– ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని రీతిలో ఉద్యోగుల నియామకం
191 మందికి నియామక పత్రాలు అందించిన మంత్రి సురేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్-ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని రీతిలో దేవాదాయ శాఖలో ఉద్యోగుల నియామకం జరిగిందని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో శుక్రవారం నిర్వహించిన 191మంది ఉద్యోగుల నియామక ఉత్తర్వులను మంత్రి సురేఖ అందజేశారు. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా 47 ఆలయాలకు ఎంపికైన అర్చకులు, వేదపండితులు, పరిచారకులు, మృదంగం, డోలు, సన్నాయి, శృతి, తాళం తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులున్నారు. 191 మంది ఉద్యోగుల నియామకం చేపట్టడం దేవాదాయ శాఖ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్రాత్మక ఘట్టమని మంత్రి పేర్కొన్నారు. దేవాలయ సేవ ఉపాధి లేదా ఉద్యోగమో కాదు.. అది భగవంతుని సేవ చేసే పవిత్ర బాధ్యతని భక్త సేవే భగవత్సేవ అనే భావనతో భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించడమే ఉద్యోగుల లక్ష్యం కావాలని అన్నారు. నిరంతరం దేవుని సేవలో తరించే ఉద్యోగులకు అర్చకులు ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్ట్ ద్వారా ప్రయోజనాలను భారీగా పెంచి అందిస్తున్నామని తెలిపారు. ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, పురాణ ప్రవచనాల నిర్వహణకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో వరుణ యాగాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికే సరస్వతి నది ఆది, అంత్య పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించామని, రాబోయే రోజులు గోదావరి, కృష్ణ నదీ పుష్కరాలను అదేస్థాయిలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఏళ్ళుగా పెండింగ్ లో వున్న గ్రేడ్1, గ్రేడ్ 2 ఈవోల ప్రమోషన్స్ చేపట్టామని, త్వరలో గ్రేడ్3 ఈవోల ప్రమోషన్ చేపడతామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరక్టర్ హనుమంతరావు, ధార్మిక సలహాదారు గోవింద హరి, స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్ఐటీఏ) డైరక్టర్ విజయ రాఘవాచార్యులు, దేవాదాయశాఖ ఆర్జెసి రామకృష్ణారావు, డిసి కృష్ణప్రసాద్, ఎడిసిలు శ్రీనివాస్, జ్యోతి, ఎసి రామాల సునీత, దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగ జాక్ కన్వీనర్ డి.వి.ఆర్.శర్మ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, డాక్టర్ ఆర్.శ్రీరామ ఘనాపాటి, పలువురు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




