– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
– రాష్ట్ర, దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా మనకు లభించిన స్వాతంత్య్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి పేద కుటుంబం ఆత్మగౌరవంతో జీవించేలా, ప్రతి రైతు సంతోషంగా ఉండేలా, ప్రతి యువతకు భవిష్యత్‌పై భరోసా కలిగేలా తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజా ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర, దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు అండగా రైతుభరోసా, మహిళల ఆర్థిక సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం, సామాజిక భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేదవాడి ఇంట్లో వెలుగు నిండినప్పుడే స్వాతంత్య్రానికి నిజమైన అర్థం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం గౌరవంగా జీవించే తెలంగాణ నిర్మాణమే తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఫలాలు చివరి పేదవాడి ఇంటికి చేరినప్పుడే అభివృద్ధికి అసలైన అర్థం ఉంటుందన్నారు. అలా అందించాలనే కృత నిశ్చయంతో ప్రజా ప్రభుత్వ పనిచేస్తోందని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, సమానత్వం, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలతో మరింత బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజల ఆశీస్సులతో.. పేదల ముఖాల్లో చిరునవ్వులు, ప్రతి ఇంటా వెలుగులు నింపే దిశగా మన ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం మరింత బలంగా ముందుకు సాగుతుందని చెప్పారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవం ప్రతి తెలంగాణ కుటుంబంలో కొత్త ఆశలు, కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





