– మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి
– 31న ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దం
– గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం
– సిఎం రేవంత్‌తో అజారుద్దీన్ భేటీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ పాచిక పన్నుతోంది. ఇంతకాలం కేబినేట్‌లో మైనార్టీలకు చోటుదక్కలేదు. తాజాగా మహమ్మద్ అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. శుక్రవారం తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరగనుంది. అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.ఈ మేరకు రాష్ట్రమంత్రి వర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఇదిలావుంటే తాజాగా అజారుద్దీన్‌ను సిఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకోవడం, వార్తలకు బలం చేకూరింది. తనకు మంత్రి పదవి ఇవ్వాలన్న నిర్ణయంపై ధన్యవాదాలు తెలిపినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణపై గత కొన్ని రోజులుగా ఏఐసీసీలో కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్‌లో 15 మంది ఉండగా.. మరో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశముంది. అయితే, ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన అజాహరుద్దీన్‌కు మాత్రమే ప్రస్తుతం మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఎప్పుడు కేబినెట్ ఏర్పడినా.. ముస్లిం మైనార్టీకి ఒక మంత్రి పదవి ఉండేది. కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మంది ముస్లిం మైనార్టీలు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఈసారి ఎక్కడా గెలవలేదు. దీంతో ఆ వర్గానికి కేబినెట్‌లో అవకాశం కల్పించేందుకు సాధ్యపడలేదు. ముస్లిం మైనార్టీ వర్గానికి ఏదో విధంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్ఠానం ఉంది. అజాహరుద్దీన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే, ఆయనకు కాంగ్రెస్ అధిష్ఠానం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా అజాహరుద్దీన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. అయితే, వీరిద్దరి నియామకానికి గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. ఎమ్మెల్సీ నియామక పక్రియ పూర్తికాకపోయినప్పటికీ అజాహరుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసేందుకు ఏఐసీసీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై గత రెండ్రోజులుగా ఏఐసీసీలో విస్తృతంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే బిసి రిజర్వేషన్లపై కసరత్తు జరుగుతున్న వేళ కేబినేట్‌లో బిసిల కోటాను పెంచాలని డిమాండ్ వచ్చింది. దీనిని కాంగ్రెస్ పట్టించుకున్నట్లు లేదు. మొదటి సారి ముఖ్యమంత్రితో పాటు 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం మరో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉండటంతో కాంగ్రెష్ అధిష్ఠానం ముస్లిం మైనారిటీకి అవకాశం కల్పించింది. ఒక వేళ గవర్నర్ కోటాలో అజాహరుద్దీన్‌కు అవకాశం దక్కని పక్షంలో.. త్వరలో కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాలీ కానున్నాయి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల్లో అజాహరుద్దీన్‌ను ఎమ్మెల్సీని చేసే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా మిగిలి ఉన్న రెండు మంత్రి పదవులు ఏయే సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపై కసరత్తు కొనసాగు తున్నట్టు తెలుస్తోంది. దీంతో బిసి సామాజిక వర్గాలు ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, బీర్ల అయిలయ్యలు ఎప్పటి నుంచో మంత్రిపదవికి డిమాండ్ చేస్తున్నారు. అజారుద్దీన్ రాకతో ఇప్పుడు హైదరాబాద్‌కు చోటు దక్కినట్లు అవుతుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





