సీఈసీ నోటీసులు అందుకోనున్న 62ల‌క్ష‌ల మంది!

పలు వివాదాలు , అభ్యంతరాల మధ్య దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో వివిధ దశలలో కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన వోటర్ల సవరణ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో వోటరు జాబితా నుంచి 73 లక్షల పేర్లు తొలగిపోనున్నాయన్న వార్త రాష్ట్రాన్ని కుదిపేస్తున్నది. బీఎల్‌వో ఇంటికొచ్చినప్పుడు ఫారం నింపి ఇచ్చి, రసీదు భద్రంగా దాచుకుని, నిశ్చింతగా ఉన్నామనుకుంటున్న  2.64 కోట్ల మందిలో 62 లక్షలకు పైగా వోటర్లకు త్వరలో నోటీసులు రానున్నాయి. అంటే ఫారం సమర్పించిన ప్రతి నలుగురిలో ఒకరు మళ్లీ అధికారుల ముందు నిలబడి, తమ ఉనికిని కాగితాలతో నిరూపించుకోవాల్సిందే. తొలగిపోయిన 73 లక్షల మందికి కనీసం తమ పేరు పోయిందని తెలుస్తది  . కానీ ఈ 62 లక్షల మందికి ముసాయిదా జాబితాలో పేరు కనిపిస్తది . . ఆ పేరు పక్కనే ఒక ప్రశ్నార్థకం వేలాడుతున్న‌ది. వారు తమది బయోలాజికల్ జననం అని నిరూపించుకోవాలే , 2002 నాటి రుజువుల ప్ర‌శ్న‌లు సంధించే ఈసీ ఇప్పుడు ఏ కాగితం చెల్లుతదో  స్ప‌ష్టంగా ఇప్ప‌టివ‌ర‌కు చెప్ప‌లేదు. పోనీ త‌మ వ‌ద్ద‌నున్న స‌ర్టిఫికెట్‌ను చూపుదామ‌నుకుంటే ఇది ‘తుది రుజువు కాదు’అని సీఈఓ అంటుండ‌టంతో ఇప్పుడు వోట‌ర్ల వోటుహ‌క్కు డైల‌మాలో ప‌డింది.

ఆగస్ట్   10, 2026 అర్ధరాత్రి నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే , ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ తొలి విడత గడువు ముగిసింది. అయితే, ఈ సవరణ ప్రక్రియ వెల్లడించిన గణాంకాలు  పట్టణ వోటరు  ఉదాసీనతను, మారుతున్న వలసల ధోరణిని, ఎన్నికల నిర్వహణలోని క్షేత్రస్థాయి సవాళ్లను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. దీనిపై లోతైన విశ్లేషణ అవసరం.రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం వెల్లడించిన తాజా అధికారిక గణాంకాల ప్రకారం, తెలంగాణలో ప్రస్తుతం మొత్తం వోటర్ల సంఖ్య 3,38,26,448 గా నమోదైంది. ఈ భారీ వోటర్ల సమూహాన్ని ప్రక్షాళన చేసేందుకు నిర్వహించిన ఇంటింటి సర్వేలో సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాలలో 78.3 శాతం డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయింది. అంటే సుమారు 2,64,73,616 మంది వోటర్ల వివరాలు కంప్యూటరీకరణ ద్వారా డిజిటల్ వ్యవస్థలోకి చేరినయ్ . ఈ డిజిటలైజేషన్ లో జిల్లాల వారీగా సాధించిన పురోగతిని పరిశీలిస్తే ఆసక్తికరమైన, అదే సమయంలో ఆందోళనకరమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఏకంగా 94.31 శాతం డిజిటైజేషన్ తో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అవగాహనను, అధికారుల సమర్థతను చాటిచెప్పింది.
దీనికి పూర్తి విరుద్ధంగా, అత్యాధునిక సాంకేతికతకు, చదువుకున్న విద్యావంతులకు , ఐటీ రంగానికి నిలయమైన హైదరాబాద్ జిల్లా కేవలం 58.89 శాతంతో రాష్ట్రంలోనే చిట్టచివరి స్థానానికి పరిమితం కావడం విస్మయానికి గురిచేస్తున్నది .పట్టణ ప్రాంతాల్లో వోటర్ల ఉదాసీనత మరోసారి ఈ సర్వే ద్వారా స్పష్టంగా బహిర్గతమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో డిజిటైజేషన్ ప్రక్రియ అత్యంత మందకొడిగా సాగడానికి కేవలం అధికార యంత్రాంగం లోపమే కారణం కాదు, నగరవాసుల నిర్లిప్తత కూడా ప్రధాన కారణం. క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులు ఇళ్లకు వొచ్చినప్పుడు నివాసితులు అందుబాటులో ఉండకపోవడం లేదా వోటు నమోదు ప్రక్రియ పట్ల ఆసక్తి చూపకపోవడం వల్ల డిజిటలైజేషన్ రేటు గణనీయంగా పడిపోయింది. నగరాల్లోని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలోకి అధికారుల ప్రవేశానికి ఉన్న ఆంక్షలు కూడా ఈ ప్రక్రియను కొంతవరకు మందగించేలా చేసినయ్ .
ఈ సవరణ ప్రక్రియలో అత్యంత చర్చనీయాంశంగా మరియు వివాదాస్పదంగా మారిన అంశం సుమారు 73.39 లక్షల వోట్లు ప్రత్యేక ఏఎస్డీ  జాబితాలోకి చేరడం. ఇంటింటి సర్వేలో ఇళ్ల వద్ద అందుబాటులో లేనివారు, ఉపాధి లేదా ఇతర కారణాల వల్ల ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, మరణించిన వారు , నకిలీ వోటర్లను ఈ కేటగిరీ కింద అధికారులు గుర్తించారు.
ఇందులో సుమారు 45 లక్షల మందికి పైగా వోటర్లు వలస వెళ్లినట్లు తేలడం గమనార్హం. నగరాల్లో స్థిరపడినప్పటికీ, తమ స్వగ్రామాల్లోని సామాజిక బంధాలు, రాజకీయ పట్టు లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి కోసం నగర వోటును ఒదులుకుని సొంతూరులోనే వోటును ఉంచుకోవడానికి మొగ్గు చూపడం వల్ల ఈ భారీ వ్యత్యాసం ఏర్పడింది. అయితే, ఈ 73 లక్షల మందిలో కేవలం ఇల్లు మారిన కారణం చేత ఏ ఒక్క నిజమైన అర్హత కలిగిన వోటరు కూడా తమ ప్రాథమిక హక్కును కోల్పోకుండా చూడాల్సిన గురుతర బాధ్యత ఎన్నికల యంత్రాంగం పై ఉంది.
ఎన్నికల సంఘం ప్రకటించిన సవరించిన షెడ్యూల్ ప్రకారం, ఆగస్ట్  17న ముసాయిదా వోటర్ల జాబితా అధికారికంగా విడుదల కానుంది. ఈ జాబితా ఆధారంగా ఆగస్ట్  17 నుండి సెప్టెంబర్ 16 వరకు ఒక నెల రోజుల పాటు ప్రజల నుండి అభ్యంతరాలు, ఆరోపణల స్వీకరణకు అవకాశం కల్పించినృ . సమగ్ర వోటర్ల సవరణ  అనేది కేవలం ఒక అధికారిక కాగితపు కసరత్తు కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను రూట్ స్థాయి నుండి పటిష్టం చేసే  ప్రక్రియ. సాంకేతికతను వాడుకుంటూ కోట్ల సంఖ్యలో ఉన్న ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటైజేషన్ చేయడం అభినందనీయం. అయితే, సాంకేతిక లోపాలు లేదా సమయ లేమి వల్ల ఏ ఒక్క నిజమైన పౌరుడూ వోటు హక్కుకు దూరం కాకూడదు.
 ఒకవేళ పొరపాటున ఎవరి పేరైనా ముసాయిదా జాబితాలో లేకపోయినా, లేదా ఏఎస్డీ జాబితాలోకి వెళ్లినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు నిర్ణీత గుర్తింపు పత్రాలతో ‘ఫారమ్-6’ ద్వారా తిరిగి కొత్తగా వోటు హక్కు కోసం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవొచ్చు. ఈ సవరణలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అక్టోబర్ 19న తుది వోటర్ల జాబితా ను ప్రచురిస్తరు. రాజకీయ పార్టీలు కూడా కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా, ఇటువంటి ప్రక్షాళన సమయాల్లో వోటర్లలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేయాలి. అదే సమయంలో, పౌరులు కూడా తమ బాధ్యతను గుర్తించి రాబోయే ముసాయిదా జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాల్సిన అవసరం వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *