మెరుపు తీగెలు
బూజు పట్టింది!
పచ్చడికేనా??
‘బూజు పట్టింది’ కాదు. ‘బూజు పట్టించింది’ అన్నారు, అదేదో ‘పచ్చడి పట్టించినట్టు’!
అన్ని వేళ్ళూ దోషిని చేస్తూ నన్నే చూపించాయి!
‘నేను తడివి యేమీ పెట్టలేదు’ అర్థంకాక చెప్పిందే చెప్పాను.
‘నువ్వు నెలసరి అప్పుడు ముట్టి వుంటావు’ అంది మా అత్తమ్మ.
‘కోపగించుకోకు, లేకపోతే బంగారంలాంటి పచ్చడి యెందుకు పాడవుతుంది చెప్పు’ అంది మా అమ్మ కూడా, ఫోన్లో.
‘అక్కా, నీతోపాటే పచ్చడి పెట్టాను, మా యింట్లో పోలేదే?’ అంది చెల్లి. బాధ చెప్పుకుంటే తగ్గుతుందని కాల్ చేస్తే బాధని పెంచేసింది.
‘అందుకే పచ్చడి జాడీని అక్కడా యిక్కడా కాకుండా దేవుడి గదిలో పెట్టేది’ అంది మా వదిన, నువ్వు అన్నీ యిలాగే చేస్తావన్నట్టు.
‘ఈ సంసారం రందిలో యేం గుర్తుంటుంది చెప్పు?, వొకసారి మా యింట్లో కూడా అలాగే అయ్యింది. అయినా కష్టపడి చేసింది కావాలని పాడుచేస్తామా చెప్పు’ వోదార్పులోనూ తప్పు నాదేనని తేల్చేసింది పక్కింటి పిన్ని.
‘నాకు జాగ్రత్తలు చెప్పీ నువ్వేం మమ్మీ?’ యిలా చేశావన్నట్టు నా కూతురు కూడా నావేపు వొక చూపు చూసింది.
‘అయినా నీకీమధ్య మతిమరుపు యెక్కువయిపోతోంది…’ నిష్ఠురపడ్డాడు మా ఆయన.
‘బుద్ధి లేని దాన్ని’ అని నన్ను నేనూ తిట్టుకున్నాను.
ఛ…
అదిగో అప్పుడు గుర్తొచ్చింది…
నాకు గర్భసంచి తీసేసి నాలుగేళ్ళు అయ్యిందని!





