టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే

– మీ టికెట్ యాప్ ద్వారా సరళమైన సేవలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: వీకెండ్ సరదాగా ఫ్యామిలీతో బయటకు వెళ్లాలనుకుంటున్నారా.. మెట్రోలో ప్రయాణం… టెంపుల్ విజిట్, ఏదైనా పార్క్.. లేదంటే గోల్కొండ ఫోర్ట్, మ్యూజియం సందర్శించాలనుకుంటున్నారా.. పిల్లలకు సెలవులొచ్చాయి కానీ.. ఎండాకాలం అని భయపడుతున్నారా.. తీరా అక్కడికి వెళ్లాక టికెట్ కౌంటర్, క్యూ లైన్ అని వెనక్కు తగ్గుతున్నారా..ఇప్పుడా అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. జస్ట్ ఒక్క క్లిక్‌తో వీకెండ్ ప్లాన్ అంతా సాఫీగా సాగిపోతుంది. మీ స్మార్ట్ ఫోన్ ద్వారా సింపుల్‌గా ప్లే స్టోర్ నుంచి మీ టికెట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మన ప్రయాణ టికెట్లు సహా విజిటింగ్ ప్లేస్ టికెట్లు కూడా ఇంటి దగ్గరి నుంచే బుక్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ శాఖ పరిధిలో ఉన్న ‘మీ సేవ’ ద్వారా తెచ్చిన ఈ మీ టికెట్ యాప్ ఇప్పుడు ఎన్నో సర్వీసులను మీ అరచేతిలో ఉన్న ఫోన్ ద్వారా పొందే సౌకర్యాన్ని కల్పిస్తోంది. బస్, మెట్రో ప్రయాణ టికెట్లు మొదలు, టెంపుల్స్, పార్కులు, మ్యూజియం, ఫారెస్ట్ సఫారీ సందర్శన ఇలా చాలా రకాల సౌకర్యాలు, వాటి టికెట్లను అక్కడి క్యూ లైన్‌తో సంబంధం లేకుండా నేరుగా మనమే బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ ఎలక్ట్రిక్ కారులో  ప్రయాణిస్తే సమీపంలో ఉన్న చార్జింగ్ స్టేషన్ లోకేషన్‌ను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకునే వెసలుబాటు ఉంది. ఇలా ఇండోర్, అవుట్ డోర్ యాక్టివిటీస్‌తోపాటు వివిధ సేవలను ఒకే యాప్ ద్వారా అందించటమే ‘మీ టికెట్’ లక్ష్యం. ప్రవేశపెట్టిన కొద్ది రోజుల్లోనే ఈ యాప్ మంచి ప్రజాదరణ పొందుతోంది. ఇప్పటికే సుమారు రెండున్నర లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆరు లక్షలకుపైగా సేవలను పౌరులు బుక్ చేసుకున్నారు. రూ.4 కోట్లకుపైగా విలువైన లావాదేవీలు సురక్షితంగా జరిగాయి. వివిధ ప్రభుత్వ శాఖలు నిర్వహించే 219 లోకేషన్లలో ఈ మీ టికెట్ యాప్ ద్వారా అక్కడి సేవలకు సంబంధించిన ప్రవేశటికెట్లను నేరుగా యాప్‌లోనే ప్రజలు పొందుతున్నారు. టికెట్ ఏదైనా.. యాప్ ఒక్కటే నినాదంతో ఈ మీటికెట్ యాప్ ప్రజాదరణ పొందుతోంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సేవలను ఈ యాప్ పరిధిలోకి తీసుకొస్తామని, ఐటీ సేవలను పౌరసమాజం నిత్య జీవితంలో మరింతగా వాడుకునేలా విస్తరిస్తామని సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సందర్శించే ప్రాంతం ఏదైనా, అక్కడిదాకా వెళ్లి క్యూలైన్ లో నిరీక్షించే బదులు మీటికెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని సులభంగా, సౌకర్యవంతంగా అక్కడి ఎంట్రీ టికెట్లను, సౌకర్యాలను బుక్ చేసుకోవచ్చని ‘మీ సేవ’ కమిషనర్ టి.రవికిరణ్ వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *