గిరిజనులను ఆదుకున్నది బీజేపీయే

– వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే
– గిరిజన నాయకుల సమావేశంలో రామచందర్‌రావు

వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 29 : తెలంగాణలో గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు కానీ అదే బిల్లులో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అంశాన్ని కూడా చేర్చడంతో ఆ బిల్లు న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకుందన్నారు. ఫలితంగా గిరిజనులకు అందాల్సిన 10 శాతం రిజర్వేషన్ అమలు ఆలస్యమైందని, దీని వల్ల గిరిజన విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈ ఆలస్యంతో వారికి జరిగిన నష్టం ఎంత తీవ్రమైందో గిరిజన సమాజానికే బాగా తెలుసునని అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాక సందర్భంగా వరంగల్‌లో సోమవారం జరిగిన గిరిజన నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో తొలిసారిగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని, జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసిందని చెప్పారు. గిరిజన సంక్షేమం పట్ల బీజేపీ కట్టుబాటుకు ఇవి స్పష్టమైన ఉదాహరణలన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీ నుంచే ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనుల కోసం పెద్దగా ఏమీ చేయకపోయినా తామే అన్నీ చేశామని చెప్పుకోవడం వాస్తవాలకు విరుద్ధమని విమర్శించారు. గిరిజనుల సంక్షేమం గురించి నిజాయతీగా ఆలోచించి వారిని అభివృద్ధి దిశగా నడిపించి వారికి విద్య, ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేసింది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన తొలి పర్యటన నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు గిరిజన గ్రామాలకేనన్నారు. అక్కడి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడానని, ఈ రోజుకీ చాలామంది కనీస జీవన సౌకర్యాలు లేకుండా జీవిస్తున్నారని, సరైన దుస్తులు కూడా లేని పరిస్థితులు ఉన్నాయని, రహదారులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకోవడమే చాలా కష్టసాధ్యమైందన్నారు. అలాంటి అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా గిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారని, చెంచు గిరిజన కుటుంబాలకు మెరుగైన నివాస సౌకర్యాలు కల్పించారని, గిరిజన సహకార సంఘాల ద్వారా వారి అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారని వివరించారు. ఈ సమావేశానికి విచ్చేసిన పదవీ విరమణ చేసిన గిరిజన అధికారులు, సాధు సంతులకు తన హృదయపూర్వక అభివాదాలు తెలియజేస్తున్నానన్నారు. సీతారాం నాయక్, గోడం నగేశ్ వంటి నాయకులు ఎల్లప్పుడూ గిరిజనుల హక్కులు, వారి అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తునారంటూ వారికి అభినందనలు తెలిపారు. సమావేశంలో బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *