బీఆర్ఎస్‌కు గతమే.. భవిష్యత్తు లేదు

– ఉద్యమంలో ఏది మాట్లాడినా చెల్లింది
– కవిత పార్టీ కుటుంబ గూడుపుఠాణి
– కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటా
– కాళేశ్వరంపై సీబీఐ విచారణ తరవాతే చర్యలు
– మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: బీఆర్ఎస్ పార్టీకి గతం ఉంది.. భవిష్యత్తు లేదు.. ఉద్యమ సమయంలో ఎలా మాట్లాడినా ప్రజలు సహించారని సీ¾ఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడారు. కవిత కొత్త పార్టీ ఏర్పాటుపైనా స్పందించారు. కేసీఆర్ కుటుంబమంతా ఒక్కటే అని విమర్శించారు. వాళ్లు తెచ్చిపెట్టుకున్న నటనను ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పార్టీకి మనుగడ లేదని, అధికారంలో ఉన్న పదేళ్లు కూడా అలాగే మాట్లాడారని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి, బీఆరఎస్‌కు ప్రజలతో సంబంధాలు లేవన్నారు. కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, శత్రువు కాదని, ఆయన విశ్రాంతిలో ఉన్న ప్రజాప్రతినిధి.. ఆయన చావును తానెందుకు కోరుకుంటానని అన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉంటేనే తమకు మంచిదన్నారు. కేసీఆర్‌కు గాయమైనప్పుడు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించానని, అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా ఆయన్ను కలిసి యోగక్షేమాలు అడిగానని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా గౌరవం ఉందన్నారు. కేసీఆర్‌కు చెడు జరగాలని ఆయన కుటుంబ సభ్యులే కోరుకుంటున్నారని, ఆయన బతికి ఉంటే తమకు అధికారం రాదని కుటుంబ సభ్యులే భావిస్తున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని మంత్రులతో ప్రకటనలు చేయించారని ఆరోపించారు. ఆయన మర మనిషో కాదో కుటుంబ సభ్యులకే తెలుసునన్నారు. అధికార పంపకాల విషయంలో తేడాలు రావడంతో కుటుంబంలో విభేదాలు వచ్చాయన్నారు. అయితే, వాళ్లంతా ఒక్కటేనని తెలిపారు. అనుబంధ సంఘాలను ప్రభుత్వంపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఇప్పటికే రెండుసార్లు ఓడించానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు ఓటమి కొత్త విషయం కాదని, అలాగే గెలుపు కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదని అన్నారు. మహేష్ గౌడ్ వర్సెస్ కేసీఆర్‌గా జరిగిన స్థానిక సంస్థల పోరులో కూడా కేసీఆర్ ఓటమి చవిచూశారని గుర్తు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను హైకోర్టు తప్పుపట్టలేదని, సాంకేతిక లోపాలున్నాయని మాత్రమే చెప్పిందని, నివేదిక ఆధారంగా చర్యలు వద్దని కోర్టు చెప్పిందని తెలిపారు. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ తర్వాతే చర్యలు ఉంటాయన్నారు. తాము వివక్ష లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని, అన్ని వర్గాల ప్రజలకూ సమన్యాయం చేస్తూ పాలన కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *