“సాగునీటి మంత్రి హరీశ్ రావు గారు ప్రతీ శనివారం క్రమం తప్పకుండా నిర్వహించే మిషన్ కాకతీయ వీడియో కాన్ఫరెన్స్ లకు, ప్రాజెక్టులపై నిర్వహించే సమీక్షా సమావేశాలకు, క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలకు తప్పనిసరిగా విద్యాసాగర్ రావు గారిని ఆహ్వానించే వారు. దిల్లీలో అంతర్ రాష్ట్ర సంబంధిత అంశాలను పరిష్కరించే బాధ్యతని మంత్రిగారు విద్యాసాగర్ రావు గారికే అప్పగించేవారు. దిల్లీలో కేంద్ర జలసంఘం అధికారులతో, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో తనకున్న పరిచయాలతో సమస్యలను పరిష్కరించడంలో విద్యాసాగర్ రావు గారు విశేషంగా కృషి చేసినారు..”

రామరాజు విద్యాసాగర్ రావు తెలంగాణలో ఆచార్య జయశంకర్ గారితో కలిసి పనిచేసిన ఉద్యమ శిఖరం. విద్యాసాగర్ రావు గారు వేదిక మీద ఉంటే ఆయన్ని సంబోధిస్తూ కెసిఆర్ గారు అనే మాటలు ‘నీళ్లలో నిప్పులు రగిలించినవాడు’. ఇది అక్షర సత్యం. విద్యాసాగర్ రావు కేంద్ర ప్రభుత్వం నుంచి 1997 లో చీఫ్ ఇంజనీర్ గా పదవీ విరమణ పొందిన తర్వాత దిల్లీ నుంచి తన మకాంని హైదరాబాద్ కు మార్చినాడు. అప్పటికీ తెలంగాణా ఉద్యమం ఇంకా ఊపందుకోలేదు. కొన్ని ఉద్యమ సంస్థలు పని చేస్తున్న సందర్భం అది. ఆనాటికి సాగునీటి రంగంలో తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాలని, వివక్షని నిలదీస్తూ … రాస్తూ, మాట్లాడుతూ భావ ప్రచారం చేస్తున్న వాళ్ళలో ప్రముఖులు ఇద్దరే. ఒకరు ఆచార్య జయశంకర్గారు, మరొకరు వి. ప్రకాష్ గారు. దిల్లీలో ఉన్నప్పుడు విద్యాసాగర్ రావు గారికి ఈ సంగతులు పార్లమెంట్ సభ్యుల ద్వారా లీలా మాత్రంగా తెలిసేవి.
ముఖ్యంగా ఆ రోజుల్లో లోక్ సభ సభ్యుడిగా కరీంనగర్ కు ప్రాతినిధ్యం వహించే జె చొక్కారావు గారి ద్వారా తెలిసేవని ఆయనే ‘నీళ్ళు – నిజాలు’ మొదటి సంపుటానికి ముందుమాటలో రాసుకున్నారు. అప్పుడు తనకున్న పరిమితుల దృష్ట్యా వాటిని విని తెలుసుకోవడం తప్ప ఏమైనా చేయగలమన్న దానిపై ఆయనకు స్పష్టత లేదు. చొక్కారావు గారికి తనకు చేతనైన సహాయం చేసి పంపించేవారు. పదవీ విరమణ తర్వాత దిల్లీలో ఉండి తనకు ఇష్టమైన నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రేడియో కార్యక్రమాలు నిర్వహిస్తూ కాలం గడపడమా లేక హైదరాబాద్ వెళ్లి మరేదైనా వ్యాపకంలో తన కాలాన్ని సద్వినియోగం చేయడమా అన్న మీమాంస కొంత కాలం వారిని వేధించింది. చివరికి హైదరాబాద్ నే ఎంచుకున్నారు. ఆ నిర్ణయం చరిత్రాత్మకమైన నిర్ణయంగా ఆనాడు ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. తెలంగాణా అతనికి అద్భుతమైన, అనితరసాధ్యమైన చారిత్రాత్మక పాత్ర పోషించడానికి అవకాశాన్నిచ్చిందని చెప్పడానికి ఇప్పుడు నేను సాహసిస్తున్నాను.
జల విజ్ఞానం నీళ్ళు – నిజాలు :
ఆ రోజుల్లో వార్త దినపత్రిక సంపాదకుడిగా పని చేస్తున్న కె రామచంద్రమూర్తి గారు విద్యాసాగర్ రావు గారికి నీటి సంగతులు రాయడానికి అవకాశాన్నివ్వడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ అవకాశాన్ని విద్యాసాగర్ రావుగారు గొప్పగా వినియోగించుకున్నారు. మొదటి దశలో నీటికి సంబంధించి జనరల్ విషయాలను రాసినాడు. దిల్లీలో ఉన్నప్పుడు నాటకాలు, రేడియో కార్యక్రమాలకు అనేక వందల తెలుగు స్క్రిప్టులని రాసిన అనుభవం ఉన్నవాడు కనుక మంచి వచనం రాయడం అతనికి కొట్టిన పిండి. వార్త దిన పత్రికలో ఆయన వ్యాసాలకు పాఠకుల నుంచి మంచి ఆదరణ లభించింది. సంపాదకుల వారు జనరల్ విషయాలపై నుంచి తెలంగాణా ప్రాజెక్టుల స్థితిగతుల పైకి చర్చను మళ్ళించమని విద్యాసాగర్ రావు గారిని కోరినారు. ఆయన తెలంగాణా ప్రాజెక్టుల స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి సాగునీటి శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్లపై ఆధారపడవల్సి వచ్చింది. అట్లా ఆయన ఒకసారి ఎర్రం మంజిల్ లో ఉన్న సాగునీటి శాఖ కేంద్ర కార్యాలయం జలసౌధకు వచ్చినప్పుడు నాకు ఆయనతో పరిచయ భాగ్యం కలిగింది. అప్పటికే వార్తలో ఆయన వ్యాసాలను చదివి ఉన్నాను కనుక పరిచయం త్వరలోనే స్నేహంగా మారింది. వయసులో నా కన్నా చాలా పెద్దవారు. నిరాడంబర జీవన శైలి వలన వయసు, హోదా మా మధ్య స్నేహం బలపడటానికి అడ్డు కాలేదు. పైగా జలసౌధలో వారికి సమాచారం అందించగలిగే అతి కొద్ది మందిలో నేనొకడిని.
రగిలిన ఉద్యమ చైతన్యం:
ఆయన తెలంగాణ ప్రాజెక్టులపై రాయడం మొదలుపెట్టే నాటికి తెలంగాణా చైతన్యం కొద్దిగా ఊపందుకున్నది. 1996 లో తెలంగాణ ఉద్యమం పునరుజ్జీవనం పొందిన తెలంగాణ ఉద్యమం తొలి రోజుల్లో బుద్ధిజీవులు చేపట్టిన భావ ప్రచారం విస్తృతం అయ్యింది. సభలు, సమావేశాలు, సదస్సులు, కరపత్రాలు, పుస్తకాల ప్రచురణ, సాంస్కృతిక దళాల నిర్మాణం జరిగినందున 2001 నాటికి తెలంగాణ సాధన కోసమే ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు కావడానికి ఒక బలమైన నేపథ్యం ఏర్పడింది. టిఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఉద్యమం గుణాత్మకమైన మలుపు తీసుకున్నది. అప్పటి దాకా చంద్రబాబునాయుడి ప్రభుత్వం అమలు చేసిన తీవ్ర నిర్బంధానికి గురి అయి తెలంగాణలో ప్రజా సంఘాలు పని చేయలేని పరిస్థితిలో టిఆర్‌ఎస్ ఆవిర్భావంతో తెలంగాణ ఉద్యమ రాజకీయ కార్యకలాపాలకు ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడింది. తెలంగాణా రాజ్యాంగ బద్దంగా, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి సాధించుకోవాల్సిన సమస్య కాబట్టి తెలంగాణా సాధనకు కొత్త ప్రజాసంఘాల ఏర్పాటు అనివార్యమని తెలంగాణా మేధావులు గుర్తించినారు.
“విద్యాసాగర్ రావు గారు జల విజ్ఞానం తొలి రచనల్లో నీటికి సంబంధించిన జనరల్ విషయాలతో పాటు సాగునీటి రంగంలో తెలంగాణాకు అన్యాయాలు, వివక్షలు, ప్రాజెక్టుల స్థితిగతులపై విస్తృతంగా రాసినారు. వాటిని ‘నీళ్ళు–నిజాలు’ శీర్షికతో పుస్తకం వేయాలని సంకల్పించినారు. ఆ పనికి సంపాదకుడిగా నన్నే ఎన్నుకున్నారు విద్యాసాగర్ రావుగారు. 2005 వరకు ఆయన రాసిన వందలాది వ్యాసాల నుంచి కొన్నింటిని ఎంపిక చేసి ఆ పుస్తకాన్ని తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తరపున సంయుక్త ప్రచురణగా వెలువరించినాము..”
టిఆర్ఎస్ ఏర్పాటుతో కొత్త తెలంగాణ ప్రజా సంఘాల ఏర్పాటుకు వెసులుబాటు ఏర్పడింది. 2001 తర్వాత అట్లా ఏర్పడిన తొలి ప్రజా సంఘాల్లో తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం చెప్పుకోదగ్గవి. రచయితల వేదిక, సాంస్కృతిక వేదికలు సాహిత్య సాంస్కృతిక రంగంలో, తెలంగాణ ఉద్యోగుల సంఘం ఉద్యోగ రంగంలో, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ ఇక్య వేదిక మరింత విస్తృతంగా తెలంగాణ రాజకీయ, సామాజికాంశాల్లో భావ ప్రచారాన్ని, ఉద్యమ కృషిని కొనసాగించినాయి. పత్రికల్లో పనిచేస్తున్న తెలంగాణ జర్నలిస్టులు యాజమాన్యాల తరపు నుంచి ఆంక్షలు, పరిమితులు ఎన్ని ఉన్నా తెలంగాణ ఉద్యమ వార్తలను ప్రచురించినారు. ఎడిటర్లుగా ఉన్నవారు సాధ్యమైనంతమేరకు తెలంగాణ వార్తలకు, వ్యాసాలకు చోటు కల్పించినారు. మేధావులు, కవులు, రచయితలు, కళాకారులు విస్తృతంగా రాస్తున్న కాలం అది.
ఈ ఉద్యమ వాతావరణంలో విద్యాసాగర్ రావు కలం కూడా పదునెక్కింది. వార్తలో తెలంగాణా ప్రాజెక్టులపై ఆయన రాస్తున్న వ్యాసాలు విస్తృత ప్రజాదరణ పొందినాయి. వార్తతో పాటు వివిధ పత్రికల వారు తమకు కూడా వ్యాసాలూ రాయమని అడగడంతో ఆయన రచనా వ్యాసంగం పరిధి పెరిగింది. రాజకీయ పార్టీల నాయకులు సాగునీటి రంగంపై ఆయనని సంప్రదించడం మొదలయ్యింది. ప్రజా సంఘాలు వారి సభల్లో సాగునీటి రంగంపై ఉపన్యాసాలకు ఆహ్వానించడం ప్రారంభమయ్యింది.
కేసీఆర్ కు తోడుగా ..
2004 ఎన్నికల నాటికి తెలంగాణా ఆకాంక్ష ప్రభలమైన రాజకీయ డిమాండ్ గా మారింది. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణా రాష్ట్ర సమితి ఈ రాజకీయ డిమాండ్ పార్లమెంటులో వినిపించడానికి సన్నాహాలు చేయసాగింది. టిఆర్ఎస్ తెలంగాణ ఆకాంక్షని వెల్లడించే బలమైన ఉద్యమ వేదికగా రూపుదాల్చింది. సహజంగానే విద్యాసాగర్ రావు గారు కెసిఆర్ కు సన్నిహితులుగా మారినారు. ఆచార్య జయశంకర్ ఒకవైపు, విద్యాసాగర్ రావు మరొక వైపు నిలబడి కెసిఆర్ కు ఉద్యమ ప్రస్థానంలో సైద్దాంతిక, మేధోపరమైన సహకారాన్ని అందించినారు. విద్యాసాగర్ రావు సాగునీటి రంగ సమస్యలపై సాధికారంగా రాయడం ప్రారంభించిన తర్వాత ఇక ఆ అంశంపై తనకు మాట్లాడే, రాసే అవసరం తీరిపోయిందని ఆచార్య జయశంకర్ గారు అనేక సందర్భాల్లో అనేవారు. అది నిజం. విద్యాసాగర్ రావు బలమైన తెలంగాణా గొంతుతో రాస్తున్న, మాట్లాడుతున్న కాలంలో జయశంకర్ సారు సాగునీటి అంశాలపై తక్కువగానే మాట్లాడేవారు.
ఉపన్యాస కళ:
ఆయన పరిచయమైనాక ఒకసారి ఒక ఉపాధ్యాయుల సంఘం వారు మిర్యాలగూడలో ఒక సభకు నన్ను, విద్యాసాగర్ రావుని ఆహ్వానించినారు. ఆ సభలో నేనేం మాట్లాడినానో నాకు గుర్తులేదిప్పుడు. అయితే విద్యాసాగర్ రావు గారి ప్రసంగం నన్ను ఆయనకు కట్టి పడేసింది. జఠిలమైన సాంకేతిక అంశాలను సులభ శైలిలో అందరికీ అర్థం అయ్యే భాషలో ఆయన వివరించే తీరు చూసి సంభ్రమానికి లోనయినాను. ఈ ఉపన్యాస కళ అతనికి ఎట్లా అబ్బిందని ఇప్పుడు ఆలోచిస్తే నాటక ప్రయోక్తగా, రేడియో కార్యక్రమాలని నిర్వహించిన అనుభవం వల్లనే ఆయనకు ఈ ఉపన్యాస కళ అలవడిందని అర్థం అయ్యింది. ఆ తర్వాత విద్యాసాగర్ రావు గారిని తెలంగాణా అంతటా తిప్పినాను. ఎక్కడకి రమ్మంటే అక్కడికి వచ్చి ప్రసంగాలు చేసేవారు.
“165 టిఎంసిల గోదావరి నీటిని దుమ్ముగూడెం వద్ద ఎత్తిపోసి నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ కు తరలించి రివర్సిబుల్ పంపుల ద్వారా నాగార్జున సాగర్ కు ఎత్తిపోసి కుడి కాలువ ద్వారా నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరివ్వడానికి డిపిఆర్ లు లేకుండానే టెండర్లు పిలిచినారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా ఆంధ్ర ప్రాంతానికి 225 టిఎంసిల నీరు సమకూరుతుందని ఆంద్ర ప్రాంత నాయకత్వాన్ని నోరెత్తకుండా చల్లబర్చినాడు. ఈ క్రమంలో తెలంగాణకు కూడా న్యాయం చేస్తున్నానని నమ్మబలకడానికి ప్రాణహిత-చేవెళ్ళ పథకాన్ని ప్రారంభించినాడు. అప్పటికే ప్రారంభమైన మరికొన్ని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులని జలయజ్ఞంలో చేర్చి తెలంగాణా నాయకత్వాన్ని నోరెత్తకుండా చేయగలిగినాడు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రల్ని సమర్థవంతంగా, నైపుణ్యంతో, పదునైన విశ్లేషణతో బహిర్గతం చేసిన మేధావి విద్యాసాగర్ రావు ఒక్కడే.”
తెలంగాణా ఉద్యోగుల సంఘం, తెలంగాణా రచయితల వేదిక, 2004 ఎన్నికలకు ముందు ఏర్పాటు అయిన తెలంగాణా విద్యావంతుల వేదిక ఏర్పాటు చేసిన అనేక సభల్లో జయశంకర్ గారితో వేదిక పంచుకున్నారు. అనేకసార్లు ఆయన్ని సభలకు తోల్కపోయి తిరిగి ఇంట్లో దింపే పని నేనే చేసేవాడిని. వివిధ సంఘాల వారికి ఆయనతో సభలకు డేట్లు కన్ఫర్మ్ చేసి పెట్టేవాడిని. నేను అడిగితే కాదనేవాడు కాదు ఆయన. 2002 ఏప్రిల్ నెలలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆదిలాబాద్ జిల్లా శాఖ చేపట్టిన జలసాధన యాత్రలో మూడు రోజులు యాత్రలో పాల్గొని అనేక సభల్లో ప్రసంగించినాడు. బాసర నుంచి ప్రారంభమైన యాత్ర ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ముగిసింది. ఆ వయసులో ఎర్రటి ఎండలో ఆయన మాతో యాత్రలో పాల్గొన్న తీరు, సాగునీటి రంగ అభివృద్ధి కోసం ఆయనలో కనిపించిన కమిట్మెంట్ మాకు ఆశ్చర్యం కలిగించింది.
నీళ్ళు – నిజాలు తొలి సంపుటం ప్రచురణ :
విద్యాసాగర్ రావు గారు జల విజ్ఞానం తొలి రచనల్లో నీటికి సంబంధించిన జనరల్ విషయాలతో పాటు సాగునీటి రంగంలో తెలంగాణాకు అన్యాయాలు, వివక్షలు, ప్రాజెక్టుల స్థితిగతులపై విస్తృతంగా రాసినారు. వాటిని ‘నీళ్ళు–నిజాలు’ శీర్షికతో పుస్తకం వేయాలని సంకల్పించినారు. ఆ పనికి సంపాదకుడిగా నన్నే ఎన్నుకున్నారు విద్యాసాగర్ రావుగారు. 2005 వరకు ఆయన రాసిన వందలాది వ్యాసాల నుంచి కొన్నింటిని ఎంపిక చేసి ఆ పుస్తకాన్ని తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తరపున సంయుక్త ప్రచురణగా వెలువరించినాము. 2006 లో ఆ పుస్తకం వెలువడింది. కొన్ని నెలల్లోనే పుస్తకం ప్రతులన్నీ అన్నీ అమ్ముడుపోయినాయి. ప్రజల నుండి డిమాండ్ ఉండడంతో 2008 రెండో ముద్రణ కూడా వేసినాము. ఈ పుస్తకం తర్వాత రెండో భాగం వేయాల్సిన అవసరం ఉంటుందని ఆయన కూడా అనుకోలేదు.
జలయజ్ఞం కుట్ర బద్దలు :
2004 ఎన్నికల అనంతరం ఉద్యమానికి గుణాత్మకమైన ఊపు వచ్చింది. తెలంగాణా డిమాండ్ పార్లమెంట్ కు చేరింది. యు పి ఎ తన ఎజెండాలో తెలంగాణా ఏర్పాటును చేర్చింది. రాష్ట్రపతి చేత మొదటి ప్రసంగంలో తెలంగాణా ఏర్పాటును ప్రకటింపజేసింది. ఇక తెలంగాణా ఏర్పాటు దగ్గరికి వచ్చిందని అర్థం అయ్యింది. తెలంగాణా సమాజంలో గొప్ప కదలిక ప్రారంభమయ్యింది. అయితే తెలంగాణా బద్ద వ్యతిరేకి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణా ఏర్పాటు ప్రక్రియను ముందుకు సాగకుండా చక్రం తిప్పసాగినాడు. తెలంగాణా ప్రజానీకాన్ని ఉద్యమబాట నుంచి తప్పించడానికి ప్రణాళికలు సిద్దం చేసుకున్నాడు. ఉద్యమానికి ప్రధాన ప్రాతిపదిక సాగునీరు. దానికి విరుగుడుగా జలయజ్ఞాన్ని తీసుకవచ్చినాడు రాజశేఖర్ రెడ్డి. జలయజ్ఞం తాత్విక పునాది ఏమిటంటే కృష్ణా నీళ్ళని పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలించడం, తెలంగాణా ప్రజానీకాన్ని ఉద్యమం నుంచి దూరం చెయ్యడం. 2005 లో జలయజ్ఞం పెద్ద ఎత్తున ప్రారంభం అయ్యింది.
అయితే 2005 జలయజ్ఞం ప్రారంభం అయినాకా రెండేండ్లు గడచినాయో లేదో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జలయజ్ఞాన్ని అమలుచేస్తున్న తీరుతెన్నుల్ని, తీసుకుంటున్న నిర్ణయాలను నిశితంగా పరిశీలించిన విద్యాసాగర్ రావు గారు తన పని అయిపోలేదని, జలయజ్ఞాన్ని విశ్లేషించక తప్పదనుకున్నాడు. రెండో దశ రచనలన్నీ జలయజ్ఞాన్ని నిశితంగా విశ్లేషించినవే కావడం మనం గమనించాలి. జలయజ్ఞం తాత్విక భూమికను ఎరుక పరచడంలో ఆయన చూపించిన నైపుణ్యం అనితరసాధ్యం. ప్రభుత్వంలో ఉన్న నాలాంటి ఇంజనీర్లందరికీ కనువిప్పు కలిగించే విధంగా ఆయన రచనలు సాగినాయి. కృష్ణా నీళ్ళని శ్రీశైలం జలాశయం ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రేగ్యులెటర్ ద్వారా సుమారు 250 టిఎంసిల నీటిని తరలించడానికి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నమొదటి నిర్ణయం శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టాన్ని(ఎమ్ డీ డీఎల్ ) 834 అడుగుల నుంచి 854 అడుగులకు పెంచడం. 11,200 క్యూసెక్కుల నీటిని తరలించే సామర్థ్యం కలిగిన పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్ద అదనంగా 44 వేల క్యూసేక్కులను తరలించుకుపోవడానికి 10 కొత్త తూములని నిర్మించడానికి చర్యలు చేపట్టడం. అంటే పాతవి కొత్తవి కలిపి పోతిరెడ్డిపాడు నుంచి మొత్తం 55 వేల క్యూసేక్కులని తరలించే ఏర్పాట్లు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపొయినాయి.
“విద్యాసాగర్ రావు కృష్ణా బోర్డు సమావేశాల్లో పాల్గొంటే తమ పప్పులు ఉడకవు అని భావించి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజకీయ పదవి నిర్వహిస్తున్న విద్యాసాగర్ రావు కృష్ణ బోర్డు సమావేశాల్లో పాల్గొనడానికి అర్హుడు కాదు అని తెలంగాణా ప్రభుత్వానికి లేఖ రాయించిండు చంద్రబాబునాయుడు. తనవల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకూడదని భావించి తనే స్వచ్చందంగా తప్పుకున్నాడు. అయితే బోర్డు సమావేశాలు జరిగే ముందు తప్పనిసరిగా సమీక్ష జరిపి రాష్ట్ర ప్రతినిధులకు సూచనలు చేసేవారు. మన వాదనలు ఎట్లా ఉండాలో నిర్దేశించేవారు. అయితే ఒక విషయాన్ని చెప్పక తప్పదు..”
రాయలసీమలో 250 టిఎంసిల నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలని నిర్మించడం, శ్రీశైలం నుంచి తరలించుకపోయే 250 టిఎంసిల కృష్ణా నీటి లోటుని ఆంద్ర ప్రాంతానికి సమకూర్చడానికి గోదావరిపై రెండు ప్రాజెక్టులని రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. ఒకటి పోలవరం, రెండోది దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ లింక్ పథకం. ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా, కోర్టు కేసులు ఉన్నా, పక్కరాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినా, లక్షలాదిగా ప్రజలు నిర్వాసితులవుతున్నా, ఆదివాసీల నుంచి ఉద్యమాలు వస్తున్నా కూడా మొండిగా పోలవరం నిర్మాణానికి సంకల్పించినాడు. కోర్టు కేసుల వలన పోలవరం డ్యాం నిర్మాణం సాధ్యం కాకపోయినా పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజికి గోదావరి నీటిని తరలించడానికి కుడి కాలువను కాలువలను తవ్వించినాడు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం కుడి కాలువ ద్వారా 80 టిఎంసిల నీటిని కృష్ణా డెల్టాకు తరలించే వెసులుబాటు ఉన్నది. 165 టిఎంసిల గోదావరి నీటిని దుమ్ముగూడెం వద్ద ఎత్తిపోసి నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ కు తరలించి రివర్సిబుల్ పంపుల ద్వారా నాగార్జున సాగర్ కు ఎత్తిపోసి కుడి కాలువ ద్వారా నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరివ్వడానికి డిపిఆర్ లు లేకుండానే టెండర్లు పిలిచినారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా ఆంధ్ర ప్రాంతానికి 225 టిఎంసిల నీరు సమకూరుతుందని ఆంద్ర ప్రాంత నాయకత్వాన్ని నోరెత్తకుండా చల్లబర్చినాడు.
ఈ క్రమంలో తెలంగాణకు కూడా న్యాయం చేస్తున్నానని నమ్మబలకడానికి ప్రాణహిత-చేవెళ్ళ పథకాన్ని ప్రారంభించినాడు. అప్పటికే ప్రారంభమైన మరికొన్ని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులని జలయజ్ఞంలో చేర్చి తెలంగాణా నాయకత్వాన్ని నోరెత్తకుండా చేయగలిగినాడు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రల్ని సమర్థవంతంగా, నైపుణ్యంతో, పదునైన విశ్లేషణతో బహిర్గతం చేసిన మేధావి విద్యాసాగర్ రావు ఒక్కడే. ఈ కుట్రలను అర్థం చేసుకొని రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించిన తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు పి.జనార్ధన్ రెడ్డి ఒక్కడే. 2009 ఎన్నికల నాటికి రాయలసీమ ప్రాజెక్టులు, పోతిరెడ్డిపాడు తూముల నిర్మాణం, పోలవరం కుడి కాలువ నిర్మాణం పూర్తి అయినాయి. తెలంగాణా ప్రాజెక్టులు మాత్రం భూసేకరణ జరుగక, అటవీ అనుమతులు లేక, అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కారం కాక దేకుతూనే ఉన్నాయి. మరో వైపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణా ఏర్పాటును అనేక కారణాలు చెబుతూ వాయిదా వేస్తూనే ఉన్నది. అసంతృప్తికి గురి అయిన తెలంగాణా సమాజం ఏ విధంగా ఉద్యమ బాటలో నడచి తెలంగాణ సాధించుకున్నదో అందరికీ తెలిసిన చరిత్రే.
2012 లో విద్యాసాగర్ రావు రాసిన రెండో దశ వ్యాసాలని “నీళ్ళు- నిజాలు-2” గా తెలంగాణా ఇంజనీర్ల జెఎసి, తెలంగాణా విశ్రాంత ఇంజనీర్ల ఫోరం సంయుక్తంగా ప్రచురించినాయి. ఈ రెండో సంపుటానికి కూడా ఆయన నాకే సంపాదకత్వ బాధ్యతలు అప్పగించినారు. ఈ రెండో సంపుటాన్ని కెసిఆర్ గారు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఆవిష్కరించి విద్యాసాగర్ రావుని అభినందించినారు. “నీళ్ళు – నిజాలు” రెండు సంపుటాలను తెలంగాణా ప్రజలు హృదయపూర్వకంగా ఆదరించినారు. ఇప్పుడు పోటీ పరీక్షలకు చదువుతున్న విద్యార్థులకు ఈ రెండు సంపుటాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
సాగునీటి సలహాదారుడుగా …
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కాగానే కె సి ఆర్ నాయకత్వాన తొలి తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత విద్యాసాగర్ రావు గారిని ప్రభుత్వం సాగునీటి సలహాదారుగా నియమించుకున్నది. అది ఆయనకు దక్కిన సహజ న్యాయంగా నేను భావిస్తున్నాను. సాగునీటి శాఖకు మంత్రిగా నియమితులైన హరీష్ రావు గారి వద్ద ఓ ఎస్ డి గా పనిచేయడానికి అవకాశాన్ని ప్రభుత్వం నాకు కల్పించడంతో విద్యాసాగర్ రావు గారితో మరింత సన్నిహితంగా పనిచేయడానికి అవకాశం చిక్కింది. తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న తక్షణ నిర్ణయాల్లో కుట్ర పూరిత ప్రాజెక్టు అయిన దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టుని రద్దు చెయ్యడం, ప్రాణహిత–చేవెళ్ళ, దేవాదుల, కంతనపల్లి, శ్రీరాంసాగర్ వరద కాలువ, రాజీవ్ దుమ్ముగూడెం, రుద్రంకోట ఇందిరాసాగర్ ప్రాజెక్టులని కూలంకషంగా మధించి ఉత్తర తెలంగాణా అవసరాలకు అనుగుణంగా రీ-ఇంజనీరింగ్ ప్రక్రియను చేపట్టడం, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చి అటకకెక్కించిన పాలమూరు-రంగారెడ్డి, డిండీ ఎత్తిపోతల పథకాలని సమీక్షించి తెలంగాణా అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకొని ప్రాజెక్టులని చేపట్టడం, ఉమ్మడి ప్రభుత్వ హయాంలో విధ్వంసమైన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునరుద్దరించుకోవడం కోసం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించడం, కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన వాటా దక్కించుకోవడానికి కేంద్ర ప్రభుత్వ వివిధ వేదికలపై పోరాటాన్ని కొనసాగించడం.. ఈ అన్ని అంశాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ తో కలిసి రోజుల తరబడి జరిగిన మేధోమథనంలో సలహాదారుగా విద్యాసాగర్ రావు గారు క్రియాశీలకంగా భాగస్వాములైనారు. ముఖ్యంగా కృష్ణా నీటిలో వాటా కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో కొనసాగుతున్న పోరాటంలో విద్యాసాగర్ రావు సూచనలు, సలహాల మేరకే అఫిడవిట్లు తయారయినాయి.
విభజన చట్టం ద్వారా ఏర్పాటైన కృష్ణ నదీ యాజమాన్య బోర్డు సమావేశాల్లో విద్యాసాగర్ రావు సమర్థవంతంగా వాదనలు వినిపించేవారు. ఆయన వాదనల దాటికి తట్టుకోలేక, జవాబులు చెప్పలేక బోర్డులో ఆయన పాల్గోనడాన్నే ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు ప్రశ్నించేవారు. ఒక సమావేశంలో ఈ విధంగా ప్రశ్నించినప్పుడు వారితో “ఈ సమావేశానికి నేను తమాషా చెయ్యడానికి రాలేదు. తెలంగాణా ప్రయోజనాలని రక్షించడానికి వచ్చాను” అని ఆగ్రహం ప్రకటించినారు. విద్యాసాగర్ రావు కృష్ణా బోర్డు సమావేశాల్లో పాల్గొంటే తమ పప్పులు ఉడకవు అని భావించి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజకీయ పదవి నిర్వహిస్తున్న విద్యాసాగర్ రావు కృష్ణ బోర్డు సమావేశాల్లో పాల్గొనడానికి అర్హుడు కాదు అని తెలంగాణా ప్రభుత్వానికి లేఖ రాయించిండు చంద్రబాబునాయుడు. తనవల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకూడదని భావించి తనే స్వచ్చందంగా తప్పుకున్నాడు. అయితే బోర్డు సమావేశాలు జరిగే ముందు తప్పనిసరిగా సమీక్ష జరిపి రాష్ట్ర ప్రతినిధులకు సూచనలు చేసేవారు. మన వాదనలు ఎట్లా ఉండాలో నిర్దేశించేవారు. అయితే ఒక విషయాన్ని చెప్పక తప్పదు. కృష్ణా బోర్డు సమావేశాలలో ఆయన పాల్గోన్నంత కాలం బోర్డు నిర్ణయాలు సమతూకంతో ఉండేవి. ఆయన తప్పుకున్న తర్వాత పరిస్థితి అదుపు తప్పింది. బోర్డు నిర్ణయాల్లో సమతూకం తప్పింది.
“తొలి నాళ్లలో ఆయన కవిత్వం కూడా రాసేవారు. “ప్లస్ మైనస్” అనే కవిత్వ సంపుటాన్ని కూడా ప్రచురించినారు. విద్యాసాగర్ రావు గారి అంత్యక్రియలు జరిగిన అంబర్ పేట స్మశాన వాటికలో వరవరరావు గారు ఆయనకు నివాళి ఆర్పించేందుకు వచ్చినప్పుడు విద్యాసాగర్ రావు తొలి కవిత ప్లస్ మైనస్ ని తానే సృజనలో అచ్చువేసినానని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగ రీత్యా దిల్లీలో ఆయన కవిత్వాన్ని వదిలి నాటకాలను రాయడం, వాటిని ప్రదర్శించడం, నాటకాలకు ప్రయోక్తగా వ్యవహరిస్తూ, రేడియో కార్యక్రమాలకు స్క్రిప్టులు రాస్తూ తన సాహిత్య దాహాన్ని తీర్చుకున్నారు..”
ఆయన అనారోగ్యానికి గురి అయిన తర్వాత 2016 లో మొదటి అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు ఏర్పాటు అయిన బజాజ్ కమిటీ రెండు రాష్ట్రాల పర్యటనకు వచ్చింది. మొదటి రోజు హైదరాబాద్ లో తెలంగాణా ప్రతినిధులతో సమావేశం జరిగింది. రెండో రోజు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులతో సమావేశమైనారు. మూడో రోజు రెండు రాష్ట్రాల సంయుక్త సమావేశం జరిగింది. తెలంగాణా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించింది విద్యాసాగర్ రావు గారే. రెండు రాష్ట్రాల సంయుక్త సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పట్టిసీమ నుంచి గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు తరలిస్తున్న నీటిలో తెలంగాణా వాటా ఎంతో తేల్చవలసిన అంశం తమ పరిధిలో లేదని బజాజ్ ప్రకటించినారు. ఇది మొదటి రోజు బజాజ్ కమిటీ వెల్లడించిన వైఖరికి పూర్తిగా భిన్నంగా ఉండడంతో విద్యాసాగర్ రావు ఆగ్రహంతో “ఈ అంశం మీ పరిధిలో లేకపొతే ఈ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నట్టు? ఈ పర్యటన ఎందుకు జరుపుతున్నట్లు? మీ వైఖరి శోచనీయం మిస్టర్ బజాజ్” అని నిష్కర్షగా అన్నారు. ఇట్లా అవసరమయినప్పుడు తెలంగాణా ప్రయోజనాలను పరిరక్షించడానికి మర్యాదలను పక్కన పెట్టి మాట్లాడేవారు. ఇది ఆయన వ్యక్తిత్వంలో మరో పార్శ్వం.
సాగునీటి మంత్రి హరీశ్ రావు గారు ప్రతీ శనివారం క్రమం తప్పకుండా నిర్వహించే మిషన్ కాకతీయ వీడియో కాన్ఫరెన్స్ లకు, ప్రాజెక్టులపై నిర్వహించే సమీక్షా సమావేశాలకు, క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలకు తప్పనిసరిగా విద్యాసాగర్ రావు గారిని ఆహ్వానించే వారు. దిల్లీలో అంతర్ రాష్ట్ర సంబంధిత అంశాలను పరిష్కరించే బాధ్యతని మంత్రిగారు విద్యాసాగర్ రావు గారికే అప్పగించేవారు. దిల్లీలో కేంద్ర జలసంఘం అధికారులతో, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో తనకున్న పరిచయాలతో సమస్యలను పరిష్కరించడంలో విద్యాసాగర్ రావు గారు విశేషంగా కృషి చేసినారు. ఆయన మరణం తర్వాత ఈ అంశంలో ఒక లోటు స్పష్టంగా అనుభవంలోకి వచ్చింది.
సాహిత్య పిపాసి :
విద్యాసాగర్ రావు “నీళ్ళు–నిజాలు” రచయితగానే తెలంగాణా ఉద్యమ శ్రేణులకు తెలుసు. అయితే ఆయనలో ఉత్తమమైన సాహిత్య పిపాసి కూడా ఉన్నాడని అతికొద్ది మంది సన్నిహితులకు మాత్రమే తెలుసు. తొలి నాళ్లలో ఆయన కవిత్వం కూడా రాసేవారు. “ప్లస్ మైనస్” అనే కవిత్వ సంపుటాన్ని కూడా ప్రచురించినారు. విద్యాసాగర్ రావు గారి అంత్యక్రియలు జరిగిన అంబర్ పేట స్మశాన వాటికలో వరవరరావు గారు ఆయనకు నివాళి ఆర్పించేందుకు వచ్చినప్పుడు విద్యాసాగర్ రావు తొలి కవిత ప్లస్ మైనస్ ని తానే సృజనలో అచ్చువేసినానని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగ రీత్యా దిల్లీలో ఆయన కవిత్వాన్ని వదిలి నాటకాలను రాయడం, వాటిని ప్రదర్శించడం, నాటకాలకు ప్రయోక్తగా వ్యవహరిస్తూ, రేడియో కార్యక్రమాలకు స్క్రిప్టులు రాస్తూ తన సాహిత్య దాహాన్ని తీర్చుకున్నారు. ఆయన రాసిన ఒక డజను నాటకాలను ప్రచురించి, ఒక మూడు రోజుల పాటు నాటకాలను ప్రదర్శిస్తే చూసి ఆనందించాలని ఆయన కోరుకున్నారు. తెలంగాణా థియేటర్ రీసెర్చ్ వారితో ఆ ఏర్పాట్లు చేసుకొమ్మని సూచించారు . వాటికి నిధులు తానే సమకూరుస్తానని కూడా వారికి హామీ ఇచ్చినారు.
ఆ సంస్థ ప్రతినిధి విజయ్ కుమార్ గారు ఆ పనిలో నిమగ్నమైనారు. ఈ లోపల క్యాన్సర్ వలన ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో పుస్తకం పని చూస్తున్న బి నరసింగరావు గారు నన్ను సంప్రదించమని సూచించినారు. విజయకుమార్ గారు 2017 మే నెల రెండో వారంలో నాటకాల పుస్తకావిష్కరణ, నాటకాల ప్రదర్శనకు జరుగుతున్న ఏర్పాట్ల గురించి నాతో చర్చించినారు. అప్పటికే ఆయన కాంటినెంటల్ హాస్పిటల్ లో స్పృహలో లేని స్థితిలో ఉన్నారు. నాటకాల ప్రదర్శన వాయిదా వేసి మొదట పుస్తకాన్ని ప్రచురించి ఆయన చేతిలో పెడదాము. ఆయన బాగై వస్తే ఆయన కోరుకున్నట్లు నాటకాలు కూడా ప్రదర్శిద్దామని వారికి సూచించినాను. చిక్కడపల్లిలో హిమాలయ గ్రాఫిక్స్ సూరి గారితో మాట్లాడి పుస్తక ప్రచురణకు ఏర్పాట్లు చేసినాను. పుస్తకం దాదాపు పూర్తి కావచ్చింది. అట్లనే ఆచార్య జయశంకర్ గారిని ఇంటర్వ్యు చేసి “వొడవని ముచ్చట్లు” వెలువరించిన కొంపెల్ల వెంకట్ గౌడ్ గారు విద్యాసాగర్ రావుని కూడా ఇంటర్వ్యు చేసి ఉన్నారు. ఆ పుస్తకాన్ని కూడా త్వరగా తీసుకురావాలని కోరినాను. ఆ పని కూడా ఆయన చేపట్టినారు. ఈ లోపల 29 ఏప్రిల్ న ఆయన మరణం ఆయనకు ఈ రెండు పుస్తకాలు కానుకగా ఇద్దామని చేస్తున్న ప్రయత్నానికి విఘాతం కలిగింది. ఆయన మరణానంతరం ఆ రెండు రెండు పుస్తకాలని తెలంగాణా ప్రజలకు అందించాము.
ఘనమైన వీడ్కోలు :
విద్యాసాగర్ రావు గారి మరణంపై రెండు ముచ్చట్లు. ఆయన చనిపోక ముందే కొన్ని టి వి చానెళ్ళు ఆయన మరణ వార్తని ప్రసారం చేయడంతో సోషల్ మీడియాలో నివాళి అర్పిస్తూ పోస్టింగులు వెల్లువెత్తినాయి. ఎంతో ప్రయత్నం చేస్తే గాని వాటిని ఆపివేయించ లేకపోయినాము. ఆయన మరణాన్ని హాస్పిటల్ యాజమాన్యం ధృవీకరించే దాకా మీడియావారు సంయమనం పాటించాలని కోరినాము. ఇదే విషయాన్ని పాశం యాదగిరి గారికి చెప్పి వాపోయినప్పుడు ఆయన నన్ను ఊరడిస్తూ గతంలో ప్రముఖులకు జరిగిన సంగతులు చెప్పినాడు. ఫైజ్ ఆహమాద్ ఫైజ్ ప్రముఖ ఉర్దూ కవి. దేశ విభజన తర్వాత పాకిస్తాన్ లో ఉండిపొయినారు. పాకిస్తాన్ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు కూడా. ఆయన తీవ్ర అనారోగ్యం పాలై హాస్పిటల్ లో చేరినప్పుడు ఆలిండియా రేడియో ఆయన మరణ వార్తని ప్రసారం చేసిందట. ప్రధానమంత్రి నెహ్రూ ఫైజ్ భార్యకు ఫోన్ చేసి తన సంతాపాన్ని తెలియజేసినారట. ఆమె ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ ఆయన ఇంకా బతికే ఉన్నాడని చెప్పి ఫైజ్ తో ఫోన్లో మాట్లాడించిందట. మొరార్జీదేశాయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్న జయప్రకాష్ నారాయణ్ మరణ వార్త వెలువడినప్పుడు భారత పార్లమెంటే ఆయనకు నివాళి అర్పించి ఆ తర్వాత తప్పయ్యిందని నాలిక కరుచుకున్నారట. మన మీడియా వారు విద్యాసాగర్ రావుని కూడా అటువంటి ప్రముఖుల జాబితాలో చేర్చినారు. అది మీడియా వారి అత్యుత్సాహమే అయినా ఆయనకు ఘనమైన నివాళి అర్పించేందుకు చేస్తున్న ప్రయత్నంగా మనం అర్థం చేసుకోవాలని అన్నారు. పాశమన్న చెప్పినట్లుగానే విద్యాసాగర్ రావు మరణం అనంతరం మీడియా అతనికి ఘనమైన వీడ్కోలు పలికింది.
కన్న ఊరిపై మమకారం :
విద్యాసాగర్ రావు గారికి ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు. ఒక కూతురు. చిన్న కొడుకు చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయినాడు. ఆయన హబ్సిగూడ ఇంటికి నాగేష్ స్మృతి అని పేరు పెట్టుకున్నారు. పెద్ద కొడుకు రమణ కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అల్లుడు రాజేశ్వర్ రావు గారు త్రిపుర క్యాడర్ కు చెందినా ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు ఆయనే విద్యాసాగర్ రావు కుటుంబానికి పెద్ద దిక్కు. విద్యాసాగర్ రావు రాష్ట్రానికి సేవలు అందించినా పుట్టిన ఊరు జాజిరెడ్డి గూడెంని మరువలేదు. తన ఊరుకి ఏమైనా చేయాలని తపన పడినారు. తమ పూర్వీకుల ఇంటిని కూల్చి ఆ జాగాని కల్యాణ మండపం నిర్మాణం కోసం అప్పగించినారు. మంత్రి హరీశ్ రావు గారి చేత శంఖు స్థాపన కూడా చేయించినారు. మంత్రి గారిని ఒప్పించి జాజిరెడ్డి గూడెంలో ఒక సబ్ మార్కెట్ యార్డుని కూడా సాంక్షన్ చేయించినారు.
అర్వపల్లిలో ఉన్న ప్రాచీన లక్ష్మి నరసింహస్వామి దేవాలయ అభివృద్ధి కోసం స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ గార్లని కలిసి ఫైలును ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపినారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఆయన కోరికను మన్నించి ఒక కోటి రూపాయలు మంజూరు చేసినారు. జి ఓ వచ్చేనాటికి ఆయన స్పృహలో లేరు. వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు నేనే జి ఓ కాపీని ఆయన చేతిలో పెట్టి “సార్ అర్వపల్లి జి ఓ కాపీ తెచ్చాను, నాటకాల పుస్తకం అచ్చయ్యింది, కల్యాణ మంటపం పనులు ప్రారంభం అయినాయి” అని చెవిలో గట్టిగా చెప్పినాను. ఆయన విన్నారో లేదో ఆయనకే ఎరుక. ఆయన మరణానంతరం జాజిరెడ్డి గూడెంలో భవ్యమైన కల్యాణ మండపం పూర్తి అయి ప్రజలకు సేవలు అందిస్తున్నది. అర్వపల్లి దేవాలయం అభివృద్ది పనులు కూడా పూర్తి అయినాయి.
తెలంగాణా తీర్చుకున్న ఋణం :
తెలంగాణా ప్రజలకు ఆయనకు పలికిన వీడ్కోలు అవ్యాజనీయం. మీడియా సహకారం అపూర్వం. ప్రభుత్వం ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ఆయనకు దక్కిన గొప్ప గౌరవం. డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్ రావు పేరు పెట్టి ఆయన పేరును చిరస్థాయిగా నిలచి పోయేటట్టు చేసింది తెలంగాణా ప్రభుత్వం. సాగునీటి శాఖ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పినారు. ఆయన నవంబర్ 14 జన్మ దినాన్ని తెలంగాణా ఇరిగేషన్ డే నిర్వహించి ఆ రోజున సాగునీటి శాఖలో పని చేస్తున్న సర్వీస్ ఇంజనీర్లకు ‘ఉత్తమ ఇంజనీర్’ అవార్డులు ఇస్తున్నారు. తెలంగాణా విశ్రాంత ఇంజనీర్ల సంఘం వారు తమ సంఘం లోగోలో విద్యాసాగర్ రావు బొమ్మను పెట్టుకున్నారు. ఎర్రం మంజిల్ లో ఉన్న తెలంగాణా ఇంజనీర్ల వసతి గృహానికి ‘విద్యాసాగర్ రావు భవన్’ గా నామకరణం చేసినారు. ఈ గౌరవం తెలంగాణా ఉద్యమానికి, తెలంగాణా ప్రభుత్వానికి ఆయన అందించిన నిస్వార్థ సేవలకు తెలంగాణా సమాజం తీర్చుకున్న రుణంగా భావిస్తున్నాను.
(ఏప్రిల్ 29, ఆర్ విద్యాసాగర్ రావు వర్ధంతి సందర్భంగా)





