన్నీటిచుక్కను కథగానూ కాలాన్ని నవలగానూ నిలబెట్టగలదు. ఇంకో రచన వ్యక్తి జ్ఞాపకాన్ని సమాజస్మృతిగా మార్చగలదు. ఇదే మంచిసాహిత్యం చేసే అద్భుతం. మనిషి జీవితం ప్రతిరోజూ అనేకకథలను చెబుతుంది. ప్రతికాలం అనేకనవలలకి మూలవస్తువు అవుతుంది. వాటిని చూడగలకళ్ళు, వినగల హృదయం, నిర్మించగల కళ మాత్రమే సృజనకారుడికి అవసరం. ఒకరకంగా చెప్పాలంటే అనుభవం రచయితకు మట్టి అయితే, కల్పన అతని నీరు. నిర్మాణం అతని చక్రం. భాష అతని చేతులు. వీటన్నింటి సమన్వయంతోనే ఆ మట్టి శాశ్వత శిల్పంగా మారుతుంది. అలాగే అనుభవం సాహిత్యంగా, ఒకకాలం నవలగా చిరస్థాయిగా నిలిచిపోతుంది.

తెలుగు సాహిత్య ప్రపంచంలో వోల్గా అనగానే స్త్రీవాదం గుర్తొస్తుంది. స్వేచ్చ, విముక్తలాంటి అనేకరచనలతో వోల్గా తెలుగుసాహిత్యంలో స్త్రీవాద ఉద్యమానికి బలమైన మేధోపునాదిని నిర్మించారు. ఆమెకథలు, నవలలు, వ్యాసాలు, నాటకాలు, సినిమా రచనలు, అనువాదాలు- స్త్రీ విముక్తి చైతన్యానికి విస్తృతమైన సాహిత్యప్రపంచాన్ని నిర్మించాయి.అయితే వోల్గా తనభావాల్ని భాషారూపంలోనే కాకుండా దృశ్యరూపంలో కూడా వ్యక్తం చేసారు. అంతేకాదు ప్రభావవంతమయిన సినిమారంగంలో కొంత శిక్షణపొంది ఆ అనుభవాన్ని ‘కన్నీటి కెరటాల వెన్నెల’గా నవలీకరించారు. ఈ నవలలో కథకంటే అంతర్మథనం, సంఘటనల కంటే వ్యక్తిత్వవికాసం, ప్రేమకంటే ఆత్మావిష్కరణ ప్రధానంగా నిలుస్తాయి. అందువల్ల ఇది కేవలం స్త్రీవాదనవల మాత్రమేకాదు, కళ, జీవితం, స్వేచ్ఛ, మానవసంబంధాలపై తాత్వికంగా ఆలోచింపజేసే ఆధునిక తెలుగునవల. వోల్గా ఈ నవలను పూనా ఫిలిం ఇన్స్టిట్యుట్లో శిక్షణ పొందిన అనుభంతో రాసారు. విన్న ఉపన్యాసాలు, చూసిన సినిమాల్ని పరిచయం చేస్తూనే నవల కథని కథనాన్ని రూపొందించారు. ఈ నవల దుఃఖాన్ని సృజనాత్మకశక్తిగా మార్చుకునే మానవ ప్రయాణంగా చెప్పుకోవచ్చు. అర్థవంతమయిన సినిమాను విషయంగా తీసుకుని స్త్రీని కేవలం కుటుంబ సంబంధాలకు పరిమితం చేయకుండా, ఆలోచన చేసేవ్యక్తిగా, కళను ఆస్వాదిస్తూ తన జీవితాన్ని తానే నిర్మించుకునే వ్యక్తిగా వోల్గా తీర్చిదిద్దారు.

వోల్గా ప్రధాన రచనల్ని పరిశీలిస్తే తెలుగు సాహిత్యంలో స్త్రీ గొంతుని కేవలం బాధల వ్యక్తీకరణగా కాకుండా, స్వీయ అస్తిత్వాన్వేషణగా, విముక్తి తాత్వికతగా మలిచిన రచయిత్రిగా చెప్పుకోవచ్చు. వోల్గా రచనలు ప్రధానంగా మూడుదశల్లో అభివృద్ధి చెందాయి. కుటుంబవ్యవస్థలో స్త్రీ ఎదుర్కొనే అణచివేత మొదటిదశ అయితే స్త్రీ అస్తిత్వాన్వేషణ, స్వీయ నిర్ణయాధికారం రెండవది, ఇక మూడవదశలో పురాణపాత్రల పునర్వ్యాఖ్యానం, స్త్రీవాద తాత్విక విశ్లేషణగా చూడొచ్చు. అయితే గొప్పస్పృహతో ఈ మూడుదశల్లోనూ ఆమె రచనల కేంద్రబిందువు “స్త్రీ ఒక వ్యక్తి” అనే భావన కావడం గమనించాల్సిన అంశం. తను “వోల్గా” అనే కలంపేరును రష్యాలో ప్రవహించే మహానది ‘ఓల్గా’ నుంచి స్వీకరించారు. ఎలాగయితే ఆ నది అడ్డంకులను దాటి ప్రవహిస్తుందో, స్త్రీ స్వేచ్ఛకూడా అన్ని సంకెళ్లను అధిగమించాలని ఆమె విశ్వసించింది. 1950వ దశకంలో ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన వోల్గా తెలుగుసాహిత్యంలో ఉన్నతవిద్యను అభ్యసించి అధ్యాపకురాలిగా పనిచేశారు. తరువాత సాహిత్యరంగం, మహిళా ఉద్యమం, టెలివిజన్, సినీరంగాలలో పనిచేసారు. ఆమె స్థాపించిన అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ తెలుగురాష్ట్రాల్లో మహిళాచైతన్యానికి ముఖ్యయిన వేదికగా నిలిచింది. స్త్రీలజీవితాలను, హక్కులను, సామాజికసమస్యలను సాహిత్యం ద్వారా మాత్రమే కాకుండా ఉద్యమాల ద్వారా కూడా ముందుకు తీసుకెళ్లారు. వోల్గా రచనల్లో భాష సరళంగానూ తాత్వికంగానూ వుండి భావోద్వేగ నియంత్రణ ప్రదర్శిస్తుంది. అనేకచోట్ల ప్రతీకాత్మకంగా కూడా వుంటుంది.

వోల్గా రాసిన రచనల విషయానికి వస్తే సహజ, స్వేచ్ఛ, మానవి, కన్నీటి కెరటాల వెన్నెల, ఆకాశంలో సగం నవలలు కాగా రాజకీయ కథలు, ప్రయోగం, వివిధ కథాసంపుటాలు (స్త్రీ జీవిత అనుభవాల ఆధారంగా) ప్రధానమయినవి. స్త్రీవాద సాహిత్యవిమర్శ, మహిళా ఉద్యమవ్యాసాలు, సామాజికవిశ్లేషణలు తదితరాలున్నాయి. అనువాదాల్లో ప్రపంచ స్త్రీవాద రచనల అనువాదాలు, మహిళా అధ్యయన గ్రంథాలు ముఖ్యమయినవి. ఇక పురాణ పునర్వ్యాఖ్యాన రచనల్లో వోల్గా ‘విముక్త’ ఒక మైలురాయి అని చెప్పొచ్చు. ఇందులో ఆమె సీత, ఊర్మిళ, అహల్య, శూర్పణఖ, రేణుక వంటి పురాణ మహిళాపాత్రలను కొత్తదృష్టితో చిత్రించారు. రామాయణంలోని మహిళలు పురుషాధిపత్యానికి లోబడిన పాత్రలుకాదని, స్వంత చైతన్యం కలిగినవ్యక్తులని చూపించారు. తెలుగుసాహిత్యంలో పురాణాల స్త్రీవాద పునర్వ్యాఖ్యానానికి ఇది ముఖ్యమయిన రచనగా నిలబడింది.

తెలుగు సాహిత్యంలో చలం స్త్రీ విముక్తి గురించి తొలిప్రశ్నలను లేవనెత్తితే, ఆ ప్రశ్నలకు సమకాలీన స్త్రీవాద దృక్పథంతో సమాధానాలు వెతికిన రచయిత్రి వోల్గా. తెలుగు సాహిత్యచరిత్రలో వోల్గా ఒక రచయిత్రి మాత్రమేకాదు, ఒక భావజాలం. ఆమె సాహిత్యం స్త్రీని కరుణకు పాత్రగా కాదు, సమానహక్కులు కలిగిన వ్యక్తిగా చూడాలని నేర్పింది. పురాణాల నుండి ఆధునిక నగరజీవితం వరకు ఆమె కలం స్త్రీ అనుభవాలను కొత్తకోణంలో ఆవిష్కరించింది. సామాజిక మార్పు సాధనంగా సాహిత్యాన్ని ఉపయోగించిన ఆమె రచనలు నేటికీ స్త్రీ చైతన్యానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *