హైడ్రా.. పేదల ఇళ్లను కూల్చడానికేనా?

– నాదర్గుల్‌లో చెరువు కబ్జా చేస్తుంటే నిద్రపోతున్నదా
– కాంగ్రెస్ కనుసన్నల్లోనే ‘కాసుబాగ్ కంచ’ భూముల కబ్జా
– ‘రియల్‌’ మాఫియా, పోలీసు దాడుల నుంచి రక్షించాలని హరీశ్ కు రైతుల మొర

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ పరిధిలోని సర్వే నంబర్ 613 (119) కాసుబాగ్ కంచలో ఉన్న 373 ఎకరాల రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా దాడులు, పోలీసుల వేధింపుల నుంచి తమను రక్షించాలని కోరుతూ నాదర్గుల్‌కు చెందిన వందలాదిమంది రైతులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావును బుధవారం కలిశారు. కబ్జాదారులు వేసిన కంచెలు, ధ్వంసమైన తమ వ్యవసాయ బోర్లు, దాడుల్లో గాయపడిన వారి ఫొటోలు, వీడియోలను హరీశ్ రావుకు చూపించి తమ గోసను వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాదర్గుల్ భూములు అన్యాక్రాంతం కాకుండా గతంలో కేసీఆర్  ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద హైకోర్టు వరకు న్యాయ పోరాటం చేసిందని గుర్తు చేశారు. ఆ భూములు ప్రభుత్వానివే అని ప్రస్తుత ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల అండదండలతో ప్రైవేట్ వ్యక్తులకు ఈ భూములను ధారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణ కోసమే హైడ్రా తీసుకొచ్చామని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి నాదర్గుల్‌లోని రూ.వేల కోట్ల ప్రభుత్వ భూమి, అందులోని చెరువును రియల్ ఎస్టేట్ రాబందులు కబ్జా చేస్తుంటే ఎందుకు నిద్రపోతున్నారని ప్రశ్నించారు. హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా అని నిలదీశారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో ప్రభుత్వ భూములను, అందులోని చెరువులను, ఫీడర్ ఛానల్‌ను ధ్వంసం చేస్తూ కంచెలు వేసి కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థల వైపు కన్నెత్తి చూసే దమ్ము హైడ్రాకు ఉందా అని అడిగారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ సజ్జనార్, స్థానిక ఆర్డీవో, ఎమ్మార్వోలకు ఫోన్ చేసి మాట్లాడారు. కలెక్టర్, ఆర్డీవోలతో హరీష్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ సీలింగ్ భూములకు కలెక్టర్, ఆర్డీవోలే కస్టోడియన్లుగా ఉంటారు.. ఇది ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టులో మీరే ఫైల్ చేశారు.. ఇప్పుడు ప్రైవేట్ వాళ్లు కంచెలు వేస్తుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారు.. వెంటనే ఆ కంచెలు తొలగించి, తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు మళ్లీ సాగు చేసుకునే అవకాశం కల్పించండి అని కోరారు. ముదిరాజ్‌లకు చెరువులో చేపలు పట్టుకునే హక్కును కల్పించాలని, చెరువుకు వెళ్లే ఫీడర్ ఛానళ్లను ధ్వంసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గుడిలో పూజలు చేసుకునేందుకు ప్రజలను అనుమతించాలని అధికారులను కోరారు. ఎమ్మార్వోతో మాట్లాడుతూ అది ప్రభుత్వ భూమి అయినప్పుడు అందులోకి అక్రమంగా ప్రవేశించిన ప్రైవేట్ వ్యక్తులు, రౌడీలపై ప్రభుత్వ అధికారిగా పోలీస్ స్టేషన్‌లో ఎందుకు ఫిర్యాదు ఇవ్వడం లేదంటూ వెంటనే కబ్జాదారులను వెళ్లగొట్టి వాళ్లపై కేసు పెట్టండి అని సూచించారు. సీపీ సజ్జనార్‌తో హరీష్ రావు మాట్లాడుతూ ఆదిభట్ల పోలీసులు రియల్ ఎస్టేట్ మాఫియాకు కొమ్ముకాస్తున్నారు.. రైతులు ఫిర్యాదు ఇస్తే తీసుకోవడం లేదు.. పైగా రైతులపైనే దొంగ కేసులు పెడుతున్నారు. గుడికి, చెరువుకు వెళ్తున్న స్థానికులపై దాడి చేసిన కబ్జాదారుల రౌడీలపై వెంటనే కేసులు నమోదు చేసి రైతులను రక్షించాలి అని కోరారు. రైతుల తరపున కూడా పోలీస్ స్టేషన్‌లో కేసులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు న్యాయం జరగని పక్షంలో తానే స్వయంగా బీఆర్ఎస్ పార్టీ బృందంతో నాదర్గుల్ భూములను సందర్శిస్తానని అధికారులకు తేల్చిచెప్పారు.

హరీశ్ రావుకు కృతజ్ఞతలు
హరీశ్ రావు వస్తేనే తమకు న్యాయం జరుగుతుందని, ఆయన స్వయంగా అధికారులతో మాట్లాడిన తర్వాతే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, మీరు తప్పకుండా భూములను సందర్శించి మాకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు కోరారు. హరీష్‌రావు చొరవతో ఫోన్‌లో సానుకూలంగా స్పందించిన కలెక్టర్, సీపీ, ఇతర ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, రైతులకు న్యాయం చేస్తామని  హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ పేద రైతుల పక్షానే నిలబడుతుందని, న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హరీష్ రావు రైతులకు భరోసా ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *