మనస్సాక్షిగా మద్దతు ఇవ్వండి

– మహిళా శక్తిని గౌరవించడానికి ఇదో పెద్ద అవకాశం
– మహిళలను గౌరవించేందుకు సమష్టిగా కృషి చేద్దాం
– ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు

న్యూదిల్లీ, ఏప్రిల్ 17: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వాలని ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పార్లమెంటు సభ్యులంతా తమ మనస్సాక్షికి అనుగుణంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని మహిళా శక్తిని గౌరవించడానికి ఇదో గొప్ప అవకాశమన్నారు. మహిళలకు తగిన హక్కులను కల్పించడంలో అందరం సమష్టిగా చరిత్ర సృష్టించాలన్నారు. ఏకాభిప్రాయంతో ఈ సవరణను ఆమోదించాలని, దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ‘ఎక్స’ వేదికగా కోరారు. ’నేను ఎంపీలందరినీ కోరేది ఒక్కటే.. ఇంట్లోని తల్లిని, సోదరిని, కుమార్తెను, భార్యను గుర్తుంచుకుని మనస్సాక్షి చెప్పిందే వినండి. దేశ మహిళలకు సాధికారత కల్పించడం అనేది ఒక గొప్ప అవకాశం. వారికి కొత్త అవకాశాలను దూరం చేయకండి. ఈ సవరణ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందితే దేశంలో మహిళా శక్తి మరింత బలోపేతమవుతుంది. ఫలితంగా దేశ ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. రండి.. ఈ రోజు మనమందరం కలిసి చరిత్ర సృష్టిద్దాం’ అని మోదీ పిలుపునిచ్చారు. మహిళలకు వారి హక్కులు ఇచ్చేందుకు సమయం ఆసన్నమైందని అంతకముందు జరిగిన చర్చ సందర్భంగా మోదీ ప్రసంగించారు. నారీ శక్తి వందన్ అధినియమ్‌కు చేసిన సవరణలపై పార్లమెంటులో సవివరమైన, సుదీర్ఘ రీతిలో చర్చ జరుగుతోందన్నారు. ఇప్పటివరకు జరిగిన చర్చలో సదరు బిల్లుపై ఉన్న అపోహలను తొలగించామని, సభ్యుల సందేహాలన్నింటినీ నివృత్తి చేశామని చెప్పారు. దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్‌ను రాజకీయం చేశారని, నిర్ణయాలు తీసుకునే పక్రియలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ఈ బిల్లు ఓటింగ్‌కు రానున్న నేపథ్యంలో ఎంపీలంతా సంపూర్ణ మద్దతు ప్రకటించాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు మోదీ. సభ్యులు సున్నితంగా వ్యవహరించాలని, ‘నారీ శక్తి’ మనోభావాలను దెబ్బతీయవద్దని కోరారు. నారీ శక్తి వందన్ అధినియమ్‌కు సవరణలు చేసే విషయంపై పార్లమెంటులో నిన్నరాత్రి ఒంటిగంట వరకు చర్చ నడిచింది. బిల్లుల విషయంలో ఉన్న అపోహలను తొలగించేలా ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *