– నిప్పులు చెరిగిన కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: డీలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టడంతోనే మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమ పార్టీ సహా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సానుకూలంగా ఉన్నా బీజేపీ రాజకీయంతోనే బిల్లు వీగిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోవడంపై ఆయన స్పందిస్తూ ఇప్పటికైనా డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా మహిళలకు రిజర్వేషన్లు వచ్చేలా కొత్త బిల్లు తీసుకొచ్చి బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. బీజేపీ కుటిల రాజకీయాల వల్లే దేశంలోని మహిళా లోకానికి దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కకుండా పోయాయని మండిపడ్డారు. మహిళా సాధికారతపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని నేటి పరిణామాలతో తేలిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లతోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేసి ఉంటే ఎలాంటి సమస్య వచ్చేది కాదని, కానీ మహిళల రిజర్వేషన్ల అంశాన్ని ముడిపెట్టి దేశ మహిళల ద్వారా దక్షిణాది రాష్ట్రాల గొంతు కోయాలని బీజేపీ చూసిందని ఆయన మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను, డీలిమిటేషన్ పర్యవసానాలను పట్టించుకోకుండా మొండిగా ముందుకు పోవడంతో ఒక చారిత్రక అవకాశం చేజారిపోయిందన్నారు.
బీజేపీ రాజకీయ స్వార్థానికి మహిళలు బలి
మహిళా రిజర్వేషన్ల పేరుతో బీజేపీ ఆడిన నాటకాన్ని దేశ ప్రజలు కళ్లారా చూశారని కేటీఆర్ అన్నారు. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం మహిళలను వాడుకుని, ఇప్పుడు వారిని వెన్నుపోటు పొడిచిన పార్టీగా బీజేపీ చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా బీజేపీ¾ తన నిజాయతీని నిరూపించుకోవాలంటే డీలిమిటేషన్ నిబంధన లేకుండా కేవలం మహిళా రిజర్వేషన్ల కోసమే ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టి రానున్న ఎన్నికల నుంచే దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్, అస్సాం రాష్ట్రాల్లో దేశవ్యాప్త డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా సీట్ల పెంపు చేపట్టిన కేంద్రం తెలంగాణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు. మహిళా బిల్లుతో, దేశవ్యాప్త డీలిటేషన్ అంశం సంబంధం లేకుండా తెలంగాణ అసెంబ్లీ సీట్లను 2028లోపు పెంచేలా ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రత్యేక బిల్లు తీసుకురావాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




తెలంగాణపై తప్పుడు వ్యాఖ్యలు తగవు