జీవ వైవిధ్య సంరక్షణతోనే మానవాళి మనుగడ!

జీవుల ఉనికి ఉన్న భూమి ఉపరితలం, పైన ఉన్న గాలి, భూమి లోపలి భాగాలు కలిగిన భూభాగ ప్రాంతాన్ని ‘‘జీవావరణం లేదా బయోస్పియర్‌’’ అని పిలుస్తాం. నేలపై ఉన్న మట్టి, జలం, గాలి కలిసిన పొర కలిగిన ప్రదేశంలో జీవులు మనుగడ సాగిస్తాయి. సూక్ష్మ జీవుల నుంచి అతి పెద్ద జంతువులు, వృక్షాల వరకు అనేక రకాల జీవరాసులు కలిగిన ప్రదేశమే జీవావరణంగా పేర్కొనబడుతుంది. అతి ముఖ్యమైన వనరులకు జీవావరణం ఆలవాలంగా నిలుస్తున్నది. జీవావరణం ద్వారా ఆహారం, ఔషధాలు, నిర్మాణ వస్తువులు, ఇంధనాలు లభిస్తాయి. ఒక్క ఉప్పు తప్ప మిగిలిన అన్ని రకాల ఆహార పదార్థాలు జీవావరణం నుంచే లభిస్తాయి. పర్యావరణంలో జీవావరణం (బయోస్పియర్‌)తో పాటు జలావరణం(హైడ్రోస్పియర్‌), శిలావరణం(లిథోస్పియర్‌), వాతావరణం (అట్మాస్ఫియర్‌) అనబడే నాలుగు విభాగాలు ఉంటాయి.

అంతర్జాతీయ జీవావరణ నిల్వల దినం-2024 థీమ్‌: యునెస్కో చొరవతో 2022లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి ఏట 03 నవంబర్‌ రోజున ప్రపంచవ్యాప్తంగా ‘‘అంతర్జాతీయ జీవావరణ నిల్వల దినం (ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ బయోస్ఫియర్‌ రిజర్వ్స్‌)’’ పాటించుట ఆనవాయితీగా మారింది. 2024 థీమ్‌గా ‘‘ప్రణాళికలో భాగం అవుదాం (బి ఏ పార్ట్‌ ఆఫ్‌ ప్లాన్‌)’’ అను అంశాన్ని తీసుకొని కోల్పోయిన జీవ వైవిధ్యాన్ని పునఃప్రతిష్టాపన చేయడానికి పథక రచన, అమలుకు పానుకోవడం తక్షణ అవసరంగా భావించాలి. జీవ వైవిధ్యానికి నెలవులుగా ‘‘జీవావరణ నిల్వలు లేదా బయోస్పియర్‌ రిజర్వ్స్‌(బిఆర్‌)’’ సేవలు అందిస్తున్నాయి.

పలు రకాల జంతువులు, వృక్షాలకు చిరునామాలుగా జీవావరణ నిల్వలు పని చేస్తున్నాయి. మానవాళికి ఆర్థిక, సామాజిక సుస్థిరాభివృద్ధితో పాటు అరుదైన జీవరాశులను, అంతరించే దశలో ఉన్న జీవులను కాపాడడానికి జీవావరణ నిల్వలు ఉపకరిస్తున్నాయి. బయోస్ఫియర్‌ రిజర్వ్స్‌ ద్వారా అన్ని రకాల జీవజాతుల పరిరక్షణ, భూభాగాలను కాపాడడం, మానవుల కదలికలు, జీవవ్యవస్థలు, పర్యవేక్షణ, శిక్షణలు, విద్య లాంటి ప్రయోజనాలు ఉన్నాయి.  భారత్‌లో 12 జీవావరణ నిల్వలు:  ప్రపంచవ్యాప్తంగా 136 దేశాల్లో 759 జీవావరణ నిల్వలతో 74.42 లక్షల చదరపు కిమీ విస్తీర్ణంలో విస్తరించగా ఆయా ప్రాంతాల్లో 275 మిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. ఇండియాలో 60,000 చదరపు కిమీ విస్తీర్ణంలో 18 బయోస్ఫియర్‌ రిజర్వ్స్‌ ఉన్నాయి.

ఈ 18 జీవావరణ నిల్వల్లో 12 మాత్రమే ‘‘మ్యాన్‌ అండ్‌ బయోస్ఫియర్‌ ప్రోగ్రామ్‌(ఎంఏబి)’’ అంతర్జాతీయ గుర్తింపును పొందాయి. వీటిలో ముఖ్యమైనవి నిలగిరి ప్రాంత రిజర్వ్‌, గల్ఫ్‌ ఆఫ్‌ మున్నార్‌, సుందర్‌బన్‌, నందా దేవి, నొక్రెక్‌, పచ్‌మర్హి, సిమిలిపాల్‌, అతనక్మార్‌, గ్రేట్‌ నికోబార్‌, అగస్త్యమాల, కంచన్‌ జోంగా, పన్నా అనబడే 12 ఉన్నాయి. జీవావరణ నిల్వలతో జీవ వైవిధ్యం/జీవ వ్యవస్థలు కాపాడబడడం, సాంస్కృతిక వారసత్వం కాపాడడం, సమాజ సుస్థిరాభివృద్ధికి ఊతం ఇవ్వడం, స్థానిక ప్రజల జీవనశైలిని మెరుగుపరుచుకోవడం, అంతర్జాతీయ యంత్రాగం ఏర్పాటు చేయడం, శాస్త్రీయ పరిశోధనలు చేయడం, వాతావరణ సానుకూల మార్పులు, పర్యవేక్షణ, విద్య, శిక్షణ లాంటి ప్రయోజనాలు ఉన్నాయి.జీవావరణ నిల్వల్లో కోర్‌ ఏరియా, బఫర్‌ జోన్‌, ట్రాన్‌సిషన్‌ ఏరియా అను మూడు భాగాలు ఉన్నాయి.

భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని జీవ వైవిధ్యంతో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో బిఆర్‌ల ప్రాధాన్యాన్ని గుర్తించి ‘‘కున్మింగ్‌ – మాంట్రియేల్‌ గ్లోబల్‌ బిఆర్‌ ఫ్రేమ్‌వర్క్‌’’ నిర్దేశిత లక్ష్యాల సాధనలో ప్రభుత్వాలు, పౌర సమాజం, ఎన్‌జిఓలు ముందడు వేయాలి. బిఆర్‌ ప్రాంత ప్రజల భూమి హక్కులను కాపాడడం, మరి కొన్ని ప్రాంతాలను బిఆర్‌లుగా ప్రకటించి కాపాడడం, ఈ ప్రాంతాల్లో అక్రమాలకు పాల్పడే వ్యక్తులను కట్టడి చేయడం నిరంతరం జరగాలి. జీవకోటిలో ఓ చిన్న భాగం మానవాళి అని, అన్ని జీవజాతులు ఉంటేనే మానవుడి మనుగడని గమనించి రేపటి ఆరోగ్యకర భవిత కోసం నేటి నుంచే జాగిరత్త పడదాం, మనల్ని మనమే రక్షించుకుందాం.
(నేడు  అంతర్జాతీయ జీవావరణ నిల్వల దినం..)

 -డా.బుర్ర మధుసూదన్‌ రెడ్డి
9949700037 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *