– జీసీసీల రాజధానిగా హైదరాబాద్
– నెహ్రూ, పీవీ, మన్మోహన్‌ల దూరదృష్టితో హైదరాబాద్‌కు బలం
– మెక్‌డొనాల్డ్స్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: తెలంగాణ ప్రతిభపై విశ్వాసం, పరిపాలనపై నమ్మకానికి మెక్‌డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ ఒక ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి టీ హబ్ సమీపంలో మెక్‌డొనాల్డ్ గ్లోబల్ ఆఫీస్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ అద్భుత ప్రతిభకు మెచ్చి మెక్‌డొనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ కోసం హైదరాబాదును కేంద్రంగా ఎంచుకోవడం ఒక నిదర్శనమన్నారు. జీసీసీలకు రాజధానిగా హైదరాబాద్ నిలిచిందని తెలిపారు. ప్రథమ ప్రధాని నెహ్రూ మొదలుకొని పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి మహా నేతలు దూరదృష్టితో చేపట్టిన చర్యల మూలంగా హైదరాబాద్‌కు మరింత బలం చేకూరిందని తెలిపారు. మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ నాయకత్వ బృందాన్ని, సిబ్బందిని హైదరాబాద్‌కు స్వాగతించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది ఇప్పుడు మీ ప్రపంచ ప్రతిభకు కొత్త నిలయం అని కంపెనీ ప్రతినిధులనుద్దేశించి డిప్యూటీ సీఎం అన్నారు. 1940లలో మెక్‌డొనాల్డ్స్ ప్రారంభమైనప్పుడు అది కేవలం ఆహారం గురించి మాత్రమే కాదు అది పరిమాణం, సామర్థ్యం, అనుసంధానమైన ప్రపంచం అనే భావనకు ప్రతీకగా నిలిచిందని వివరించారు. మినార్లు, సరస్సులతో ఉన్న చారిత్రక నగరం నుండి డేటా, డిజైన్, నిర్ణయాల గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ ఎదిగిందన్నారు. సీసీఎంబీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు అన్నీ కూడా నెహ్రూ స్ఫూర్తి నుండి పుట్టినవేనని గుర్తు చేశారు. తర్వాత ప్రధానిగా పనిచేసిన పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ నెహ్రూ దూరదృష్టిని మరింత బలంగా తీసుకెళ్లారన్నారు. ఆర్థిక సంస్కరణ అంటే కేవలం మార్కెట్ గురించి కాదు, గౌరవంతో కూడిన అవకాశాలను సృష్టించడం అని ఆయన తెలిపారు. మెక్‌డొనాల్డ్స్ ఈ నూతన కేంద్రం కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న కొత్త పరిణామంలో కీలక అధ్యాయమని అభివర్ణించారు. హైదరాబాదులోని జీసీసీ సెంటర్లు చికాగోను చార్మినార్‌తో, బోస్టన్‌ను బంజారాహిల్స్‌తో, లండన్‌ను లింగంపల్లితో కలుపుతున్నాయని, హైదరాబాద్‌ను ప్రపంచ కమాండ్ సెంటర్‌గా మారుస్తున్నాయని, అక్కడ మార్కెట్లను, అనుభవాలను తీర్చిదిద్దే నిర్ణయాలు తీసుకుంటున్నాయని వివరించారు. హైదరాబాద్ ఇంజినీర్లు, విశ్లేషకులు, ఆవిష్కర్తల చేతుల్లో రూపుదిద్దుకుంటోందని భట్టి తెలిపారు. మెక్‌డొనాల్డ్స్ తెలంగాణ యువత కోసం నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలపై భాగస్వామి కాబోతోందన్న విషయం తెలంగాణ ప్రజానీకానికి ఆనందంగా ఉందన్నారు. పిల్లలు, కుటుంబాల సేవలో ఉన్న రొనాల్డ్ మెక్‌డొనాల్డ్ హౌస్ చారిటీస్ వంటి దాతృత్వ కార్యక్రమాలను కూడా అభినందిస్తున్నానన్నారు. అభివృద్ధికి మానవీయ కోణం ఉండాలని భట్టి తెలిపారు. కార్యక్రమంలో డొనాల్డ్ ప్రతినిధులు మిస్ స్కై ఆండర్సన్, దేశాంత్ కైలా,
మ్యాటిజ్ బ్యాక్స్, స్పీరో ద్రూలియాస్, శదాస్ దాస్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.
మెక్‌డొనాల్డ్స్ లీడర్‌షిప్‌కు ధన్యవాదాలు :మంత్రి శ్రీధర్‌బాబు
అమెరికాకు వెలుపల అతి పెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ లీడర్‌షిప్‌నకు మంత్రి శ్రీధర్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనువైన ఎకో సిస్టం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టాలెంట్ పూల్, పటిష్ఠమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వంపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి గొప్ప నిదర్శనం అని వెల్లడిరచారు. తమ ప్రభుత్వ పనితీరుకు సజీవ సాక్ష్యం అన్నారు. మెక్ డొనాల్డ్స్ అంటే గ్లోబలైజేషన్ కు నిలువెత్తు నిదర్శనం. ముందు చూపుతో 1991లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు అమలు చేసిన సంస్కరణల వల్ల మెక్ డొనాల్డ్స్ లాంటి ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు మన దేశంలోకి అడుగుపెట్టాయన్నారు. హైదరాబాద్ గ్లోబల్ జీసీసీ హబ్ యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. అన్ని రంగాలకు చెందిన జీసీసీలను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. హాస్పిటాలిటీ రంగ దిగ్గజ సంస్థ మారియట్ తన మొదటి జీసీసీని ప్రారంభించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకుందని, రైజింగ్ తెలంగాణ లక్ష్య సాధనకు తమ ప్రభుత్వం మెక్ డొనాల్డ్స్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో కలిసి పనిచేసేందుకు ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





