సేమ్ పించ్! -బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు

“మా అమ్మాయని చెప్పడం కాదు, దించిన తల యెత్తదు…”

“మా అబ్బాయని చెప్పడం కాదు, దించిన తల యెత్తడు…”

రెండు వైపుల పేరెంట్స్ చెపుతున్నప్పుడు కూడా ఆ అమ్మాయిగాని  అబ్బాయిగాని తలలు యెత్తలేదు.

“మా అమ్మాయి చిన్నప్పటి నుంచి అంతే, నోట్లో నాలుక లేనట్టే…”

“మా అబ్బాయీ చిన్నప్పటి నుంచి అంతే, నోరు తెరిచి యేదీ అడగడు. మనం అర్థం చేసుకోవాల్సిందే.”

ఆ హోటల్ సపరేట్ క్యాబిన్లో గుంపుగా చేరిన వాళ్ళలో పేరెంట్స్ మాత్రమే మాట్లాడుకుంటున్నారు. అమ్మాయీ అబ్బాయీ యేమీ మాట్లాడడం లేదు. తలిదండ్రులు చెప్పినదానికి సాక్ష్యంగా తలలు యెత్తడం లేదు.

“ఇద్దరికిద్దరూ సరిపోయారు… అలాగ” నవ్వుతూ అన్నాడు సంబంధం కుదిర్చిన బ్రోకర్. ‘సాగుతుంది’ అలాగ-  అనే మాటని మింగేశాడు.

“ఇద్దరూ చూసుకోవడం లేదు, మాట్లాడుకోవడం లేదు” బంధువు వొకాయన గుండె గాబరాతో అడిగాడు.

“ముచ్చటైన జంట, రేపు వీళ్ళకి యే గొడవలూ రావు” ఆనందంగా నవ్వింది వాళ్ళ పెళ్ళిని చూడడానికి మాత్రమే యింకా బతికివున్నానని చెప్పిన బామ్మ.

“పెళ్ళయిన తర్వాత కదా, బోరుకొట్టి ముఖాలు చూసుకోరు” బ్రోకరు గుసగుసమన్నాడు. “ఇప్పటి నుండే ప్రాక్టీసు చేస్తున్నారేమో?” గుట్టుగా అందించాడు అసిస్టెంటు.

అంతా అమ్మాయినీ అబ్బాయినీ చూశారు.

అమ్మాయి అబ్బాయి మాత్రం తలెత్తలేదు. ఎవరినీ చూడలేదు.

ఆ ఇద్దర్నీ పరికించి చూస్తూ “చూడండి… వాళ్ళ అభిరుచులు యెలా వొక్కటిగా వున్నాయో?!” పంతులు యిక ముహూర్తాలు పెట్టేద్దామన్న తొందరలో అన్నాడు.

“పెళ్ళి చేసుకొనేది వాళ్ళు… వాళ్ళని కూడా వొకమాట అడిగితే?” యెవరన్నారో కాని అన్నారు.

ఆ మాట అన్నాక కూడా చెవిటివాళ్ళలా తలెత్తకుండా వున్నారు అమ్మాయి, అబ్బాయి.

వడ్డిస్తున్న సర్వర్‌కు చికాకు దొబ్బిందేమో వొక్కసారిగా చెయ్యకూడని పని చేసేశాడు.

అంతా అవాక్కయి చూస్తున్నారు.

అమ్మాయి అబ్బాయి కూడా దిగ్గున తలలు యెత్తి చూస్తున్నారు.

“సారీ” అని, వారిద్దరి చేతుల్లోంచి తీసుకున్న సెల్ ఫోన్స్‌ని అక్కడున్న పెద్దల చేతిలో పెట్టి, “యిప్పుడు మాట్లాడుతారు చూడండి” అన్నాడు నవ్వుతూ.

అందరూ దేభ్యపు ముఖాలు వేసుకు కాబోయే జంటవంక చూశారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *