డీజీపీని క‌లిసిన బాక్స‌ర్, డీఎస్పీ నిఖ‌త్ జ‌రీన్‌

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 14: అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన బాక్సింగ్ ఛాంపియన్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు నిర్వహిస్తున్న నిఖత్ జరీన్ డీజీపీ కార్యాలయంలో డీజీపీ సి.వి. ఆనంద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ  ఆనంద్ నిఖత్ జరీన్ సాధించిన విశిష్ట విజయాలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి భారతదేశానికి, రాష్ట్రానికి ఎనలేని గౌరవాన్ని తీసుకువచ్చారని ప్రశంసించారు. ఆమె విజయాలు తెలంగాణ యువతకు, ముఖ్యంగా మహిళా క్రీడాకారిణులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ జాతీయ, అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్రానికి, దేశానికి, తెలంగాణ పోలీసు శాఖకు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇప్పటివరకు కనబరిచిన క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావంతోనే ముందుకు సాగాలని ఆమెకు సూచించారు. తాను కూడా క్రీడాకారుడిగా ఉన్న అనుభవాన్ని పంచుకున్న డీజీపీ, క్రీడల్లో విజయం సాధించాలంటే కఠినమైన క్రమశిక్షణ, నిరంతర శ్రమ, శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం అత్యంత అవసరమని అన్నారు. లక్ష్యంపై ఏకాగ్రతతో ముందుకు సాగుతూ యువతకు ఆదర్శంగా నిలవాలని, ఒకవైపు పోలీసు అధికారిణిగా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూనే మరోవైపు అంతర్జాతీయ బాక్సింగ్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ మాట్లాడుతూ తన క్రీడా ప్రతిభను గుర్తించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసు శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకాన్ని తాను ఒక గొప్ప గౌరవంగా, మరింత బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. దేశానికి మరిన్ని పతకాలు సాధించి, రాష్ట్రానికి, తెలంగాణ పోలీసు శాఖకు అంతర్జాతీయ వేదికలపై మరింత గౌరవం తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నిఖత్ జరీన్ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *