రాజకీయ పార్టీల మధ్య వాటర్‌ ‌వార్‌

“రాష్ట్రంలో దాదాపు సగం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్‌ ‌నెలలో వాస్తవంగా నమోదు కావాల్సిన వర్షపాతానికన్నా దాదాపు 15శాతం తక్కువగా నమోదు అయింది. అయితే జూలై నెలలో సమృద్ధిగా వర్షాలు పడే సూచనలున్నట్లు ముందుగా అంచనా వేసినప్పటికీ ఈ నెలలోకూడా వర్షపాతం తగ్గె అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు..”

 

(మండువ రవీందర్‌రావు )

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల మద్య నీటి యుద్ధం ప్రారంభమైంది. వానకాలం వచ్చి నెలరోజులైనా వర్ణుడు కరుణించకపోవడంతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు డెడ్‌ ‌స్టోరేజీకి చేరుకున్నాయి. నిన్నటి వరకు విపరీతమైన వేసవి తాపంతో అల్లాడిపోయిన రాష్ట్రం, ఇప్పుడు వర్షాభావ పరిస్తితులను ఎదుర్కుంటున్నది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయదారులు దుక్కులు దున్ని విత్తనాలు చల్లుకోవడానికి తమ భూములను సాగుచేసుకుని వర్షాలకోసం ఎదురు చూస్తుండగా, రాష్ట్ర రాజధానిలో ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇందుకు అధికార కాంగ్రెస్‌ ‌వైఫల్యాలే కారణమంటూ బిఆర్‌ఎస్‌ ‌విరుచుకుపడుతుంటే, గత ప్రభుత్వ పాలనాతీరే కారణంగా అధికార పార్టీ విమర్షిస్తున్నది.

రాష్ట్రంలో దాదాపు సగం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్‌ ‌నెలలో వాస్తవంగా నమోదు కావాల్సిన వర్షపాతానికన్నా దాదాపు 15శాతం తక్కువగా నమోదు అయింది. అయితే జూలై నెలలో సమృద్ధిగా వర్షాలు పడే సూచనలున్నట్లు ముందుగా అంచనా వేసినప్పటికీ ఈ నెలలోకూడా వర్షపాతం తగ్గె అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటినుండి అడపాతడపా వర్షాలు పడుతున్నప్పటికీ అవి లెక్కలోకి వచ్చేవిగా లేవు. వాస్తవంగా తొలకరి జల్లులు పడగానే విత్తనాలను చల్లుకోవడమన్నది అనవాయితీ. కాని, అగి ఆగి పడుతున్న తుంపర్ల వల్ల లాభంలేదని, తొందరపడి విత్తనాలు వేసుకోవద్దని వాతావరణశాఖ అధికారులు ఇప్పటికే రైతులను హెచ్చరించారు. దానికి తగినట్లు ఈసారి ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు తక్కువగానే పడతాయంటున్న నేపథ్యంలో సీజన్‌ ‌దాటిపోతున్నదని కొందరు రైతులు తమ బావులపై ఆధారపడి విత్తనాలు వేసుకుంటున్నారు. మరి కొందరు ఆరుతడి పంటలు ఎండిపోకుండా ఉండేందుకు ట్రాక్టర్ల ద్వారా నీరు తెచ్చుకుని వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల నుండి నీరు సక్రమంగా అందకపోవడమే ఈ ఇబ్బందికి కారణంగా భావిస్తున్నారు.
    ప్రాజెక్టుల విషయానికొస్తే కరీంనగర్‌ ‌ప్రాంతంలోని లోయర్‌ ‌మానేరుడ్యాం డెడ్‌ ‌స్టోరేజీకి చేరుకుంది. 24 టిఎంసీ నీటితో సమృద్ధిగా ఉండాల్సిన ఈ డ్యామ్‌లో ఇప్పుడు డెడ్‌ ‌స్టోరేజి కలుపుకుని 5.8 టిఎంసీల నీరు మాత్రమే ఉంది. అలాగే మిడ్‌ ‌మానేర్‌లో 27 టిఎంసీలకు గాను 7 టిఎంసీలు, శ్రీపాద ఎల్లంపల్లి  ప్రాజెక్టులో 20 టిఎంసిలకు గాను 7.7 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. ఈ పరిస్థితులో ఎప్పుడు వర్షాలు పడుతాయో ఎప్పుడు సాగు పనులు మొదలు పెట్టాలోనని రైతాంగం నిత్యం ఆకాశంవైపు ఎదురు చూస్తున్నారు.
    ఇదిలాఉంటే తలాపున గోదావరి ఉన్నా ఆ నీటిని వినియోగించుకోవడంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం విఫలమవుతున్నదని బిఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్నది. బిఆర్‌ఎస్‌ ‌పాలనను అప్రతిష్టపాలు చేయాలన్న ఒకే ఒక కారణంతో నీళ్ళున్నా రైతుల పొలాలకు సాగునీటిని మళ్ళించేందుకు ప్రభుత్వం చొరవతీసు కోవడంలేదని బిఆర్‌ఎస్‌ ‌నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రాణదాత అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబందించి మేడిగడ్డ దగ్గర రెండు పిల్లర్లు కూలినంత మాత్రాన ప్రాజెక్టే పనికిరానిదిగా పక్కకు పెట్టడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. కాళేశ్వరం అన్నది కేవలం ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైన ప్రాజెక్టుకాదు.
రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల బీడు భూములకు సాగునీరుఅందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిందన్న విషయాన్ని వారు మరోసారి గుర్తుచేస్తున్నారు.  కన్నెపల్లి వద్ద ఉన్న మోటర్లను ఆన్‌ ‌చేస్తే లక్షలాది ఎకరాలకు నీరందే అవకాశం ఉందన్న విషయాన్ని ప్రభుత్వం ఎందుకు  విస్మరిస్తున్నదని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశ్యంగా బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ఆదివారం కన్నెపల్లి ప్రాజెక్టుకు వెళ్ళారు. అనేక అవాంతరాల తర్వాత చివరకు అక్కడకు చేరుకున్న ఆయన కన్నెపల్లి నుండి వృధాగా పోతున్న సుమారు లక్ష క్యూసెక్కుల నీటిని తెలంగాణ భూములకు మళ్ళించుకునే విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం  చేస్తున్నదని ప్రశ్నించారు.
 డెడ్‌ ‌స్టొరేజీకి చేరుకున్న డ్యామ్‌లకు ఈ వాటర్‌ను తరలించడం ద్వారా అనేక మంది రైతులను ఆదుకున్నట్లు అవుతుందంటే, ఆ నీటిని మళ్ళించడం సాధ్యంకాదని కాంగ్రెస్‌ ‌కొట్టిపారేస్తున్నది. కాళేశ్వరం  ప్రాజెక్టును రాజకీయ కోణంలోకాకుండా  ఇంజనీరింగ్‌ ‌కోణంలో చూడాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. ఇది ఒక్క గేటుకు సంబంధించింది కాదు. మేడిగడ్డ మొత్తం ప్రాజెక్టు పునాదికి సంబంధించిందని, శాస్త్రీయ పునరుద్దరణ పూర్తి అయి, ఎన్‌డిఎస్‌ఏ, ‌సిడబ్ల్యూసి అనుమతులు వచ్చిన తర్వాతనే బ్యారేజీలు నిర్వహణలోకి వస్తాయని తేల్చి చెప్పారు.
    ఏది ఏమైనా ఈ ఖరీఫ్‌ ‌సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు వేసే అవకాశముందని వ్యవసాయ అధికారులు అంచనావేశారు. గత ఏడాది ఇదే సీజన్‌లో 39 లక్షల ఎకరాల్లో  వేయగా ఈసారి ఆరు లక్షల ఎకరాలకు తగ్గింది. ముందు ముందు పర్ష ప్రభావం ఎలా ఉన్నా ప్రతీ నీటి బొట్టును జాగ్రత్తగా వాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే ఆరు తడి పంటలవైపే ఎక్కువ మొగ్గు చూపాలని వ్యవసాయ అధికారులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *