– సమాజ భద్రతే మెరుగైన భవిష్యత్తుకు పెట్టుబడి
– ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
–అంతర్రాష్ట్ర నేరాల నియంత్రణకు ఉమ్మడి సహకారం
– నేరస్థుల మార్పిడికి వ్యవస్థీకృత నిర్మాణం
– పోలీసుల విధానాలపై ప్రజెంటేషన్
– ఉగ్రవాదం,సైబర్ నేరాల నియంత్రణపై చర్చ
– ట్రాన్స్ జండర్లకు పోస్టింగ్లు ఇచ్చిన తొలిరాష్ట్రంగా తెలంగాణ
– సమాచార సమన్వయానికి డీజీపీ పిలుపు
– దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ సదస్సు సక్సెస్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 23 : దక్షిణాది రాష్ట్రాల పోలీసుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసుకొని, సరిహద్దులు దాటి మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థలో విస్తృత సంస్కరణలు, నేరాల నియంత్రణకు పటిష్ఠమైన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.శుక్రవారం హైదరాబాదులోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసు వ్యవస్థపై చేసే వ్యయం సమాజ భద్రత, మెరుగైన భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగా భావించాలన్నారు. హైదరాబాద్ ప్రాంతంలో పోలీసు వ్యవస్థను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మూడు కమిషనరేట్లుగా విభజించడం ద్వారా స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం కలిగిందన్నారు. నేరాల స్వరూపానికి అనుగుణంగా హైడ్రా, ఈగిల్, టి సేఫ్, టి మార్స్ వంటి ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేశామని వివరించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక విభాగాలు దృష్టి సాధిస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల కట్టడి, తెలంగాణ పోలీసులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. ప్రధానమంత్రి ప్రగతి సమీక్ష సమావేశంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా మార్చడంలో కృషి చేసిన పోలీసు అధికారులను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అభినందించారని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ఈగిల్ ఫోర్స్‌కు కేంద్ర ప్రభుత్వ అంచనాల్లో 80 శాతానికి పైగా మార్కులు లభించాయని తెలిపారు. సైబర్ మోసాల బాధితులకు డబ్బు తిరిగి అందించడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక ప్రమాణాలను నెలకొల్పిందన్నారు. అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తరహాలో ఆహార కల్తీ, ఔషధాల నియంత్రణకు సంబంధించిన చర్యలను సమన్వయం చేసేందుకు టీ సేఫ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. చెరువులు, జలవనరులను పరిరక్షించడం, పునరుద్ధరించడం, ప్రజా ఆస్తులను కాపాడటంలో హైడ్రా ప్రజల మన్ననలు పొందుతోందన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లను నియమించిన దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. పోలీసు సిబ్బంది కుటుంబాల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమన్న ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా పోలీసు స్కూల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు హోదా, సర్వీసును బట్టి కనీసం రూ.కోటి నుంచి గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు ఎక్స్‌గ్రేషియా,ఇంటి స్థలాలు, అర్హులైన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఏ ఒక్క రాష్ట్రం తనంతట తానుగా నేరరహితంగా మారలేదని, ముఖ్యంగా సరిహద్దులు దాటి జరిగే నేరాలను అరికట్టేందుకు రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం అత్యవసరమని పేర్కొన్నారు. సమావేశంలో విస్తృత చర్చల అనంతరం పటిష్ఠమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, పోలీసు ప్రధాన కార్యాలయాల మధ్య సమాచార మార్పిడి, పరస్పర సహకారం కోసం సమర్థమైన వ్యవస్థలను అభివృద్ధి చేయాలని సూచించారు. దక్షిణ భారతాన్ని సురక్షితమైన ప్రాంతంగా తీర్చిదిద్దే బాధ్యత పోలీసు శాఖలపై ఉందని పేర్కొంటూ, పొరుగు రాష్ట్రాలతో సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను పంచుకునేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. సమష్టి కృషితో సురక్షిత దక్షిణ భారతాన్ని నిర్మించాలని పిలుపునిస్తూ, సమావేశం విజయవంతం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
నేరాల కట్టడికి దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి కార్యాచరణ తో పాటు ఉమ్మడి సెక్రటేరియట్ ను ఏర్పాటు చేసి, అన్ని దక్షిణాది రాష్ట్రాలు నోడల్ అధికారులను నియమించాలని సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు.సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదాన్ని సమర్థంగా అరికట్టేందుకు రాష్ట్రాల మధ్య సమాచార మార్పిడి, సమన్వయాన్ని బలోపేతం చేయాలని ఈ సమావేశంలో డిజిపి పిలుపునిచ్చారు.మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా తెలంగాణ పోలీసు శాఖ ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి, సిబ్బంది నైపుణ్యాలను సమర్థంగా వినియోగిస్తోందని డిజిపి సి. వి. ఆనంద్ తెలిపారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, రహదారి భద్రత వరకు కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసు వ్యవస్థను ఆధునికీకరిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి, జిల్లా పోలీసుల సమన్వయంతో సమర్థవంతమైన ఆపరేషన్లు నిర్వహించామని వివరించారు. ఈ కృషితో తెలంగాణ నక్సల్స్ రహిత రాష్ట్రంగా ఎదిగి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ విజయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు ఆక్టోపస్ పని చేస్తుంది. మాదకద్రవ్యాల ముప్పుల ముందుగానే గుర్తించి, 2023లో ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ ఈగల్ ఫోర్స్ కు అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు సిబ్బందికి 30 శాతం అదనపు వేతనాన్ని మంజూరు చేశామన్నారు.ఈ విభాగం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలువురు డ్రగ్స్ నేరస్థులను పట్టుకుందని పేర్కొన్నారు. గత సెప్టెంబరు 22న న్యూ ఢిల్లీ లో జరిగిన సమావేశంలో డ్రగ్స్ నియంత్రణ చర్యలకు గాను ఈగల్ ఫోర్స్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా జాతీయ స్థాయి పురస్కారం అందుకోవడం గర్వకారణమన్నారు.సైబర్ నేరాల బాధితులకు ఉపశమనం కల్పించడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలకంగా పనిచేస్తోందన్నారు. సైబర్ మోసాల బాధితులకు పోర్టళ్ల ద్వారా రూ.69.4 కోట్లను తిరిగి అందించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి ప్రగతి సమీక్షలో సైబర్ భద్రతా విభాగం వరుసగా రెండుసార్లు జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలవడం పోలీసు శాఖ పనితీరుకు నిదర్శనమన్నారు. తెలంగాణలో 824 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వీరి కదిలికపై ఎస్ఐబి నిఘా కూడా ఉంచామన్నారు.
నక్సల్స్ అంతరించడంతో అడవుల్లో కూంబింగ్ అవసరం తగ్గడంతో గ్రేహౌండ్స్, ఎస్ఐబీ, ఆక్టోపస్ సిబ్బందిని పునర్వ్యవస్థీకరించి రోడ్ సేఫ్టీ, టీజీ సేఫ్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తదితర విభాగాలకు వినియోగిస్తున్నట్లు వివరించారు. ఆహార పదార్థాల కల్తీని అరికట్టేందుకు టీజీ సేఫ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.హైదరాబాద్‌లో రూ.600 కోట్లతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా లక్షకు పైగా సీసీ కెమెరాలను అనుసంధానించి, పోలీసు కార్యకలాపాలు, విపత్తుల నిర్వహణ, వివిధ శాఖల సమన్వయాన్ని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.ప్రభుత్వం ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిర్వహణ, రహదారి భద్రత కు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేశామన్నారు.పోలీసు శాఖ ఎదుర్కొంటున్న సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు టీఎస్ పార్క్‌ను ప్రారంభించామని, సాంకేతిక సామర్థ్యాలను పెంచి నేర నియంత్రణకు ఆధునిక విధానాలను అభివృద్ధి చేయడమే దీని లక్ష్యమని డీజీపీ వివరించారు. నేరస్థుల సమాచార మార్పిడి, డేటా షేరింగ్‌ను బలోపేతం చేయడంతో పాటు అన్ని రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రతి రాష్ట్రం నుంచి నోడల్ అధికారులను నియమించి, క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు డిజిపి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఐజి ఈగల్ రవికృష్ణ….గంజాయి నిర్మూలనకు ‘ఆపరేషన్ చైతన్యం’ కింద చేపడుతున్న చర్యలను వివరించారు. గంజాయి అక్రమ రవాణాను గుర్తించడం, గిరిజన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, మాదకద్రవ్యాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలతోపాటు మహిళలు, పిల్లల ఆచూకీ గుర్తించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ ట్రేస్’ వివరాలను వెల్లడించారు. 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు వరకు 11,242 మంది తప్పిపోయిన మహిళలు, పిల్లలను గుర్తించినట్లు తెలిపారు.
తమిళనాడు డిజిపి డాక్టర్ మహేష్ అగర్వాల్… మహిళలు, పిల్లల భద్రతతోపాటు పోలీసు సిబ్బంది మానసిక ఆరోగ్యానికి చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. సింగప్పన్, ‘కావల్ కరంగల్’(Kaval kaarangal) కార్యక్రమం ద్వారా ఒత్తిడి నిర్వహణ, భావోద్వేగ నియంత్రణ వంటి అంశాల్లో సిబ్బందికి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ‘మగిళ్చి’ (magilchi)కార్యక్రమాన్ని 2018లో ప్రారంభించి, ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలున్న పోలీసు సిబ్బందికి మానసిక సహాయం, కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల కింద 2,008 కేసులు నమోదు కాగా, 41,915 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 367 ఫిర్యాదులను పరిష్కరించినట్లు వివరించారు. కేరళం ఐజి అజిత బేగం….పాఠశాలల్లో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ కార్యక్రమం ద్వారా 1,201 పాఠశాలల్లో 98 వేల మందికి శిక్షణ అందించినట్లు అధికారులు తెలిపారు. 484 జనమైత్రి పోలీస్ స్టేషన్ల ద్వారా కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 148 చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లలో పిల్లలకు సేవలు అందిస్తున్నట్లు వివరించారు.
పుదుచ్చేరి డిజిపి శాలిని సింగ్..
ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేసేందుకు 2025లో ‘మక్కల్ మండ్రం’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా 98 శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్లు వెల్లడించారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలను హింస నుంచి రక్షించి, స్వీయ రక్షణలో శిక్షణ ఇచ్చేందుకు 2025 మార్చిలో ‘మిషన్ వీరమంగై’ ప్రారంభించినట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్లకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. లక్షద్వీప్, ఏ డి జి శంకర్ జైస్వాల్ …తీర ప్రాంత భద్రతను బలోపేతం చేసేందుకు మత్స్యకారులతో సమన్వయం, తీర గ్రామాల్లో పర్యటనలు, జాతీయ పర్వదినాల్లో జెండా ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ‘సాగర్ కవచ్’ పేరుతో ఏడాదికి రెండుసార్లు, ‘సాగర్’ పేరుతో నెలకోసారి తీర భద్రతా విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘సీ విజిల్’ కార్యక్రమంతోపాటు తీర ప్రాంత గస్తీ, పర్యాటకుల రాకపోకలు, అనుమతుల పర్యవేక్షణకు సంబంధించిన విధానాలను వివరించారు. ‘తట్ కవచ్’ ఈ–పర్మిట్ పోర్టల్ ద్వారా తీర భద్రతకు సంబంధించిన సమాచార నిర్వహణపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సదస్సులో ప్రధానంగా ఉగ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాల అనంతర పరిస్థితులు,మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అంతర్రాష్ట్ర సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాలు, ఆర్థిక నేరాలు, యువత నిరసనలు, మానవ అక్రమ రవాణా, అంతర్రాష్ట్ర నేరగాళ్ల ముఠాల కదలికలు, నేరగాళ్ల సమాచార మార్పిడి, నేరాల దర్యాప్తులో ఎదురవుతున్న సమస్యలు, ఆయా రాష్ట్రాల పోలీసుల మధ్య సమన్వయం నూతన నేర చట్టాలు , పోలీసింగ్‌లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం వంటి అంశాలపైనా విస్తృతంగా చర్చించారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన నేరస్థుల సమాచారాన్ని పరస్పరం పంచుకోవడంతోపాటు, సమన్వయం కోసం ప్రత్యేక సెక్రటేరియట్ ఏర్పాటు చేసి అధికారులను నియమించాలని నిర్ణయించారు. సరిహద్దు రాష్ట్రాల మధ్య సహకారంతో నేరాల నియంత్రణకు సమష్టిగా కృషి చేయాలని అధికారులు ఉమ్మడి కార్యాచరణ దిశగా మార్గదర్శకాలను రూపొందించారు.
ఈ సమావేశం తర్వాత, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని ఐదో అంతస్తులో తెలంగాణ పోలీసుల సాంకేతిక పరిజ్ఞానం, పనితీరును అధికారులు వివరించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఏఐ ఆధారిత కాలింగ్ వ్యవస్థ, డయల్ 112కు అందే ఫిర్యాదులపై పోలీసుల తక్షణ స్పందన, వివిధ భాషల్లో సమాచార సేకరణ, సమన్వయం తదితర అంశాలను ప్రదర్శించారు. ఈ వ్యవస్థల పనితీరును పరిశీలించిన వివిధ రాష్ట్రాల అధికారులు ఈ సాంకేతిక విధానాన్ని అభినందించారు. తెలంగాణ పోలీసు శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తున్న తీరుని అభినందించారు.
ఈ సదస్సులో గాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లకు చెందిన డిజిపిలు, ఐజీలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో, సి బి ఐ, రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎన్ ఎస్ జి, సి డి ఐ టి సంస్థల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి డిజిపి సి వి ఆనంద్ అధ్యక్షత వహించగా, డిజి మహేష్ భగవత్ సమావేశానికి సెక్రటరీగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల పోలీసు పాటుగా ఉన్నతాధికారులతో పాటుగా డైరెక్టర్ ఈగల్ సందీప్ శాండిల్య, సైబర్ సెక్యూరిటీ బ్యూరో శిఖా గోయల్ డైరెక్టర్ , టి జి పి ఎ డైరెక్టర్ అభిలాష బిస్తూ, సి ఐ డి డి జి చారు సిన్హా, డిజి అనిల్ కుమార్, హైదరాబాద్ సిపి వి సి సజ్జనర్, , ఇంటిలిజెంట్ ఏ డి జి విజయ్ కుమార్ తో పాటుగా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశం తర్వాత, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని ఐదో అంతస్తులో తెలంగాణ పోలీసుల సాంకేతిక పరిజ్ఞానం, పనితీరును అధికారులు వివరించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఏఐ ఆధారిత కాలింగ్ వ్యవస్థ, డయల్ 112కు అందే ఫిర్యాదులపై పోలీసుల తక్షణ స్పందన, వివిధ భాషల్లో సమాచార సేకరణ, సమన్వయం తదితర అంశాలను ప్రదర్శించారు. ఈ వ్యవస్థల పనితీరును పరిశీలించిన వివిధ రాష్ట్రాల అధికారులు ఈ సాంకేతిక విధానాన్ని అభినందించారు. తెలంగాణ పోలీసు శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తున్న తీరుని అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




