బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హౌస్ అరెస్ట్

– ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి పిలుపునివ్వడంతో ..

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్‌పై పోరుకు బీజేపీ సిద్ధమైంది. ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి రామచందర్‌రావు పిలుపునివ్వడంతో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయనను హౌస్ అరెస్టు చేశారు. నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్‌ను వదిలిపెట్టం అని రామచందర్ రావు ఈ సందర్భంగా హెచ్చరించారు. పార్లమెంటులో మహిళల గొంతు నొక్కారు.. ఇక్కడ తమ గొంతు నొక్కుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ప్రదర్శించిన తీరు పూర్తిగా బానిస మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు.. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ వంటి ఒకే కుటుంబానికి చెందినవాళ్లే రాజకీయాల్లో ఉండాలి.. సాధారణ మహిళలు ఎదగకూడదనే ఫ్యూడల్ మనస్తత్వం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అదే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. మహిళా సాధికారతపై మాటల్లో మద్దతు.. ఆచరణలో వ్యతిరేకత.. ఇదే కాంగ్రెస్ అసలు స్వభావం అని దుయ్యబట్టారు. మహిళలకు 33% రిజర్వేషన్ వస్తే సామాన్య మహిళలకు అవకాశాలు పెరగడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. ఎందుకంటే వారి రాజకీయాలు కుటుంబాల చుట్టూ తిరుగుతాయి. అందుకే ఈ బిల్లును అడ్డుకున్నారు అని విమర్శించారు. నిన్న జరిగిన ఓటమి కేవలం ఒక బిల్లుదే కాదు.. అది దేశంలోని మహిళల ఆశల ఓటమి. దక్షిణాది-ఉత్తరాది అనే వాదనలు, హైబ్రిడ్ ఫార్ములా వంటి అంశాలు అన్నీ కూడా అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు తీసుకొచ్చినవేనన్నారు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో అడ్డంకులు సృష్టిస్తోంది. 30 ఏళ్లుగా ఈ బిల్లును వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే పని చేసింది. నిజంగా మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకం కాదంటే బిల్లుకు వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేశారని ప్రశ్నించారు. మహిళల హక్కులను అడ్డుకున్న కాంగ్రెస్‌ను ఎప్పటికీ క్షమించరాదన్నారు. ఈ అన్యాయానికి నిరసనగా తాము సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు బయలుదేరితే తమను హౌస్ అరెస్ట్ చేశారని, ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన అని రామచందర్‌రావు అన్నారు.

————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *