– 3,000 మందికి కొత్తగా ఉద్యోగాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : రసాయనాల తయారీలో ప్రపంచంలోని అతి పెద్ద సంస్థల్లో ఒకటైన బీఏఎస్ ఎఫ్ హైదరాబాద్‌లో రెండు జీసీసీలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. గ్లోబల్ డిజిటల్ హబ్, గ్లోబల్ సర్వీసెస్ హబ్‌ల పేరుతో నెలకొల్పే ఈ రెండు జీసీసీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకార పత్రం (ఎలఓఐ) సమర్పించింది. ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జర్మన్ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్ సమక్షంలో బీఎఎస్ ఎప్ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు టోబియాస్ డ్రాట్ తెలంగాణ లైఫ్‌సైన్సెస్ సీఈఓ సర్వేశ్ సింగ్‌కు లెటర్ ఆఫ్ ఇంటెంట్ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈ ఏడాది 100 జీసీసీల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. వీటి ద్వారా లక్షమంది ఐటి నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. హైదరాబాద్ కేవలం కార్యాలయాల కేంద్రంగా మాత్రమే కాక ఆవిష్కరణలు, ఇంజినీరింగ్ రంగాల్లో ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేస్తున్నట్టు శ్రీధర్‌బాబు చెప్పారు. ఇందులో భాగంగా కృత్రిమ మేథస్సు ఆధారిత కేంద్రం ఐకామ్ (ఏఐకేఏఎం), యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, 200 ఎకరాల్లో ఏఐ సిటీ, క్వాంటమ్ హబ్, జీవ విజ్ణాన పరిశోధన్ సంస్థ ‘1 బయోల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. 160 సంవత్సరాల చరిత్ర కలిగిన బీఎఎస్ఎఫ్ ప్రపంచవ్యాప్తంగా 200కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 234 కర్మాగారాలు, 1,08,000 మంది ఉద్యోగులతో పనిచేస్తున్న ఈ సంస్థ వార్షిక ఆదాయం దాదాపు రూ.5 లక్షల కోట్లT (60 బిలియన్ డాలర్లు). ప్రపంచంలోని పలు నగరాలతో పోటీపడి హైదరాబాద్ ఈ ప్రతిష్ఠాత్మక అవకాశాన్ని దక్కించుకోవడం రాష్ట్రానికి దక్కిన గౌరవం. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, గూగుల్, వాన్‌గార్డ్, ఎలీ లిల్లీ, మారియట్ ఇంటర్నేషనల్ లాంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ జీసీసీలు ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయని శ్రీధర్‌బాబు అన్నారు. కార్యక్రమంలో బీఎఎస్ఎఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అలెగ్జాండర్ గెర్డింగ్, గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు టోబియాస్ డ్రాట్ , తెలంగాణ ప్రభుత్వ ఐటి అడ్వయిజర్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఐటీపీ ఏరో-ఇండియా ప్లాంట్‌కు భూమి పూజ 
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హార్డ్‌వేర్ పార్క్(ఫేజ్ 3)లో రూ.453 కోట్ల పెట్టుబడితో పదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఐటీపీ ఏరో – ఇండియా ప్లాంట్‌కు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం భూమి పూజ నిర్వహించారు. విమాన ఇంజన్ల రిజిడ్ ట్యూబ్స్‌కు అవసరమయ్యే ఎండ్-ఫిట్టింగ్స్, బ్రాకెట్లను ఐటీపీ ఏరో- ఇండియా ఉత్పత్తి చేస్తోంది. భూమి పూజ నిర్వహించిన ఈ ప్లాంట్‌లో 2027 నాటికి పూర్తిస్థాయిలో ఆపరేషన్స్ ప్రారంభం కానున్నాయి. ప్రిసిషన్ ఇంజనీరింగ్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో కొత్తగా 350 మందికి(హై స్కిల్డ్ ) ఉపాధి లభించనుంది. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో 600కు పెరగనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




