నైరుతి ఆగమనం.. పలకరించిన తొలకరి

– హైదరాబాద్‌ ‌నగరంలో ఉరుములతో భారీ వర్షం
– ఎప్పటిలాగే లోతట్టు ప్రాంతాలు జలమయం
– అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 9: ‌తొలకరి పలకరించింది. నైరుతి ప్రవేశంతో హైదరాబాద్‌ ‌నగరంలో భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ ‌నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల తీవ్రతకు రామ్‌నగర్‌లోని వీఎస్టీ రోడ్డులో భారీ వృక్షం నేలకొరిగింది. అలాగే, హైదర్‌గూడలోనూ ఓ భారీ వృక్షం నేలకొరగడంతో ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. పలుచోట్ల రహదారులపై వర్షం నీరు చేరింది. ముషీరాబాద్‌లో ఈదురుగాలులకు విద్యుత్‌ ‌సరఫరాలో అంతరాయం కలిగింది. భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సిటీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా లోతట్టు కాలనీలు, ప్రధాన రహదారులు, కూడళ్లలో నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పంజాగుట్ట, ఖైరతాబాద్‌, ‌బంజారాహిల్స్, ‌యూసఫ్‌గూడ, టోలీచౌకి, ఫిలింనగర్‌, అ‌ర్‌పేట్‌, ఎస్సార్‌నగర్‌, ఎ‌ర్రగడ్డ, సనత్‌నగర్‌ ‌తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా సాగుతుండగా, కొన్ని చోట్ల ట్రాఫిక్‌ ‌జాం అయింది. కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రజలు వర్షం కారణంగా ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎం‌సీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు మరికొన్ని గంటల పాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్‌ ‌స్తంభాలు, చెట్లు, నీటితో నిండిన ప్రాంతాల వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భారీ వర్షాల ప్రభావంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  తెలంగాణలో బుధవారం కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రంగారెడ్డి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ ‌జిల్లాల్లో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 40 నుంచి 50కి. వేగంతో ఈదురుగాలులతో వర్షాలు పడొచ్చని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్‌, ‌కరీంనగర్‌, ‌వరంగల్‌, ‌నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, ‌మెదక్‌ ‌జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు తెలిపిన వాతావరణ శాఖ అధికారులు.. కామారెడ్డిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే, బుధవారం వికారాబాద్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌నారాయణపేట, గద్వాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *