– బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు
– ఆరుగురు మృతి, 40 మందికి గాయాలు
తిరువనంతపురం, ఏప్రిల్ 21 : తమిళనాడు విరుదునగర్‌లోని బాణసంచా కర్మాగారంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే కేరళలో మరో విషాదం నెలకొంది. త్రిస్సూర్‌లోని ఓ బాణసంచా ఉత్పత్తి కేంద్రంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో ఎనిమిదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. త్రిస్సూర్ తిరువంబడిలోని ఓ బాణసంచా తయారీ యూనిట్‌లో ఈ సంఘటన జరిగింది. ఈనెల 24న జరగాల్సిన నమూనా బాణసంచా కోసం ఆ కేంద్రంలో సామగ్రిని ఉత్పత్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ శబ్దం సుమారు కొన్ని కిలోమీటర్ల మేర వినిపించినట్టు స్థానికులు తెలిపారు. తొలుత దీన్ని భూప్రకంపనలుగా భావించినట్టు తెలిపారు. పేలుడు అనంతరం ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే నల్లటి పొగలు, మరోసారి పేలుడు సంభవించిన కారణంగా సహాయక చర్యలు కష్టతరంగా మారాయని అధికారులు వెల్లడించారు. ఆ యూనిట్‌లో పేలని బాణసంచా పదార్థాలు ఇంకా ఉన్నాయనే అనుమానంతో అత్యంత జాగ్రత్తగా సహాయక కార్యకలాపాలు సాగుతున్నాయి. పేలుడుకు గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





