ప్రస్తుతం సాహిత్య ప్రపంచం రెండువర్గాలుగా చీలిపోయింది. ఒకవర్గం సృజనరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకాన్ని సమర్థిస్తుంటే, మరోవర్గం దీనిపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తోంది. యంత్రానికి సృజనను అప్పగించడం అంటే, మనిషి అస్తిత్వాన్ని కోల్పోవడమేనన్నది ఈ నిరసనకారుల ప్రధానవాదన. ఈ ఘర్షణకు, ప్రస్తుతం సృజనకారులు ఎదుర్కొంటున్న కొత్త అస్తిత్వ సంక్షోభానికి ఇటీవల జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రతిష్టాత్మక ‘కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్’ విజేతగా నిలిచిన జమీర్ నజీర్ రాసిన ‘ది సర్పెంట్ ఇన్ ది గ్రోవ్’ కథను ఏఐ సాయంతో రాశారంటూ తీవ్రవిమర్శలు చెలరేగాయి. ఆ కథలోని వాక్యనిర్మాణాలు అత్యంత పాలిష్డ్‌గా ఉండటమే అనుమానాలకు కారణం. చివరకు ఫౌండేషన్ స్వయంగా దర్యాప్తు చేసి, ఆ రచయిత చిత్తుప్రతులను పరిశీలించి, అది నూటికి నూరుపాళ్లూ అతని సొంతసృజనేనని ఆధారాలతో సహా తేల్చాల్సివచ్చింది.
ఇక్కడ భయపెట్టే విషయం ఏమిటంటే- ఒక రచయిత అత్యద్భుతంగా రాస్తే, “ఇంత అద్భుతంగా రాశాడంటే కచ్చితంగా ఏఐనే వాడి ఉంటాడు” అని అనుమానించి బోనులో నిలబెట్టేస్థాయికి సమాజం చేరుకోవడం. “ఇప్పుడు ఒక యువరచయిత కేవలం తన ప్రతిభనేకాదు, తన మానవత్వాన్ని కూడా నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం శోచనీయం” అని ఫౌండేషన్ డైరెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన సృజనకు, ఏఐ సృష్టించే మాయకు మధ్య ఇంతటి సంఘర్షణ ఎందుకు వస్తోంది?
కథ రాయడమంటే క్లిష్టమైన పజిల్ సాల్వ్ చేయడం లాంటిది. మనస్సులో, మెదడులో చెల్లాచెదురుగా ఉన్న ఆలోచనలను కాగితంమీద పొందుపరచడం ఒక యజ్ఞం. అందులో ప్రతిపదం, ప్రతివాక్యం పజిల్ పీస్ లాంటిది. కొన్నిసార్లు ఆ పీసులన్నీ వెంటవెంటనే దొరికేసి, ఆ పజిల్ వేగంగా పూర్తవుతుంది. కానీ చాలాసార్లు, మొదటిపీస్ దొరికినతర్వాత రెండోపీస్ కోసం గంటలతరబడి వెదకాల్సి వస్తుంది. మరికొన్నిసార్లు ముగింపు అస్సలు దొరకదు. ఆ తప్పిపోయిన పీసులు ఎప్పుడు దొరుకుతాయి, అసలు దొరుకుతాయా లేదా, ఆ పజిల్ ఎప్పుడు పూర్తవుతుంది? అనేది కేవలం కాలమే నిర్ణయిస్తుంది. అదే, ఆ పజిల్ పీసులన్నీ తీసుకువెళ్లి ‘ఏఐ’ చేతిలో పెడితే, అది క్షణాల్లో పూర్తయిన పజిల్‌ను మీ చేతిలో పెడుతుంది. కానీ అందులో జీవం ఉండదు. ఎందుకంటే, కథ రాయడం అనేది రిగోరియస్ ప్రాసెస్, ప్రసవవేదన. ఆ అక్షరాల పజిల్‌ను పూర్తిచేసే క్రమంలో రచయితలు తమనుతాము ప్రశ్నించుకుంటారు, అసహ్యించుకుంటారు, అప్పుడప్పుడూ నిస్సహాయతతో బూతులు కూడా తిట్టుకుంటారు.
ఈ సృజనాత్మక వేదనను ఉద్దేశించే ప్రఖ్యాత రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే ఇలా అన్నాడు- “రాయడంలో ఏమీలేదు. నువ్వు చేయాల్సిందల్లా టైప్‌రైటర్ ముందు కూర్చుని రక్తం చిందించడమే”. కానీ ఏఐ ఈ బాధను, ఘర్షణను మాయం చేస్తుంది. ఇక్కడే మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి: “Frictionless creation leads to weightless and soulless art.” సాంకేతికత ఎంత ఎదిగినా, మనిషి ఆలోచనలను, ఆకలిని, అనుభూతిని యంత్రం పలికించలేదు. ఉదాహరణకు, దేవరకొండ బాలగంగాధరతిలక్ 1961లో రాసిన “నల్లజర్ల రోడ్డు” కథే దీనికి నిదర్శనం. కాకులు దూరని కారడవిలో, అర్ధరాత్రి పాముకాటుకు గురై ప్రాణాపాయస్థితిలో ఉన్న భూషణం స్నేహితుడిని, సూరీడు అనేయువతి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చీకట్లో పసరుమొక్క తెచ్చి కాపాడుతుంది. అదేరాత్రి భూషణం ఆ యువతిని తన కోరిక తీర్చమని అడుగుతాడు. అందుకు డబ్బుకూడా ఇస్తానంటాడు. అప్పుడు ఆ యువతి నవ్వి.. “అందుకు డబ్బెందుకు బాబూ?” అంటుంది. “అయితే…?” అంటాడు భూషణం. వెంటనే ఆ యువతి, “నేనలాంటిదాన్ని కాను. పోయి పడుకో అయ్యా, ఎవరైనా వింటే నవ్వుతారు కూడా” అంటూ మరోవైపు తిరిగి పడుకుంటుంది. మనిషినైజంలోని వైరుధ్యాన్ని, మనిషిలోని నిష్కల్మషమైన ఆత్మగౌరవాన్ని అంత సూటిగా, సహజంగా ‘ఏఐ’ రాయగలుగుతుందా, అసలు నల్లజర్లరోడ్డు లాంటి ఒకకథను ఊహించగలుగుతుందా?
అలాగే రచయిత అఫ్సర్ రాసిన రకూన్ కథలో, ఎక్కడో అమెరికాలో ఉంటున్న కొడుకు చనిపోయిన తల్లిని తలచుకుని పడే ఘర్షణ చూడండి: “అప్పుడు అర్ధరాత్రి ఒంటిగంటకీ, రెండుగంటలకీ మధ్య మెలకువ రావడం ఆ తర్వాత రోజూ మామూలు అయిపోయింది. అది ఒట్టి మెలకువే అయితే బాగుండేది. దాని చుట్టూరా అమ్మ చివరిముఖం. చివరినవ్వూ. తనవైపే చూస్తూ ఏదో చెప్తున్నట్టుగా, చెప్తూ చెప్తూ కిందకి వాలిపోయిన ఆ రెండుకళ్ళూ… ‘ఎంత బతుకురా ఇది?! ఆ కొంతబతుక్కి అంతదూరం వెళ్లాలా?’ అన్న అమ్మమాట ఇప్పుడు ఈ అర్ధరాత్రి ఒంటిగంటా- రెండుగంటల మధ్య గంట కొట్టినట్టు వినిపిస్తూ ఉంటుంది.” ఆ వాక్యం రాయాలంటే ఆ రచయిత లోలోపల ఎలాంటి వేదన అనుభవించి ఉండాలి, ఎన్ని నిద్రలేనిరాత్రులు గడిపి ఉండాలి? అది అఫ్సర్ లాంటి రచయిత మాత్రమే రాయగలడు. ఇలాంటి గుండెను పిండేసే కథలను, వాక్యాలను ఏఐ రాయగలుగుతుందా?
“సరే, ఇదంతా నాకెందుకు? నా ఇష్టం. నేను ఏఐ వాడేస్తాను, కథలు రాసేస్తాను” అంటారా? రాయండి, అందులో తప్పులేదు. అది మీ స్వేచ్ఛ. కానీ రేపు ఆ కథ ఏదోపత్రికలో ప్రచురితమైనప్పుడు, ఆ కథ చదివి, అందులోని ముగింపు చూసి చలించిపోయిన ఒకపాఠకుడు మీకు ఫోన్ చేసి “ఎంత బాగా రాశారండీ! ఆ ముగింపు అద్భుతం. ఆ ఒక్కవాక్యం దగ్గర నేను ఏడ్చేశాను” అని చెబితే, మీరు ఎలా స్పందిస్తారు? ఆ ముగింపు మీరు రాయలేదు. ఆ వాక్యం మీదికాదు. ఒక యంత్రం రాసిన వాక్యానికి దొరికిన ఆ ప్రశంసను మీరు ఎలా స్వీకరిస్తారు? మనస్సాక్షికి తెలుసుకదా ఆ కథ, ఆ వాక్యం మనం రాయలేదని! అందుకే యంత్రానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోకుండా మీదైనవాక్యం, మీలోంచి వచ్చినవాక్యం, మిమ్మల్ని పరిచయంచేసే వాక్యం రాయండి.





