– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధ్వజం
– హామీలన్నీ అమలు చేశాకే తెలంగాణలో అడుగు పెట్టాలి
– రాహుల్, ప్రియాంకలకు స్పష్టీకరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ సమ్మిట్ ముమ్మాటికీ యాంటీ భారత్ సమ్మిట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన ఈ సదస్సు వెనుక జరుగుతున్న రాజకీయ, అంతర్జాతీయ కుట్రలను వివరించారు. తొలుత ఈ సదస్సు తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమం అనుకున్నామని, కానీ రెండు రోజులుగా సల్మాన్ ఖుర్షీద్, చికాగో నుంచి శామ్ పిట్రోడా చేసిన ట్వీట్లను గమనిస్తే ఇది విదేశీ శక్తులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న కుట్రపూరిత నాటకమని స్పష్టమైందని రామచందర్ రావు తెలిపారు. వంద దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రతినిధుల ముందు రాహుల్ గాంధీ ఆలోచనా విధానాన్ని ఉంచి ఆయనను కాబోయే ప్రధానిగా, ‘ప్రధానమంత్రి మెటీరియల’గా ప్రొజెక్టు చేయడానికే ఈ వేదికను వాడుకుంటున్నారని కాంగ్రెస్ నేతలే స్వయంగా చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. áదేశంలో 140 కోట్ల ప్రజల చేతిలో పదేపదే తిరస్కరణకు గురై విఫలమైన రాహుల్ గాంధీని విదేశీ ప్రతినిధులను అడ్డుపెట్టుకుని రీలాంచ్ చేయాలని చూడటం హాస్యాస్పదమన్నారు.
ప్రోగ్రెసివ్ అలయెన్స్ వెనుక ప్రమాదకర శక్తులు
ఈ ప్రోగ్రెసివ్ అలయెన్స్ వెనుక అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసే కుట్రదారులు ఉన్నారని రామచందర్‌రావు ఆరోపించారు. ఫాక్స్ న్యూస్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వెలుగులోకి తెచ్చిన నిజాలను ప్రస్తావిస్తూ తొమ్మిది దేశాల్లో విద్యార్థులను పావులుగా వాడుకుంటూ ఇస్లామిక్, కమ్యూనిస్ట్ నిరసనల ఎకోసిస్టమ్‌ను నడుపుతున్న 101 సంస్థలు ఈ కూటమి వెనుక ఉన్నాయని తెలిపారు. ఫ్రాన్స్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడానికి ‘రెజీమ్ చేంజ’ పేరిట జరిగిన హింసాత్మక అల్లర్ల వెనుక వీరే ఉన్నారన్నారు. జార్జ్ సోరోస్ లాంటి భారత వ్యతిరేక శక్తుల నిధులతో నడిచే ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ డెలిగేషన్‌తో సోనియా గాంధీ 10 జనపథ్‌లో, మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ కార్యాలయంలో సమావేశమయ్యారని గుర్తు చేశారు. ఈ కూటమిలో ప్రజాస్వామ్యం లేని 42 ఇస్లామిక్ దేశాలు, లెఫ్టిస్ట్ దేశాలు, నియంతృత్వ రాచరిక వ్యవస్థల ప్రతినిధుల ప్రమేయం ఉందని హెచ్చరించారు. అలాంటి శక్తులకు హైదరాబాద్‌ను అడ్డాగా మార్చి దేశంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని హెచ్చరించారు. విదేశీ శక్తుల అండతో 2029 సార్వత్రిక ఎన్నికల వరకు దేశంలో నిరంతరం అరాచకాలు, హింసను సృష్టించి ప్రభుత్వ మార్పు తేవాలన్నదే కాంగ్రెస్ దుష్ట పన్నాగమని ఆరోపించారు. గతంలో కూడా ఇదే ప్రోగ్రెసివ్ అలయెన్స్, తెలంగాణ ప్రభుత్వం కలిసి నిర్వహించిన సమ్మిట్ కోసం సుమారు రూ.29 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టారని, ఇప్పుడు మళ్లీ అదే రీతిలో నిధులు వాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ అజెండాతో హింసను ప్రేరేపిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. భారతదేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న ప్రోగ్రెసివ్ అలయెన్స్‌తో గాంధీ కుటుంబానికి ఉన్న రహస్య సంబంధాలను రాహుల్, ప్రియాంక, సోనియాలు దేశ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
హామీలు అమలు చేశాకే తెలంగాణలో అడుగుపెట్టాలి
అసెంబ్లీ ఎన్నికల ముందు ఊరూరా తిరిగి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, వర్గాల వారీ డిక్లరేషన్లను పూర్తిగా అమలు చేశాకే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణలో అడుగుపెట్టాలని రామచందర్‌రావు స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా రైతుభరోసా ఇవ్వలేదని, ఎల్‌నినో ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయలేదని, నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ నేతలకు తెలంగాణలో పర్యటించే నైతిక హక్కే లేదన్నారు. వారు రాష్ట్రానికి వస్తే బీజేపీ తరపున అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ప్రజల ఆస్తులైన ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అమ్ముకుంటూ పాలన నెట్టుకొస్తోందని రామచందర్ రావు దుయ్యబట్టారు. 34 నెలలుగా ప్రభుత్వ భూముల అమ్మకాలు, మార్ట్గేజ్ల ద్వారా సుమారు రూ.30 వేల కోట్లు సమకూర్చుకున్న ఈ ప్రభుత్వం ఆ నిధులను వేటి కోసం ఖర్చు చేసిందో శ్వేతపత్రం ద్వారా ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మియాపూర్‌లోని ఐదు వేల ఎకరాల హెచఎండీఏ, టీజీఐఐసీ విలువైన భూములను కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు తెగనమ్మేందుకు, తాకట్టు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. హైడ్రా పేరుతో భయాందోళనలు సృష్టించి సుప్రీంకోర్టు తీర్పు రాగానే మియాపూర్ భూములను అమ్ముకుంటామనడం సిగ్గుచేటన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారం
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గత 12 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.13 లక్షల కోట్లకుపైగా నిధులు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. నేషనల్ హైవేలు, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, రైల్వే లైన్లు, వందే భారత్ రైళ్లు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధి బీజేపీ ప్రభుత్వ ఘనత అని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు రవి నాయక్, రాష్ట్ర అధికార ప్రతినిధులు సోలంకి శ్రీనివాస్, ముత్యాల తిరుపతి రెడ్డి, విశ్రాంత జాయింట్ కలెక్టర్ చక్రధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





