– తుంగభద్ర జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడతాం
– తుమ్మిళ్ల రెండో దశ పనులను వేగవంతం చేస్తాం
– ఆర్‌డీఎస్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్‌డీఎస్) ఆధునికీకరణ పనులను ఆలస్యం చేయకుండా వేగవంతంగా పూర్తి చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్‌డీఎస్ వ్యవస్థను బలోపేతం చేయడం, తుంగభద్ర జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించడం, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండో దశ పనులను వేగంగా అమలు చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్‌డీఎస్, తుంగభద్ర ఆనకట్ట నిర్వహణ, అంతర్రాష్ట్ర జల పంపిణీ, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పురోగతి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. సమావేశంలో రైతు ప్రతినిధులు ఆర్‌డీఎస్ హెడ్‌వర్క్స్ దుస్థితి, పొరుగు రాష్ట్రాల ద్వారా జరుగుతున్న అనధికార నీటి మళ్లింపులు, తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకుపోయి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆర్‌డీఎస్ వ్యవస్థలోని అనేక నిర్మాణాలు కాలపరిమితి దాటిపోయాయని, అత్యవసర పునరుద్ధరణ అవసరమని వారు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్‌డీఎస్ ఆధునికీకరణ పనులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న బలోపేత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, కాలువ గట్లను పటిష్టం చేయాలని, నీటి నష్టాలను తగ్గిస్తూ కాల్వల సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టాలని సూచించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల రెండో దశలో భాగంగా మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు జలాశయాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను ప్రాధాన్యతతో చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ జలాశయాల ద్వారా సుమారు 2.12 టీఎంసీల స్థూల నీటి నిల్వ సామర్థ్యం ఏర్పడుతుందని తెలిపారు. భూసేకరణ వల్ల ప్రభావితమయ్యే రైతులకు న్యాయమైన, తగిన పరిహారం అందేలా చూడాలని రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మల్లమ్మకుంట జలాశయం వల్ల 567 ఎకరాలు, జూలకల్ వల్ల 382 ఎకరాలు, వల్లూరు జలాశయం వల్ల 2,216 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఆర్‌డీఎస్ కాల్వ వ్యవస్థ ద్వారా తెలంగాణకు హామీ మేరకు నీటి విడుదల కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కాల్వ వ్యవస్థలో కీలక ప్రాంతాల్లో నీటి ప్రవాహాలను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తుంగభద్ర జలాలపై తెలంగాణకు ఉన్న న్యాయబద్ధమైన హక్కు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన సాంకేతిక, న్యాయ, పరిపాలనా చర్యలన్నింటినీ ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. తుంగభద్ర బోర్డులో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారులు మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించారు. జలాశయ నిర్వహణ, కాల్వల నిర్వహణ, మౌలిక వసతుల సంరక్షణ అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను సమర్థంగా కాపాడాలని ఆదేశించారు. ఆర్‌డీఎస్ నిర్వహణ, కే.సీ కెనాల్ నీటి విడుదలలు, అంతర్రాష్ట్ర సమన్వయం, ట్రిబ్యునల్ తీర్పుల అమలు వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. సాంకేతిక అంశాలు, రైతుల ఆందోళనలు, న్యాయపరమైన అంశాలు, విధానపరమైన ప్రత్యామ్నాయాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆర్‌డీఎస్ ఆధునికీకరణ, తుంగభద్ర ఆనకట్ట భద్రత, తుంగభద్ర బోర్డు పాత్ర వంటి అంశాలపై త్వరలో ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా చర్చిస్తామని మంత్రి తెలిపారు. కర్ణాటక, ఏపీ, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగిస్తూనే రాష్ట్ర నీటి హక్కులను దృఢంగా కాపాడతామని స్పష్టం చేశారు. తుంగభద్ర జలాలను తెలంగాణకు న్యాయంగా అందేలా అన్ని స్థాయిల్లో చర్యలు కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. సమీక్షలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఈ.శ్రీధర్, సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, ఇంజినీర్-ఇన్-చీఫ్ జనరల్ రమేష్‌బాబు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





