– పదేళ్లలో భ్రష్టు పట్టించిన నేతలే చిల్లర రాజకీయాలు
– హరీష్ రావు, కెటిఆర్‌ల తీరుపై ఎంపీ చామల ఆగ్రహం
– సీఎం విజన్‌తో రాష్ట్రాభివృద్ధి చేస్తున్నారని కితాబు
యాదాద్రి భువనగిరి,ప్రజాతంత్ర, జూన్22: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ఓ విజన్‌తో ముందుకెళ్తుంటే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌తో విద్య, వైద్యం, రైతులకు మేలు చేయాలనే ఆలోచనతో సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు పోతున్నారని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై బావ, బామ్మర్దులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. భువనగిరిలో ఎంపీ చామల సోమవారం పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి సినిమా వాళ్లతో అంటకాగి సినిమా మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయంలో సినిమా మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజల జీవితాలు కేటీఆర్‌కు సినిమాలాగా కనపడుతున్నాయా.. అని కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన సూపర్ హిట్ అనుకుంటున్నారా…అని ప్రశ్నించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన షోలే సినిమా కాదని వ్యంగ్యంగా అన్నారు. రేవంత్‌రెడ్డి రెండున్నరేళ్ల పాలన గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని సెటైర్లు గుప్పించారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్నారని అన్నారు. రైతులకు వాస్తవ పరిస్థితులను వివరించి క్రాప్ డైవర్షన్‌పై అవగాహన కల్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పండించిన ధాన్యం అత్యధిక దిగుబడి వస్తే కేంద ప్రభుత్వం ఎందుకు కొనట్లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారని తెలిపారు. మెట్రోఫేజ్- 2 కోసం సంప్రదింపులు చేసి ఎల్ అండ్‌టీకి ఎగ్జిట్ ఇచ్చారని.. మెట్రోఫేజ్ -2ను పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు. మెట్రోఫేజ్-2పై బీఆర్‌ఎస్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. మెట్రోఫేజ్ -2పై కిషన్ రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారని, కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ ఇప్పించాలని, కలిసి అభివృద్ధిలో ముందుకెళ్దామని సీఎం అంటున్నారని అన్నారు. కేటీఆర్ బాధ్యతతో ప్రజల కోణంలో మాట్లాడాలని హితవు పలికారు. హైడ్రా బూచి చూపి ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. హైడ్రా హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకంగా మారిందని, నగరం ముంపునకు గురికాకుండా హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. బీజేపీ ఓటు, సీటు చోరీల గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





