పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమాల సందర్భంగా
డిజిపి కార్యాలయంలో తొలిసారి రక్తదాన శిబిరం నిర్వహణ.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమాల సందర్భంగా బుధవారం నాడు డీజీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. తొలిసారిగా డీజీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి రక్తదానం చేశారు. శాంతి భద్రతల అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్, ఐజిపి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, ఎం.రమేష్ లతో సహా 164 మంది పోలీస్ సిబ్బంది తో పాటు అధిక సంఖ్యలో పాల్గొన్న మినిస్టీరియల్ సిబ్బంది నుండి రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా డిజిపి బి.శివధర్ రెడ్డి మాట్లాడుతూ….. రక్తదానం చేయడం వల్ల మనుషులను ప్రాణాపాయం నుండి కాపాడగలుగుతామన్నారు. రక్తదానం చేయడం వల్ల మూడు రకాలుగా మనుషులకు ఉపయోగపడుతుందని అన్నారు. ఒకరు రక్త దానం చేయడం వల్ల రక్తంతో పాటు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ వంటివి మరో ముగ్గురికి ప్రాణదానం చేసే ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు. బాధితులకు అవసరమైన రక్తాన్ని సేకరించేందుకు అవకాశమున్న ప్రతి ఒక్కరు ముందుకు రావాలని డిజిపి పిలుపునిచ్చారు. గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నానని, దాదాపు 4,500 యూనిట్ల రక్తాన్ని వారు సేకరించారని వెల్లడించారు. ఏటా ప్రతి ఒక్కరు నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చని వైద్యులు చెప్తున్నారని, కనీసం ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడగలుగుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో దాదాపు 8,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని రక్తం అందుబాటు ఉన్నట్లయితే అందులో కొంతమంది ప్రాణాలైనా కాపాడగలిగే అవకాశం ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఐజిపి (పి&ఎల్) ఎం రమేష్ స్వాగతోపన్యాసం చేస్తూ… రక్తదాన శిబిరం డీజీపీ కార్యాలయంలో నిర్వహించడం ఇది తొలిసారి అని పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏఐజీ రమణ కుమార్, నాగరాజు, డాక్టర్ పిచ్చిరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఇ.వి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీరాములు, పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి తదితరులు రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్నారు.





