కేరళ తరహాలో కళాకారులను ప్రోత్సహించాలి

– ఘనంగా ‘అర్థనారీశ్వరం’ జాతీయ నృత్యోత్సవం
– కళాకారులను సత్కరించిన భట్టి, జూపల్లి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : రాష్ట్రంలో ప్రాచీన కళలు, సంస్కృతిని కాపాడుకుంటూనే కళాకారులకు ఉపాధి కల్పించేలా దేవాదాయ, పర్యాటక, సాంస్కృతిక శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సోమవారం ఘనంగా నిర్వహించిన ‘అర్థనారీశ్వరం నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో లలిత కళలన్నింటికీ దేవాలయాల ప్రాంగణాలే ప్రధాన వేదికలుగా ఉండేవని గుర్తు చేశారు. ఆనాడు పాలకులు సమాజానికి ఇవ్వాలనుకున్న భక్తిభావనను, సామాజిక సందేశాలను నృత్య, కళా రూపాల ద్వారా ప్రజలకు రక్తికట్టేలా, సులువుగా అర్థమయ్యేలా వివరించేవారని కొనియాడారు. సాంస్కృతిక, పర్యాటక, దేవాదాయ శాఖలు చేతులు కలిపి ఉమ్మడి కార్యక్రమాలు చేపడితే రాష్ట్రంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేరళ తరహాలో ఇక్కడా పర్యాటక ప్రాంతాల్లో స్థానిక కళలను ప్రదర్శించేలా సరికొత్త వ్యవస్థను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్రంలో పర్యాటకులు సందర్శించే ప్రదేశాలలో సాయంత్రం వేళల్లో మన సంప్రదాయ కళారూపాలను ప్రదర్శిస్తే అటు పర్యాటకులకు వినోదంతోపాటు ఇటు కళాకారులకు ఉపాధి, తగిన ప్రోత్సాహం లబిస్తాయని చెప్పారు. అటు ఆలయాల్లో, ఇటు పర్యాటక ప్రాంతాల్లో కళలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది అని పేర్కొన్నారు. సంబంధిత శాఖ మంత్రి ఈ దిశగా చక్కని ప్రణాళికలతో పనిచేస్తారనే నమ్మకం తనకు ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి స్పష్టం చేశారు.

పురుషాధిక్యత కాదు.. సమానత్వమే ‘అర్థనారీశ్వరం’

‘అర్థనారీశ్వరం’ ప్రదర్శనపై స్పందిస్తూ భారతీయ సంస్కృతిలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమేననే ఉదాత్తమైన భావనను ఇది చాటుతుందని చెప్పారు. సృష్టిలో పురుష శక్తి, స్త్రీ శక్తి కలిసి సాగాలని, ఒకరికొకరు గౌరవించుకుంటూ, అభినందించుకుంటూ కలిసి పనిచేస్తే ఆ శక్తిని మించింది ఏదీ లేదనే గొప్ప సందేశం ఇందులో ఉందని వివరించారు. దేశం నలుమూలల నుండి ఈ ఉత్సవానికి విచ్చేసిన నృత్య కళాకారులకు డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే అతిథులను ప్రేమతో ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వడంలో రాష్ట్రానిది ప్రత్యేక శైలి అని, ఇక్కడి ఆతిథ్యాన్ని కళాకారులు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సత్కరించార.T ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజల తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *