రోడ్డు భద్రతే లక్ష్యంగా పనిచేయాలి

– నూతన ఆర్‌టీఓలకు డైరెక్టర్ అభిలాష్ బిస్త్  పిలుపు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 17: రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయాలంటే టెక్నాలజీ ఆధారిత ఎన్‌ఫోర్స్‌మెంట్, సమర్థవంతమైన అమలు, ప్రజల్లో అవగాహన అనే మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్,పేర్కొన్నారు. రవాణా శాఖకు చెందిన ముగ్గురు రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ల (ఆర్‌టీఓలు) కోసం అకాడమీలో మే 18 నుంచి జూలై 17 వ‌ర‌కు నిర్వహించిన రెండు నెలల ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ముగింపు సందర్భంగా శుక్రవారం అకాడమీ లో నిర్వహించిన వాలెడిక్టరీ లోఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ  కార్యక్రమానికి తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ కమిషనర్ సి. రమేష్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. శిక్షణను పూర్తి చేసిన డి. జగదీష్, పి. భూషి రెడ్డి, చై సాయి చరణ్ కు డైరెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అభిలాష్ బిస్త్ మాట్లాడుతూ, యూనిఫాం సర్వీస్‌లో ప్రతి నిర్ణయం ప్రజల ప్రాణాలకు, భద్రతకు సంబంధించినదని అన్నారు. అందుకే లా, ప్రొసీజర్, మోటార్ వెహికల్స్ యాక్ట్, రూల్స్పై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలని సూచించారు. దేశంలో ప్రతి మూడు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటూ, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో పోలీస్ శాఖతో పాటు ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ బాధ్యత కూడా అత్యంత కీలకమని తెలిపారు. 90 శాతం ప్రమాదాలు ఉద్దేశపూర్వకంగా జరగవు. అయితే సమర్థవంతమైన చెకింగ్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ, డ్రైవింగ్ లైసెన్సుల మంజూరులో నాణ్యతను పాటించడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అనే మూడు స్తంభాలపై దృష్టి సారించి, టెక్నాలజీని వినియోగిస్తూ స్మార్ట్‌గా పనిచేస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆమె సూచించారు. పొందిన శిక్షణ భవిష్యత్తులో ప్రజలకు మరింత బాధ్యతాయుతమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అడిషనల్ కమిషనర్ సి. రమేష్ మాట్లాడుతూ, గతంలో అకాడమీలో 92మంది ఏఎంవీఐలు, అనంతరం 15మంది రెండో బ్యాచ్ ఏఎంవీఐలకు అందించిన శిక్షణ ఫీల్డ్‌లో ఎంతో ఉపయోగపడిందని, పోలీస్ శాఖతో సమన్వయంగా సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు దోహదపడిందని తెలిపారు. అదేవిధంగా ఈ ముగ్గురు ఆర్‌టీఓలు కూడా ఈ శిక్షణ ద్వారా మోటార్ వెహికల్స్ యాక్ట్, చట్టపరమైన అంశాలు, అమలు విధానాలపై సమగ్ర అవగాహన పొందారని, అకాడమీకి కృతజ్ఞతలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన ముగ్గురు ఆర్‌టీఓలు మాట్లాడుతూ ఈ ట్రైనింగ్ తమలో సేవా దృక్పథం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, ప్రజా సేవ పట్ల అంకితభావాన్ని మరింత పెంపొందించిందని తెలిపారు. ముఖ్యంగా అవుట్‌డోర్ ట్రైనింగ్, ఫిజికల్ ఫిట్‌నెస్ కార్యక్రమాలు తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని పేర్కొన్నారు. ఈ ముగింపు సమావేశంలో కోర్సు కో ఆర్డినేటర్ వేమా శ్రీనివాసరెడ్డి 2 నెలల శిక్షణ గురించి వివరించారు. ఔట్ డోర్ ఏడి రాంబాబు రెండు నెలల శిక్షణ విజయవంతం కావటానికి సహకరించిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు డా. చేతన, కవిత, వెంకటేశ్వర్లు, శ్రీరామమూర్తి, కె.ఆర్.కె. ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్లు వేమా శ్రీనివాసరెడ్డి, యార్లగడ్డ రాంబాబు, వేముల శ్రీనివాసరావు, ఆర్‌టీఓ రఘునాథ్ గౌడ్ ఎంవిఐ శీతల, డీఎస్పీ రామారావు, బి.కృష్ణ, ఆర్ఐ రామకృష్ణ, అకాడమీ, ట్రాన్స్‌పోర్ట్ శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *