26 జనధర్మో విజయతే3.10.2025 శతజయంతి
తెలంగాణా వేరే రాష్ట్రంగా ఏర్పడితే, దేశంలో మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడుతుందన్న సాకుతో ఆంధ్ర నాయకులు ఢిల్లీ నాయకులనూ, హైద్రాబాదు నాయకులనూ నిరంతర ప్రయాసతో నమ్మించి తుదకు శ్రీ బూర్గుల రామకృష్ణారావు వారి సమ్మతిని సాధించారు. ఆయన బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా పనిచేసాడు. ఆ తరువాత కె.వి.రంగారెడ్డి, జె వి నర్సింగరావు, డా|| చెన్నా రెడ్డి నాయకత్వాన ప్రజలు విలీనాన్ని వ్యతిరేకిస్తూ, ఆందోళన తీవ్రపరిచినా తుదకు ఈ నాయకులు కూడా ఉద్యమానికి సిద్ధంగా రక్షణల ఒప్పందం కుదుర్చుకోవటంతో ఆంధ్రప్రదేశ్ అవతరణ అనివార్యమే ఐపోయింది.
విలీనీకరణకు సంబంధించి ఆనాటి హైదాబాద్ రాజ్యంలోని మూడు భాషా ప్రాంతాలను కాంగ్రెస్ వారు తమ అభిప్రాయాన్ని వెల్లడించే సింహావలోకనలో బడినారు. 1954 జూన్ లో కాంగ్రెసు సమావేశమై చర్చించి ‘రెండు తెలుగుభాషా రాష్ట్రాల ఏర్పాటు’ను సిఫార్సు చేస్తూ, తీర్మానించింది (అంటే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం) ఎస్ ఆర్సీ రిపోర్టులో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణాను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని నిరూపించడానికి ఏ ఏ కారణాలనయితే పేర్కొన్నదో, ఆయా కారణాలను నిర్మూలించడానికి ఒక ఒప్పందమును, రక్షణలను’ పెద్ద మనుషులు చేసుకున్నారు (వేరే ప్రకటించాం ఒప్పందాన్ని)
ఆంధ్ర పెద్దల అక్రమాలు
ఇట్లా ఆంధ్రప్రదేశ్ అవతరించడానిక్కారణమైన ఒప్పందాన్ని గత 12 ఏళ్లుగా సక్రమంగా అమలు జరుపలేదు. తెలంగాణా మిగులు నిధులు ప్రాంత అభివృద్ధికి వెచ్చింపబడలేదు. తెలంగాణేతర ప్రాంతం కోసం ఖర్చు చేయబడిందన్న వాదం ఉన్నది. ప్రాంతీయ సంఘం సమ్మతి లేకుండా వ్యవసాయ భూముల క్రయ విక్రయ చట్టం అమలు చేసినందున నాగార్జున సాగర్, నిజాం సాగర్. దిండి, కోయిల్ సాగర్, కడం, మున్నేరు, పాలేరు, వైరా వగైరా పాజెక్టు భూములు ఆంధ్ర భూస్వాములు తక్కువ రేటుకు కొనివేయగా, ఆ భూములు అమ్ముకున్న వారు వ్యవసాయ కూలీలుగానో, లేక బెజవాడ, హైదాబాద్ వంటి పట్టణాల్లో రిక్షాలాగుతూనో జీవితం గడుపుతున్నారు. హైద్రాబాదు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లుగా ఆంధ్ర ప్రాంతీయులను నియమించి, ఇండ్ల కిరాయిలు సక్రమంగా చెల్లించవీలు లేకుండా చేశారు. ఛీప్ సెక్రటరీలు ఎగువ దిగువ శాసనసభల అధ్యక్షులు (కొద్ది కాలం ఇక్కడివారు మినహాయించి) ఆంధ్రప్రాంతం వారిని నియమించి, బజెట్ చర్చలలో పాక్షిక ధోరణులకు అవకాశం కలిగించారు.
చట్టప్రకారము ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మండలి క్రమశిక్షణ కార్యకలాపాల ట్రిబ్యునల్. గృహ నిర్మాణ సంస్థ, పరిశ్రమల అభివృద్ధి సంఘం, రాష్ట్ర ఆర్థిక సంస్థ వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలకవర్గం, ఖాదీ బోర్డు, పబ్లిక్ సర్వీస్ కమిషన్, విజలెన్సు కమిషన్, పారిశ్రామిక వివాదాల ట్రిబ్యునల్, వగైరాలన్నిటికీ ఆంధ్ర సోదరుల ఆధిపత్యమే. ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత, సెక్రటేరియట్ లో 88 శాతం అధికారులు తెలంగాణా వారు, కాని 148 మంది అధికార్లున్న ఈనాడు 48 మందే. అంటే 89 శాతం ఆంధ్ర అధికారులన్నమాట!
1955లో ఎస్ ఆర్సీ రిపోర్టులోని 375, 378, 377, 378 పారాలతో ప్రాంత ప్రజల భయ సందేహాలుగా వెల్లడించిన అంశాలన్నీ నిజాలైనాయి. అప్పటి కేంద్ర హోంమంత్రి శ్రీ గోవిందవల్లభ్ పంత్ ” తెలంగాణా మహాసభ” సమర్పించిన విజ్జప్తిలో ఆంధ్ర సోదరుల ఈ కౌటిల్య నీతిని గూర్చి విశదం చేసి యావద్భారత శ్రేయస్సు దృష్ట్యా తగు చర్యలు తీసుకోమని కోరింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం పంపిన మురాసిలా ఆ తరువాత చెత్తబుట్టలో వేశారు. తె. 12-12-56న గులాం పంజతస్ అనే బారిస్టర్ మళ్లీ కేంద్రాన్ని హెచ్చరించారు. 1960లో ప్రాంతీయ సంఘం మొదటి అధ్యక్షుడు శ్రీ కె. అచ్యుత రెడ్డిగారు కూడా ఈ అన్యాయాలను గూర్చి పత్రికల ద్వారా ప్రకటించారు. దానిపై ప్రభుత్వం తెలంగాణా అభివృద్ధిని గూర్చి ఒక ‘శ్వేతపత్రం’ ద్వారా తెలంగాణా అభివృద్ధిని గూర్చి కొన్ని అంకెలు వివరాలు అంటూ వెల్లడించింది.
జరిగిన లోపాలు సవరించబడగలవని అనేక వాగ్దానాలు కూడా చేసింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాననీ. పోచంపాడు ప్రాజక్ట్ సత్వరం నిర్మిస్తాననీ, తెలంగాణా మిగులు నిధులతో కొత్తగూడెంలో ఎరువుల పాక్టరీ నిర్మింపచేయగలమనీ ఇలాగే మరో కొన్ని వాగ్దానాలు. ఇప్పుడు 9 సం॥లు. పై వాగ్దానాల సంగతేమయిందో చెప్పక్కర్లేదు. ప్రజలకు, 1961లో తెలంగాణా మహాసభ ప్రధాని నెహ్రుకు మళ్లీ విజ్జప్తి చేసింది. వివరాలు – లోపాలు – అన్యాయాలు–వప్పందం ఉల్లంఘనలు… విశదం చేసింది. ఎస్సార్సీ సిపార్సుననుసరించి ఉన్నతాధికార సంఘం నియమించి పరిశీలించమనీ, కోరింది వి.కె.థగె, హరిశ్చంద్ర హెడా వంటి సభ్యులు రాజ్యసభలో హెచ్చరించారు. 1962లో చైనా దాడి, 1963లో నెహ్రూ మృతి, 1965లో పాకిస్తాన్ దాడి వరుసగా సంభవించి దేశ భద్రత దృష్ట్యా తెలంగాణా మౌనం వహించింది. ఆ తర్వాత 1967 వరకు ప్రాంతీయ సంఘాధ్యక్ఖులైన శ్రీ హయగ్రీవాచారిగారు ప్రభుత్వంకు తెలంగాణాకు జరిగిన జరుగుతున్న అన్యాయాలు ఒప్పందం ఉల్లంఘనలు గూర్చి సమర్పించిన వివరాలు మహాభారతం అంత గ్రంధము అవుతుంది.’
ఇప్పుడు ప్రాంతీయ సంఘానికి శ్రీ జె చొక్కారావు అధ్యక్షులు. ఆ పదవికి వచ్చిన మరునాటి నుండే ఆయన ఈ సమస్యల విషయంలో ప్రతి వారితో పోరాటం చేస్తున్నారు.గడిచిన 12 సంవత్సరాలలో తెలంగాణా అభివృద్ధికి వెచ్చించవలసిన తెలంగాణా మిగులు నిధులు సుమారు 110 కోట్లు వెచ్చించలేదు. ఆ డబ్బు కూడా కనిపించటం లేదు. అందువల్ల ఈ మిగులు నిధులు తెలంగాణేతర ప్రాంతాలలో ఖర్చుచేయలేదనటానికి ఆస్కారమే లేదు. అని యం.యస్ ఆచార్య అనేక సందర్భాలలో వార్తలు వ్యాసాలు ప్రచురించారు.
యం యస్ ఆచార్య శతజయంతికి ఒక ఘట్టం
తెలంగాణ చరిత్రలో ఒక ఘట్టం ఆచార్యలో ఒక అధ్యాయంగా మిగిలిపోతారు. 100 సంవత్సరాల ఈ దశలో యం యస్ ఆచార్య చాలామందికి గుర్తుండదు. పాత్రికేయులకు కూడా అర్థం కాదు.
జర్నలిస్టుల భావ దారిద్ర్యం
ఆంధ్ర, తెలంగాణా, ఇంగ్లీషు దిన పత్రికల్లో దశాబ్దాలు పనిచేసిన వారు హైదరాబాద్ లో మాత్రమే ఉండే జర్నలిస్టులు రాష్ట్రస్థాయి పాత్రిక రచయితలవుతారని నమ్ముతూ ఉంటారు. వరంగల్లు, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఎన్ని గొప్ప పనులుచేసినా, వారిని జిల్లా రచయితలు అంటేరే కాని తెలంగాణపాత్రికేయులని గుర్తించబోరు. స్వాతంత్ర్య వీరులైని గుర్తింపు పొందినా, యం యస్ ఆచార్య గారు కేవలం వరంగల్లు జె పి ఎన్ రోడ్డు జర్నలిస్టు అని వదిలేస్తున్నారు . అది జర్నలిస్టుల భావ దారిద్ర్యం. సిగ్గు పడాలి. మహానుభావుడైన యం యస్ ఆచార్యకు నివాళులు.





