2018లో మనం కాసేపు మాట్లాడుకుందాం అన్న మనిషి, 2022లో మనిషిగుర్తుల్ని బతికించుకుందాం అన్న మనిషి, 2025లో ఏకాంత స్పర్శ, 2026లో నా కంటే ముందే- అన్నప్పుడు ఈ కవికి మనిషిమీద అభిప్రాయం మారుతోందా, లేక దృఢమైన నమ్మకం సడలుతోందా, లేక మనుషులపై కవి అన్వేషణ సాగే క్రమంలో ఇవన్నీ అంటున్నాడా అన్న ఆలోచన రేకెత్తుతుంది.
మనిషికి మనిషే ప్రశ్న, దానికి మనిషే మళ్ళీ సమాధానం. మనిషికి మనిషే నిర్భంధం, మళ్ళీ మనిషే బంధం. మనిషికి దూరం మనిషే, మనిషితోనే సమాధానం. మనిషి భ్రమణం చేసేది, పరిభ్రమణం చేసేది మనిషి చుట్టూతానే. ఇది తెలుసుకున్నవాళ్ళు అప్పుడప్పుడూ మనిషిమీద కోపమొచ్చినా తిరిగి మనిషి దగ్గరికే పోవాలి, తప్పదు. ఈ పరిణామంతో పాటు పరిపక్వతనొందుతున్న కవిత్వం నారాయణరావుది. తను మంచి కవిత్వం రాస్తాడు.
“రకరకాల జెండాలు అజెండా చూపి/ ఒరిగిన ఓటరుపై మేనిఫెస్టో మత్తు చల్లి/ విరిగిన వెన్నుపూసకే జెండాలు కట్టి/ రెపరెపలాడించాలని ఎత్తులు వేస్తున్నాయి”, ఇది మనం కాసేపు మాట్లాడుకుందాంలోని మొదటి కవిత. “తాత అనుభవానికి తర్జుమా నాన్న/ నాన్న ప్రతిమాటకు ముందుమాట అమ్మ”, “ప్రతిపనిలో విజయం వెంటచేరేలా/ దారివెంట వేలుపట్టి నడిపించే నాన్న/ ప్రతిక్షణం కలలకు జీవం పోస్తూ/ కళ్ళలో పెట్టుకుని కాపలాకాసే అమ్మ”, ఇది మనిషి గుర్తుల్ని బతికించుకుందాంలోని మొదటి కవిత. “అమ్మ వ్రాసిన/ ఉత్తరం అందినట్టు కలొచ్చింది/ పెద్దగా చదువులేని కన్నప్రేమ/ చింపిరి చింపిరి పదాలతో/ ముతకబారిన గొంతుతో/ మరిగిన భావాలను చుట్టచుట్టి/ పిండిన అనుభవంలో నిజాలని వడగట్టి” ఇది “ఏకాంత స్పర్శ”లోని మొదటి కవిత.
ఈ సంపుటాల్లోని మొదటి కవితల్ని ఎందుకు ప్రస్తావించడమంటే, పుస్తకంలో ఏ కవిత ముందుండాలి అని అంతో ఇంతో కసరత్తు చేసేవుంటాడు కవి. మొదటిది ఓటరుదేవుడిదైతే, రెండవది అమ్మానాన్నలపై, మూడోది అమ్మపై. పుస్తకాల లోపలికిపోతే మూడింటిలోనూ కవి దార్శనికత, సమాజంపట్ల బాధ్యత, కనీసం కలంతోనైనా మార్పుతేగలనన్న ఆశ, ఆకాంక్ష కవిలో కనిపిస్తాయి. అది హర్షించదగిన అంశం.
మహాకవి శ్రీశ్రీపై మూడు సంపుటాల్లోనూ కవితలున్నాయి. మనం కాసేపులోని ఓ మహాకవీ! అన్న కవితలో మహాకవి కవితా శీర్షికలనే ఎక్కువగా వాడుకున్నా “జీవితమంతా అలగడిగా గడిపి/ ఆందోళన ఊపిరిగా యుగయుగాల దోపిడీని/ తరతరాల చెరసాలల రకరకాల తెరచాటుల/ నిర్భాగ్యపు నీడల్ని నీలదీసిన నీవు/ ఈ లోకం మీదంటూ/ మీరాజ్యం మీరేలాలి అంటూ/ పేద ప్రజ పక్షాన నిలిచిన/ ఒకే ఒక్క ప్రపంచ కవిగా/ తెలుగువారి మహాకవిగా పేరుగాంచినారు” అంటారు.
మనిషి గుర్తుల్నిలో మహా(కవి) రచన అన్న కవితతో పాటు, “శ్రీశ్రీ పదంతో నిరూపించుకుంటా” అన్న కవిత కూడా ఉంది. అందులో జీవితాన్ని, దినపత్రికతో పోలుస్తూ వైవిధ్యంగా రాశాడు కవి. “దినపత్రికలా నన్ను చదువుకుంటూ/ శీర్షికలను తలుపుకొట్టి/ వార్తలను నిద్రలేకి/ పేజీపేజీలోకి వెళ్ళి ఓపిగ్గా తెలుసుకుంటా” అంటూనే చివరిలో “ఏనాటికైనా పత్రికలో ఓ రోజు/ శ్రీశ్రీ పదంలాంటి ఓ పతాక శీర్షికతో/ ఓ ఘనమైన వార్తతో గుబాళించి/ నన్ను నేను నిరూపించుకుంటా” అనడంలో శ్రీశ్రీపైన ఉన్న ఇష్టం అర్థమవుతుంది.
ఏకాంతస్పర్శలో “మహా అక్షరం శ్రీశ్రీ” కవితలో మహాకవి అక్షరాన్ని కూడా గౌరవించే ఎంతోమంది ఆధునిక కవుల్లో తానూ ఒకడిగా నిలబడ్డాడు చనారా. “ఆ కలం/ కాలాన్ని గురిచూస్తూ/ ప్రశ్నించే ఆయుధం/ ఆ భాష/ గుండెలో రక్తాన్ని/ ఊగించే ఆవేశం/ ఆ అక్షరం/ చీకటిలో అగ్గిలా వెలిగే పోరాటం” అంటూ తనకు అక్షరవెలుగుల్ని పంచిన కవిని కీర్తిస్తాడు. “ఆ కవిదే/ తెలుగువారిలో సాగుతున్న/ మహాప్రస్థానం” అంటూనే “అతడే/ మహాకవితకు శ్రీకారం/ మహా అడుగుకు ఆకారం” అని తానూ ఆ ఆకారంలో ఇమిడిపోవాలనుకుంటాడు.
పుస్తక శీర్షిక కవితల్ని చూద్దాం. మనం కాసేపు “మనసు తీరాల్లో నిలబడి/ కలల కడలిని పరికిస్తూ/ మూగ తెరల్ని తెంపుకొని/ మాటపొరల్ని ఒలుచుకుని/ మనం కాసేపు మాట్లాడుకుందాం” కవితాశీర్షిక మకుటంగా వాడాడు కవి. “జీవనచిత్రంపై/ ఒలికిన రంగులు పలికిన హంగులు/ అనుభవముద్రలో దాగని సత్యాలు, దాగని దృశ్యాలు/ మరోసారి ముఖచిత్రాలై ముంగిట మురిపిస్తుంటే/ మనం కాసేపు…”. మనిషి గుర్తుల్ని తెలుగుతల్లి కెనడా 2021 అవార్డ్ పొందిన కవిత. సంపుటిలో చివరిది. “ఊరు చిన్నపుడు భలే చల్లగుండేది/ గుడి శిఖరం చర్చ్ శిలువ/ మసీదు ఆర్చిల చల్లని నీడలో”, ఇప్పుడెలా ఉంది అదే ఊరు “మనుషుల్లో డబ్బుతెరలు/ మనసుల్లో అడ్డుగోడల మధ్య/ ఊరు పెద్దదై మనసు ఇరుకై/ మనుషులంతా ఉక్కపోత”, “చరిత్రమోసి నిజాలు/ ఒంటరిగా ఓ తరం చివరిలో మిణుకుమిణుకుమంటూ/ ముడుక్కున్నాయి/ వీటికి/ మనసును పెంచే మహిముందని/ తెలియని చదువులకు/ మెలగని కాలానికి/ అర్థంకాని అజ్ఞానమే అధోగతి” అందరి మంచికై ప్రార్ధించే పూజారి, పాస్టర్, ఇమాంలు వినోద వస్తువులుగా మారారని కవి బాధపడతాడు. ఆధునిక వేగాన్ని అడ్డుకొనేది, అదుపులో ఉంచేది మానవత్వచింతనే అంటాడు కవి.
నాలుగవ కవితా సంపుటి నా కంటే ముందేలో ప్రతి కవిత అద్భుతంగా ఉంటుంది. ఇల్లు, కవిత చదవండి. నిత్యం ఏదో ఒక ప్రయోగం చేయడం, కవిత్వాన్ని కవులకు మాత్రమే కాకుండా పాఠకులకూ అర్థమయ్యేలా రాయడం చందలూరికే సాధ్యం. ఆంగ్లం బోధించే మాస్టారే ఐనా, తెలుగంటే మక్కువ, తెలుగంటే ప్రాణం, తెలుగులోనే ఆయన జీవిత ప్రయాణం. నిత్య కవిత్వ సంచారి చందలూరి, నిత్య కవిత్వధారి, నిత్య కవిత్వ ఊసు ఆయనది, నిత్య కవిత్వ శ్వాస అతనిది. అదే ఆయన ఊపిరి, ఊహ, వాస్తవం, నిద్రలోనైనా, కలలోనైనా.





