మంథనిలో న్యాక్ స్కిల్ డెవలెప్‌మెంట్ సెంటర్

– భవన నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు
– మంత్రి కోమటిరెడ్డికి దుద్దిళ్ల కృతజ్ఞతలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17 : పెద్దపల్లి జిల్లా మంథనిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్‌ఏసీ) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ కేంద్ర భవన నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్మాణ రంగానికి అవసరమైన అత్యుత్తమ మానవ వనరుల్ని తీర్చిదిద్దడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. నిర్మాణ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను యువత అందిపుచ్చుకునేలా అంతర్జాతీయస్థాయి నైపుణ్య శిక్షణ ఇక్కడ లభించనుంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సుల ద్వారా శిక్షణార్థులకు స్వయం ఉపాధితోపాటు ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక న్యాక్ సెంటర్‌ను మంథనికి కేటాయించడంపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నిర్మాణ రంగంలో ఉత్తర తెలంగాణ యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణను అందించడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పించేలా ఈ కేంద్రం వారధిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *