కొనసాగుతున్న ఆంటీ ఇన్కంబన్సీ ..!

భారత ప్రజాస్వామ్యంలో వోటరు తీర్పు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటుంది. గడిచిన రెండున్నరేళ్ల  ఎన్నికల ఫలితాల  సరళిని నిశితంగా పరిశీలిస్తే, దేశ రాజకీయాల్లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అది “ప్రభుత్వ  వ్యతిరేకత” (Anti-incumbency). వోటరు కేవలం వాగ్దానాలకో, భావోద్వేగాలకో లోనవ్వకుండా, తమ జీవితాల్లో వొస్తున్న మార్పులకు అనుగుణంగా , పాలనలో వైఫల్యం కనిపిస్తే కనికరం లేకుండా గద్దె దించుతున్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి నేటి వరకు జరిగిన వరుస పరిణామాలు ఈ ‘ప్రజాస్వామ్య హెచ్చరిక’ను స్పష్టం చేస్తున్నాయి.
2023వ సంవత్సరం భారత రాజకీయాల్లో ఒక కీలక మలుపు. కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి ప్రధాన రాష్ట్రాల్లో వోటరు మార్పు వైపే మొగ్గు చూపారు.
కర్ణాటక లో 40 శాతం కమిషన్’ ఆరోపణలు, పాలనాపరమైన విమర్శల మధ్య బిజెపి ప్రభుత్వాన్ని కాదని ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఇక్కడ వోటరు స్థానిక అంశాలకు, అవినీతికి వ్యతిరేకంగా వోటు వేశారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన పార్టీగా పదేళ్ల పాటు తిరుగులేని అధికారాన్ని అనుభవించిన బిఆర్ఎస్ (అప్పటి టిఆర్ఎస్) కు ప్రజలు షాక్ ఇచ్చారు. సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పెరిగిన అసంతృప్తి, నిరుద్యోగం, కుటుంబ పాలన వంటి అంశాలు అధికార మార్పిడికి దారితీశాయి.రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ఈ  రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారం కోల్పోయాయి. రాజస్థాన్‌లో ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం కొనసాగగా, ఛత్తీస్‌గఢ్‌లో క్షేత్రస్థాయిలో వొచ్చిన మార్పు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.ఈ ఫలితాలన్నీ ఒకే విషయాన్ని చాటి చెప్పాయి: ప్రజలు మార్పును కోరుకుంటే, ఎంతటి బలమైన నేతలనైనా ఇంటికి పంపుతారు.
    2024 లోక్‌సభ ఎన్నికలు భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. ‘అబ్ కీ బార్ 400 పార్’ అన్న నినాదంతో రంగంలోకి దిగిన బిజెపి, చివరికి 240 స్థానాలకే పరిమితం కావాల్సి వొచ్చింది. మిత్రపక్షాల అండతో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ, బిజెపి సొంతంగా మెజారిటీ సాధించలేకపోవడం ఒక రకమైన ‘ప్రజా వ్యతిరేకత’కు సంకేతమే.బిజెపి కి బలమైన కోటగా భావించే ఉత్తరప్రదేశ్‌లో సీట్లు భారీగా తగ్గడం, గ్రామీణ భారతంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల పట్ల ఉన్న ఆగ్రహానికి ప్రతిరూపం.  ఈ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్ , ఒడిస్సా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, ఒడిస్సాలో 24 ఏళ్ల నవీన్ పట్నాయక్ సుదీర్ఘ పాలనను ప్రజలు అంతం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి శూన్యం, అరాచక పాలన వంటి ఆరోపణలు జగన్ ప్రభుత్వాన్ని కూల్చగా, ఒడిస్సాలో ఒడియా అస్తిత్వం, అధికారపార్టీ  వర్గాల మితిమీరిన జోక్యం బిజెపిని అధికారంలోకి తెచ్చింది.
    ఆ తరువాత 2025 లో  జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను గమనిస్తే, ఇదే ట్రెండ్ కొనసాగింది . ఝార్ఖండ్, మహారాష్ట్ర వంటి చోట్ల సమీకరణలు మారినప్పటికీ, హర్యానా వంటి రాష్ట్రాల్లో మినహా, మెజారిటీ చోట్ల అధికారంలో ఉన్న పార్టీలు తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. మూడు రాష్ట్రాల్లో ప్రజలు పాత పాలకులను కాదని కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఇది కేవలం రాజకీయ పార్టీల గెలుపోటములు మాత్రమే కాదు, ప్రజలు తమ వోటు హక్కును ఒక ‘ఆయుధం’లా వాడుతున్నారనడానికి నిదర్శనం.
     తాజాగా  వెలువడిన వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ ఎన్నికల ఫలితాలు కూడా ప్రభుత్వ  మార్పు వైపే  వోటరు మొగ్గు చూపారని స్పష్టం చేస్తున్నాయి . ఈ మూడు రాష్ట్రాల్లోనూ పాలకుల పట్ల ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. పదిహేనేళ్ల పాటు తిరుగులేని నాయకత్వాన్ని ప్రదర్శించిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్  2026లో భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.
రాష్ట్రంలో పెరిగిన హింస, అవినీతి ఆరోపణలు, మరియు అధికార పార్టీ నేతల పెత్తనం పట్ల విసుగు చెందిన బెంగాల్ వోటరు బిజెపికి పట్టం కట్టాడు. ‘మార్పు’ అనే నినాదం మళ్ళీ బెంగాల్ గడ్డపై వినిపించింది. తమిళనాడులో డీఎంకే  ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పసిగట్టిన వోటరు, ఈసారి సాంప్రదాయ పార్టీలకు భిన్నంగా అడుగు వేశారు. నటుడు విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కజగం  అనూహ్య విజయాలను నమోదు చేయడమే కాకుండా, అధికార డీఎంకే ను మూడవ స్థానానికి నెట్టడం అక్కడి వోటరు మార్పు పట్ల ఎంత ఆత్రుతగా ఉన్నారో తెలుపుతోంది.నిరంతరం సంప్రదాయాలను మార్చే కేరళ వోటరు, ఈసారి కూడా పినరయి  విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్  కు షాక్ ఇచ్చారు. అవినీతి, బంధుప్రీతి ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్  భారీ మెజారిటీతో అధికారంలోకి వొచ్చింది. ఇక్కడ కూడా అధికార పార్టీ అహంకారంపై సామాన్యుడు గెలిచాడు.
     ప్రజలు అధికార పార్టీలకు వ్యతిరేకంగా వోటు వేయడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం యువతలో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. కేవలం ఉచిత పథకాలు ఇస్తే సరిపోదని, ఉపాధి కల్పన అవసరమని వోటరు భావిస్తున్నాడు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీల నాయకుల్లో పెరిగే అహంకారం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల మితిమీరిన జోక్యం ప్రజలకు విసుగు తెప్పిస్తున్నాయి. గతంలో “మాకు వేరే దారి లేదు” అనుకునే వోటరు, ఇప్పుడు అందుబాటులో ఉన్న చిన్న చిన్న కూటములను కూడా ప్రత్యామ్నాయంగా చూస్తున్నాడు. జాతీయ నాయకత్వం ఎంత బలంగా ఉన్నా, స్థానికంగా ఎమ్మెల్యేలు లేదా స్థానిక నేతలు సరిగా పనిచేయకపోతే వోటరు కనికరం చూపడం లేదు.
     రాజకీయ పార్టీలకు ఈ ఫలితాలు ఒక గుణపాఠం. తాము చేసే అభివృద్ధి పనులు, ఇచ్చే హామీలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, సామాన్యుడి గడప వరకు చేరాలని వోటరు కోరుకుంటున్నాడు. “మేము గెలిచాం కదా, మా ఇష్టం వొచ్చినట్లు చేస్తాం” అంటే చెల్లదని, ప్రతి ఐదేళ్లకోసారి పరీక్ష ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నాడు. భారత వోటరు ఇప్పుడు మరింత పరిణతి చెందాడు. భావోద్వేగాల కంటే భవిష్యత్తుకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం లోపిస్తే, అది ఎంతటి బలమైన పార్టీ అయినా గద్దె దిగక తప్పదు. ఈ క్రమమే భారత ప్రజాస్వామ్యాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా నిలుపుతోంది. పార్టీలు తమ వ్యూహాలను మార్చుకోవాలి, ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి. ఎందుకంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలే అసలైన ‘అధికార కేంద్రాలు’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *