కాళేశ్వరం అవినీతిపై చర్యలేవీ?

-సీబీఐ మౌనం బీజేపి-బీఆర్ఎస్ లాలూచీకి నిదర్శనం
– వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
– రాష్ట్రస్థాయి రైతు మేళాలో మంత్రి పొంగులేటి

హైదరాబాద్/హన్మకొండ, ప్రజాతంత్ర, మే 5 : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపి ఇచ్చిన నివేదికను సీబీఐకి అప్పగించి తొమ్మిది నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బీజేపి, బీఆర్ఎస్ మధ్య లాలూచి రాజకీయాలకు నిదర్శనమని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపి ఎంపీలు చిత్తశుద్ధితో వ్యవహరించాలంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఆలస్యం చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై సీబీఐ ద్వారా సమగ్ర విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే వారి నిజాయతీ ప్రజలకు స్పష్టమవుతుందని అన్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల్లో భాగంగా హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ రూ.2 లక్షల పంట రుణ మాఫీ, సన్న వడ్లకు మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్, ఎకరాకు రూ.12,000 రైతు భరోసా, దశాబ్దాల భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం అని మంత్రి స్పష్టం చేశారు.

రైతు మేళా – ఆధునిక వ్యవసాయానికి వేదిక

ఈనెల 5, 6, 7 తేదీలలో నిర్వహిస్తున్న ఈ రైతు మేళాలో రైతులకు అవసరమైన యాంత్రిక పరికరాలను సబ్సిడీపై అందిస్తున్నామని మంత్రి తెలిపారు. రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రైతు మేళా వేదికగా భూసార పరీక్షలు నిర్వహించిన అధికారులకు మంత్రి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు దనసరి సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కె.ఆర్.నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, అగ్రికల్చర్ సెక్రటరీ, ‘హుడా’ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.అంతకుముందు రైతు మేళాలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను మంత్రి పొంగులేటి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *