“స్కాన్ చేసిన ప్రతి వేలిముద్ర, సంగ్రహించిన ప్రతి కనుపాప, వేసిన ప్రతి వోటు కేవలం పరిపాలనా పరమైన చిల్లర విషయంగా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు! మనల్ని భారతీయులుగా నిర్వచిస్తాయని మనకు చెప్పిన పత్రాలే అకస్మాత్తుగా డొల్లగా బయటపడ్డాయి. కాబట్టి, కత్తిలా పదునైన ప్రశ్న ఒకటి వేలాడుతోంది. ఈ కార్డులు నన్ను భారతీయుడిగా చేయకపోతే, మరి ఏది చేస్తుంది? ఇందుకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతే, మనం చెందినవారమని భావించిన దేశంలో మిగిలిందేమిటి?..”
(ప్రభు చావ్లా)
బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి, పౌరసత్వం కోసం నకిలీ పత్రాలను సృష్టించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబు అబ్దుల్ రఫ్ సర్దార్‌కు బెయిల్ నిరాకరిస్తూ, బాంబే హైకోర్టు పిడుగుపాటు వంటి తీర్పు చెప్పింది. ఈ ప్రశ్న బాధిస్తుంది, కదూ? స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత, ప్రతి స్వాంతంత్య్రదినోత్సవం నాడు ప్రగతికి సంబంధించి వాగ్దానాలు చేస్తున్నప్పటికీ, “నూతన భారతదేశం” డిజిటల్ వెన్నెముక అని పిలవబడే దానిపై బిలియన్ల కొద్దీ డబ్బు వెచ్చించిన తర్వాత కూడా, ఒక భారత పౌరుడు ఇప్పటికీ వర్షంలో కాగితంలా చిరిగిపోయే గుర్తింపు కార్డుల కట్టను పట్టుకుని నిస్సహాయంగా నిలబడి ఉండటం నేటి విషాదం.
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన హెచ్చరికను ప్రతిధ్వనిస్తూ, బాంబే హైకోర్టు ఆ భ్రమను తొలగించింది. ఆధార్, పాన్, వోటర్ ఐడి—అవి మీ గుర్తింపునకు పవిత్రమైన చిహ్నాలు—మీ పౌరసత్వం గురించి ఏమీ నిరూపించవన్నది హైకోర్టు చేసిన స్పష్టీకరణ. 95 కోట్ల మంది వోటర్లను కుదిపేస్తున్న ఒక అధికార యంత్రాంగపు బండారం బయటపడటమనేది చట్టానికి సబంధించిన చిన్న వివాదం కాదు. ఒక ద్రోహం! స్కాన్ చేసిన ప్రతి వేలిముద్ర, సంగ్రహించిన ప్రతి కనుపాప, వేసిన ప్రతి వోటు కేవలం పరిపాలనా పరమైన చిల్లర విషయంగా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు! మనల్ని భారతీయులుగా నిర్వచిస్తాయని మనకు చెప్పిన పత్రాలే అకస్మాత్తుగా డొల్లగా బయటపడ్డాయి. కాబట్టి, కత్తిలా పదునైన ప్రశ్న ఒకటి వేలాడుతోంది. ఈ కార్డులు నన్ను భారతీయుడిగా చేయకపోతే, మరి ఏది చేస్తుంది? ఇందుకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతే, మనం చెందినవారమని భావించిన దేశంలో మిగిలిందేమిటి? బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి, పౌరసత్వం కోసం పత్రాలను ఫోర్జరీ చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబు అబ్దుల్ రూఫ్ సర్దార్‌కు బెయిల్ నిరాకరిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు పిడుగుపాటులా వచ్చింది. కానీ జస్టిస్ అమిత్ బోర్కర్ వ్యాఖ్యలు స్పష్టంగా, సూటిగా ఉన్నాయి: “కేవలంఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా వోటర్ ఐడి వంటి పత్రాలు కలిగి ఉండటం వలన ఎవరూ భారత పౌరులు కాలేరు.” ఈ పత్రాలు గుర్తింపు కోసం లేదా సేవలను పొందడం కోసం మాత్రమేనని, 1955 పౌరసత్వ చట్టం ప్రకారం జాతీయతను స్థాపించడానికి కాదని ఆయన అన్నారు.
అదే రోజు, సుప్రీం కోర్టు ఒక సమాంతర కేసులో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)కు మద్దతునిస్తూ, ఆధార్‌ను “పౌరసత్వానికి నిశ్చయాత్మకమైన రుజువుగా అంగీకరించలేం” అని, దాన్ని స్వతంత్రంగా ధ్రువీకరించుకోవాలని పేర్కొంది. చొరబాటుదారులపై కఠినమైన షరతులు విధించడంలో న్యాయస్థానాలు సమర్థనీయంగానే ఉండవచ్చు. కానీ, అవిభక్త భారతదేశంలో పుట్టి, స్వతంత్ర భారతదేశాన్ని తమ సహజ నివాసంగా ఎంచుకున్న వారిపై ప్రభుత్వ సంస్థలు వాటిని ఆలోచనా రహితంగా రుద్దాలా? లేదా ఆ తర్వాత భారత్‌లో పుట్టిన వారిపై రుద్దాలా? ఇది మనల్ని ఒక కీలకమైన ప్రశ్నవైపునకు తీసుకెళుతుంది. ఒక వ్యక్తి తన భారత పౌరసత్వానికి సంబంధించిన రుజువును ఎక్కడినుంచి తీసుకురావాలి? అధికార యంత్రాంగంలోని వివాదాల కారణంగా 2011 నుండి పౌర పట్టిక (ఆర్ ఓసీ)ను సవరించలేదు. ప్రతి దశాబ్దానికి ఒకసారి లక్షలాది మంది ప్రభుత్వ అధికారులు ఎంతో శ్రద్ధతో పరిశీలించి తయారుచేసే ఏకైక విశ్వసనీయ పత్రం బహుశా ఈ పౌర పట్టికే కావచ్చు. ఇప్పుడు ఒక భారతీయుడికి వోటు హక్కును మంజూరు చేయడానికి ఈసీఐ తన సొంత యంత్రాంగాన్ని అభివృద్ధి చేసుకుంది. దీని అర్థం, ఇది వోటర్ల నియమావళి (ఆర్ ఓసీ) పాత్రను కూడా చేపట్టింది, ఎందుకంటే కేవలం భారత పౌరుడు మాత్రమే ఎన్నికలలో పాల్గొనగలడు. వోటు వేసే హక్కును పొందడానికి, వోటు వేయబోయే ప్రతి వోటరు నుండి ఇది 11 పత్రాలను కోరుతోంది.
ఈసీఐ ఇప్పుడు జనన ధృవీకరణ పత్రం, మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్, నివాస ధృవీకరణ పత్రం, వివాహ ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రం మొదలైనవి కోరుతోంది. ఆశ్చర్యకరంగా, ఆధార్, పాన్, మరియు దాని స్వంత ఫోటో గుర్తింపు కార్డు అయిన ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ వంటి ప్లాస్టిక్ లేదా డిజిటల్ గుర్తింపు పత్రాలేవీ తగినంత బలమైన సాక్ష్యంగా లేవు. ఎందుకు? దీనికి స్పష్టమైన సమర్థన ఏదీ ఇవ్వలేదు. కేవలం 2.5 శాతం మంది భారతీయుల వద్ద మాత్రమే పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని ఈసీఐకి గుర్తు చేయాలి. కేవలం 14.71 శాతం మంది వద్ద మాత్రమే మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్లు ఉన్నాయి. జనన ధృవీకరణ పత్రాల సంగతి? ఎంత మంది భారతీయుల వద్ద అవి ఉన్నాయో ఊహించడం కష్టం. కోర్టులో సమర్పించిన ఈసీఐ స్వంత డేటా ప్రకారం, చాలా మంది భారతీయుల వద్ద ఈ పత్రాలు లేవని తెలుస్తోంది.
ఇప్పుడు ఆధార్ గురించి మాట్లాడుకుందాం. ఈ “ప్రత్యేక గుర్తింపు” వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం 2023 నాటికి ఏకంగా రూ.12,000 కోట్లు, అంటే దాదాపు 1.5 బిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. బ్యాంకు ఖాతాలు, పన్నులు, ఆస్తి లావాదేవీలు, విమానాశ్రయాల వంటి సున్నితమైన సంస్థలలోకి ప్రవేశంతో సహా ప్రతిదానికీ ఇదే కీలకం అవుతుందని వాదించారు. ఇది ఒక భారీ బయోమెట్రిక్ వ్యవస్థ. ఇది మీ వేలిముద్రలు, కనుపాప స్కాన్‌లు, వ్యక్తిగత చరిత్రను సేకరించి, మిమ్మల్ని మీ కుటుంబానికి, మీ చిరునామాకు, మీ ఉనికికి అనుసంధానిస్తుంది. కారు కొనడానికి, ఇల్లు అద్దెకు తీసుకోవడానికి, లేదా పన్నులు దాఖలు చేయడానికి ఇది తప్పనిసరి. అయినప్పటికీ, మీరు భారతీయులని నిరూపించుకోవలసి వచ్చినప్పుడు, ఇది నిరుపయోగం! మిమ్మల్ని వోటరు జాబితాలో చేర్చడానికి ఇది సరిపోదని ఈసీఐ చెబుతోంది. ఆధార్‌ను ఉనికికి అంతిమ రుజువుగా ప్రచారం చేసిన అదే ప్రభుత్వం ఇప్పుడు, “క్షమించండి, పౌరసత్వానికి కాదు” అని భుజాలు ఎగరేస్తోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే? ఆధార్‌లోని లోపాలు చాలాసార్లు బయటపడ్డాయి.
ఇక ఈసీఐ జారీ చేసిన ఈపీఐసీ (ఎపిక్) వోటర్ ఐడీ ఉంది. దశాబ్దాలుగా, ఇది మిమ్మల్ని బ్యాలెట్ పెట్టె వరకు తీసుకెళ్లే మార్గంగా, మీరు భారతదేశ ప్రజాస్వామ్య హృదయ స్పందనలో భాగమని నిరూపించే సాక్ష్యంగా ఉంది. కానీ ఇప్పుడు, అక్రమంగా ప్రవేశించిన వారి పేర్లు తమ వోటరు జాబితాలో ఉండటంతో, ఆ జాబితానే కలుషితమైందని ఈసీఐ భావిస్తోంది. చట్టం ప్రకారం, అక్రమ వలసదారులు చాలా మార్గాల ద్వారా పౌరసత్వం పొందలేరు. పౌరుడిని నిర్వచించేది ఏమిటో ఎందుకు స్పష్టం చేయలేదు? అమెరికాలోని సోషల్ సెక్యూరిటీ నంబర్ లేదా యూకేలోని నేషనల్ ఇన్సూరెన్స్ నంబర్ లాగా, పౌరసత్వాన్ని నిరూపించే ఒకే, సురక్షితమైన ఐడీని ఎందుకు సృష్టించలేదు? దానికి బదులుగా, మనం ఆధార్, పాన్, వోటర్ ఐడీ, రేషన్ కార్డులతో సతమతమవుతున్నాం—వీటిలో ఏదీ సరిపోదు. బాంబే హైకోర్టు తీర్పుపై వ్యాఖ్యానిస్తూ, న్యాయవాది సౌరవ్ అగర్వాల్ సూటిగా ఇలా అన్నారు: “పౌరసత్వానికి రుజువుగా ఒక పత్రాన్ని అందించడానికి కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలకు సమయం ఆసన్నమైంది. ఆధార్‌ను నిలబెట్టడం కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇంత గట్టిగా పోరాడటం ఆశ్చర్యకరం, కానీ ఇప్పుడు గోప్యతా హక్కులను పణంగా పెట్టి అయినా, ఆధార్ కేవలం ఒక కాగితంగా మారిపోయిందని తేలింది.”