అగ్నిప్రమాదాల పునరావృతం వెనుక బాధ్యతలేని పట్టణీకరణ

దిల్లీలో జరిగిన తాజా అగ్నిప్రమాదం మరోసారి దేశాన్ని విషాదంలో ముంచింది. ప్రాణనష్టం, ఆస్తినష్టం, అధికారుల తనిఖీలు, విచారణ కమిటీలు, పరిహార ప్రకటనలు. ఇవన్నీ ప్రతీ పెద్ద అగ్నిప్రమాదం తర్వాత కనిపించే దృశ్యాలు ఇవే. కొన్ని రోజులు చర్చ జరుగుతుంది. బాధ్యుల కోసం వెతుకులాట సాగుతుంది. ఆ తర్వాత మరో ప్రమాదం వరకు అంతా మామూలే. కానీ ఒక ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోతుంది. సాంకేతికంగా ఎంతో ముందుకు వెళ్లామని చెప్పుకునే మన దేశంలో ఇటువంటి అగ్నిప్రమాదాలు ఎందుకు పదేపదే జరుగుతున్నాయి?
దేశంలో అగ్నిప్రమాదాలు యాదృచ్ఛిక ఘటనలుగా మారడం లేదు. ప్రతి ఏడాది వేలాది మంది అగ్నిప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. గృహాలు, వాణిజ్య సముదాయాలు, హాస్పిటల్స్ , విద్యాసంస్థలు, పరిశ్రమలు ఏ రంగమూ దీనికి మినహాయింపు కాదు. దిల్లీ లోని ఉపహార్ సినిమా అగ్నిప్రమాదం, సూరత్‌ కోచింగ్ సెంటర్ ప్రమాదం, కోల్‌కతా హోటల్ అగ్నిప్రమాదం, రాజ్‌కోట్ గేమింగ్ జోన్ విషాదం వంటి ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అయినప్పటికీ వాటి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు పూర్తిగా అమలులోకి వచ్చినట్లు కనిపించడం లేదు. ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే సమస్య మంటల్లో కాదు, మన పట్టణ పాలనలో ఉందనే విషయం స్పష్టమవుతుంది. అగ్నిప్రమాదం ఒక సంఘటన మాత్రమే. దానికి దారితీసే నిర్లక్ష్యం, ప్రణాళికా లోపాలు, నిబంధనల అమలులో బలహీనతలు, బాధ్యతారాహిత్యమే అసలు కారణాలు.
భవనాలు ఎత్తు పెరిగాయి – భద్రతా సంస్కృతి కాదు:
దేశంలో పట్టణీకరణ వేగంగా విస్తరిస్తోంది. వచ్చే దశాబ్దాల్లో దేశ జనాభాలో గణనీయమైన భాగం నగరాల్లోనే నివసించనుంది. ఎత్తైన భవనాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, హాస్పిటల్స్ , షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి. కానీ వాటికి అనుగుణంగా భద్రతా సంస్కృతి ఎదగడం లేదు. ఒకప్పుడు నివాస అవసరాల కోసం నిర్మించిన భవనాలు నేడు వాణిజ్య సముదాయాలుగా మారుతున్నాయి. చిన్న దుకాణాలు పెద్ద రెస్టారెంట్లుగా రూపాంతరం చెందుతున్నాయి. గిడ్డంగులు కార్యాలయాలుగా మారుతున్నాయి. అయితే భవనాల వినియోగం మారినంత వేగంగా భద్రతా ప్రమాణాలు మారడం లేదు. ఫలితంగా పాత నిర్మాణాలపై కొత్త ప్రమాదాలు పేరుకుపోతున్నాయి.
మన నగరాల్లోని అనేక ప్రాంతాల్లో ఫైర్ ఇంజిన్ తిరగలేని ఇరుకైన వీధులు కనిపిస్తాయి. భవనాల చుట్టూ అత్యవసర వాహనాలకు దారి ఉండదు. పార్కింగ్ వాహనాలతో ప్రవేశ మార్గాలు మూసుకుపోతాయి. అత్యవసర నిష్క్రమణ ద్వారాలు వస్తువుల నిల్వ గదులుగా మారిపోతాయి. అనుమతి లేని అదనపు అంతస్తులు నిర్మించబడతాయి. విద్యుత్ వ్యవస్థలు అనుమతించిన సామర్థ్యానికి మించి వినియోగించబడతాయి. ప్రమాదం సంభవించిన తర్వాత ఇవన్నీ బయటపడతాయి. కానీ ప్రమాదం జరగకముందే గుర్తించి సరిదిద్దే వ్యవస్థ మాత్రం చాలా చోట్ల కనిపించదు. ఇదే మన పట్టణ భద్రతలోని అతిపెద్ద బలహీనత.
కాగితాలపై భద్రత – వాస్తవంలో ప్రమాదం:
అగ్నిప్రమాదాల్లో ఎక్కువ మంది మంటల వల్ల కాకుండా పొగ వల్ల ప్రాణాలు కోల్పోతారన్న విషయం తరచూ మరచిపోతాం. కొన్ని నిమిషాల్లోనే పొగ మెట్లు, కారిడార్లను కమ్మేస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోతాయి. ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు ఉన్నా, అత్యవసర నిష్క్రమణ మార్గాలు పనిచేయకపోతే అవి పెద్దగా ఉపయోగపడవు. అందుకే ఆధునిక అగ్నిభద్రత అంటే కేవలం మంటలను ఆర్పడం కాదు. ప్రమాదం సంభవించిన వెంటనే ప్రజలు సురక్షితంగా బయటపడేలా వ్యవస్థలను రూపొందించడం. ఇక్కడే మనం ఒక నిజాన్ని అంగీకరించాలి. మన సమస్య సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం కాదు. అమలు వ్యవస్థ బలహీనంగా ఉండటమే. అగ్నిభద్రతా నిబంధనలు ఉన్నాయి. నిర్మాణ ప్రమాణాలు ఉన్నాయి. తనిఖీ వ్యవస్థలు ఉన్నాయి. కానీ అవి చాలాసార్లు కాగితాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తుంటాయి.
దేశంలోని అనేక పెద్ద ప్రమాదాలపై జరిగిన దర్యాప్తుల్లో ఒకే తరహా లోపాలు బయటపడ్డాయి. అత్యవసర నిష్క్రమణ ద్వారాలు లేకపోవడం, అగ్నిమాపక పరికరాలు పనిచేయకపోవడం, అనుమతులు లేకుండా నిర్మాణ మార్పులు చేయడం, విద్యుత్ నిర్వహణలో నిర్లక్ష్యం వంటి అంశాలు పదేపదే వెలుగుచూశాయి. అంటే సమస్య నిబంధనల కొరత కాదు. వాటి అమలులో నిరంతర పర్యవేక్షణ లేకపోవడమే. ఇప్పటి వరకు అగ్నిప్రమాదాలపై మన దృష్టి ప్రధానంగా ప్రతిస్పందనపైనే ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత అగ్నిమాపక దళాలు ఎంత వేగంగా స్పందించాయన్నదానిపై చర్చ సాగుతుంది. కానీ ప్రమాదం సంభవించే అవకాశాన్ని ముందుగానే గుర్తించి అడ్డుకోవడంపై తగినంత దృష్టి లేదు.
స్మార్ట్ నగరాలకు స్మార్ట్ భద్రత అవసరం:
ఇరవై ఒకటో శతాబ్దంలో అగ్నిభద్రత అంటే కేవలం ఫైర్ ఇంజిన్లు, నీటి ట్యాంకులు, అగ్నిమాపక పరికరాలు మాత్రమే కాదు. డేటా, కృత్రిమ మేధ, సెన్సార్ సాంకేతికతలు కూడా అంతే కీలకమైనవి. కృత్రిమ మేధ , ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ , స్మార్ట్ సెన్సార్లు, రియల్‌టైమ్ మానిటరింగ్ వ్యవస్థలు భవనాల్లో ఉష్ణోగ్రత మార్పులు, పొగ స్థాయులు, గ్యాస్ లీకేజీలు, అసాధారణ విద్యుత్ వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షించగలవు. ప్రమాద సూచనలు కనిపించిన వెంటనే హెచ్చరికలు జారీ చేయగలవు. తద్వారా ప్రమాదం సంభవించకముందే జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ప్రపంచంలోని అనేక నగరాలు ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. భవనాల డిజిటల్ నమూనాలను రూపొందించి అత్యవసర పరిస్థితులను ముందుగానే అంచనా వేసే “డిజిటల్ ట్విన్” సాంకేతికతను వినియోగిస్తున్నాయి. ఒక ప్రాంతంలో మంటలు చెలరేగితే పొగ ఏ దిశగా వ్యాపిస్తుంది? ప్రజలను ఏ మార్గంలో తరలించాలి? అగ్నిమాపక వాహనాలు ఎంత సమయంలో చేరగలవు? వంటి అంశాలను ముందుగానే విశ్లేషిస్తున్నాయి.
స్మార్ట్ అంటే  సీసీ కెమెరాలు కాదు:
మన దేశంలో కూడా స్మార్ట్ సిటీ కార్యక్రమాలు అమలవుతున్నాయి. అయితే నగరాలను స్మార్ట్‌గా మార్చడం అంటే కేవలం సీసీ కెమెరాలు, వై-ఫై సదుపాయాలు ఏర్పాటు చేయడం కాదు. ప్రజల భద్రతను ముందుగానే నిర్ధారించే తెలివైన వ్యవస్థలను నిర్మించడమే అసలైన స్మార్ట్‌నెస్. అయితే సాంకేతిక పరిష్కారాలు మాత్రమే సరిపోవు. వాటిని అమలు చేసే పరిపాలనా సంకల్పం అవసరం. మున్సిపల్ సంస్థలు, అగ్నిమాపక శాఖలు, విద్యుత్ విభాగాలు, పట్టణాభివృద్ధి సంస్థలు విడివిడిగా కాకుండా సమన్వయంతో పనిచేయాలి. భవన అనుమతుల నుంచి భద్రతా పర్యవేక్షణ వరకు మొత్తం వ్యవస్థను డిజిటల్‌గా అనుసంధానించాలి. భద్రతా తనిఖీల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అధిక ప్రమాదం ఉన్న భవనాలను గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలి. అంతకంటే ముఖ్యంగా భద్రతను ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. అగ్నిభద్రతా ప్రమాణాలు వ్యాపారానికి అడ్డంకులు కావు; ప్రాణాలను, ఆస్తులను కాపాడే రక్షణ కవచం.
దిల్లీ ఘటన మరోసారి ఒక కఠినమైన పాఠాన్ని గుర్తుచేసింది. అగ్నిప్రమాదాలు ఒక్కసారిగా పుట్టుకొచ్చే విపత్తులు కావు. అవి సంవత్సరాల నిర్లక్ష్యం, బలహీన అమలు, బాధ్యతారాహిత్యపు ఫలితాలు. ప్రతి ప్రమాదం తర్వాత మంటలను ఆర్పడంలో మనం విజయం సాధించవచ్చు. కానీ వాటికి కారణమైన లోపాలను సరిదిద్దకపోతే అదే విషాదం మరో నగరంలో, మరో భవనంలో పునరావృతమవుతుంది.
భవనాల ఎత్తు పెరుగుతున్న కొద్దీ భద్రతా ప్రమాణాలు కూడా పెరగాలి. నగరాలు విస్తరిస్తున్న కొద్దీ పర్యవేక్షణ వ్యవస్థలు కూడా బలోపేతం కావాలి. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే నగరాల నుంచి, ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి అడ్డుకునే నగరాల వైపు భారత్ అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే ప్రతి అగ్నిప్రమాదం తర్వాత మనం కోల్పోయిన ప్రాణాలను లెక్కించగలుగుతాం గానీ, వాటిని కాపాడలేకపోయిన వ్యవస్థను మార్చలేం. అదే నేటి పట్టణ భారతం ముందున్న అసలు సవాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *