– సమావేశాలకు రాకూడదనే ఉద్దేశంతోనే నిబంధనల ఉల్లంఘన
– స్పీకర్‌ను దూషించడం అప్రజాస్వామికం
– మాక్ అసెంబ్లీ దుర్మార్గమైన చర్య
– భూకబ్జాలపై హైపవర్ కమిటీ.. నెల రోజుల్లో నివేదిక
– నిరవధికంగా వాయిదా పడిన అసెంబ్లీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: శాసనసభ సమావేశాలకు హాజరయ్యే ఉద్దేశం లేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా సభా నియమాలను ఉల్లంఘించారని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. సభ సజావుగా సాగకూడదన్న కుట్రతోనే వారు ఆటంకాలు సృష్టించారని విమర్శించారు. ఎనిమిది రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంనిరవధికంగా వాయిదా పడిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. టీ షర్టులపై స్లోగన్స్ రాసుకుని రావడం నిబంధనలకు విరుద్ధమని తెలిసీ కేవలం ప్రచారం కోసం బీఆర్ఎస్ నేతలు సభా సంప్రదాయాలను తుంగలో తొక్కారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వారి ప్రభుత్వ హయాంలోనే ప్లకార్డులు, స్లోగన్స్‌తో సభలోకి రాకూడదని అప్పటి స్పీకర్ రూలింగ్ ఇచ్చారని, కొత్త రూల్స్ తెచ్చారని గుర్తుచేశారు. ఆ విషయం తెలిసి కూడా సభా మర్యాదను మంటగలిపారని దుయ్యబట్టారు. శాసనసభ జరుగుతుండగానే బయట మాక్ అసెంబ్లీ నిర్వహించడం సభ గౌరవాన్ని అవహేళన చేయడమేనని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని మంత్రి అన్నారు. నెల రోజులు సభ నిర్వహించాలని కేటీఆర్ కోరడం ఉత్త మాటలే అని తేలిపోయిందన్నారు. ఎంతో అనుభవం ఉన్న నాయకులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి ఆందోళన చేయడం కరెక్ట్ కాదన్నారు. స్పీకర్‌ను దూషించడం అప్రజాస్వామికమని, ఈ ఘటన యావత్ తెలంగాణ సమాజం చూసిందని, ఇది స్పీకర్‌ను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భూకబ్జాలపై హైపవర్ కమిటీ
భూముల ఆక్రమణల వ్యవహారంపై విచారణ జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైపవర్ అధికారులతో కూడిన ఓ కమిటీని వేశారని శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ కమిటీ నెల రోజుల వ్యవధిలో 12 కీలక అంశాలపై దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని, ఆ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
విజయవంతంగా ముగిసిన సమావేశాలు
ఈ నెల 7న ప్రారంభమైన శాసనసభ సమావేశాలు 18వ తేదీ వరకు విజయవంతంగా జరిగాయని, ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన అనేక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగిందని మంత్రి తెలిపారు. సభలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే అవకాశం కల్పించామన్నారు. మొత్తం పని దినాలు: 8 రోజులు, సభ జరిగిన సమయం: 51 గంటల 52 నిమిషాలు మౌఖిక సమాధానాలు (మంత్రుల ద్వారా): 50. సమాధానం ఇచ్చిన స్టార్డ్ ప్రశ్నలు: 9 సమాధానం ఇచ్చిన అన్‌స్టార్డ్ ప్రశ్నలు: 1 సభ్యులు అడిగిన సప్లిమెంటరీ ప్రశ్నలు: 86 సభ్యుల ప్రసంగాలు: 105, మంత్రులు చేసిన ప్రకటనలు: 2, ఆమోదం పొందిన ప్రభుత్వ తీర్మానాలు: 3, సభలో ఆమోదం పొందిన బిల్లులు: 4, స్వల్పకాలిక చర్చలు: 4 సమాధానాలు అందని ప్రశ్నలు: స్టార్డ్ – 62, అన్‌స్టార్డ్ – 22 అని మంత్రి తెలిపారు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





