తప్పును ఒప్పుకుని సరిదిద్దుతున్నాం

– 22-ఎకు సంబంధించి 24 గంటల్లో 34 రిజిస్ట్రేషన్లు
– ‘ధరణి’ తప్పులకు సమాధానం చెప్పే ధైర్యం హరీష్‌కు ఉందా?
– సామాన్యుల హక్కులు, ఆస్తులకు పూర్తి రక్షణ బాధ్యత మాది
– ఏలేటి ఆరోపణలకు ఆధారాలుంటే చూపాలి
– మీడియాతో రెవెన్యూ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : పేదల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవాడికి అన్యాయం చేయదని, పేదవాడి న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా ఈ ప్రభుత్వం తీసుకోదని, వారి హక్కులు, ఆస్తులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు సచివాలయంలోని తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. 22-ఏ నిషేధిత జాబితా వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోమారు స్పష్టం చేస్తూ సమస్య పరిష్కార ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, 24 గంటల్లోనే మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 రిజిస్ట్రేషన్లు జరిగాయని మంత్రి వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు 22-ఏ నిషేధిత భూముల వివరాలను ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేసే క్రమంలో క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాట్లను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సరిదిద్దుతోందని తెలిపారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా పొరపాటును పారదర్శకంగా అంగీకరించి అదే సమయంలో జరిగిన తప్పును సరిదిద్దే బాధ్యతను కూడా తీసుకున్నామని, ప్రజలను ఇబ్బందుల్లో వదిలేసే ప్రభుత్వం తమది కాదని స్పష్టం చేశారు. వివిధ జీవోలు, మెమోల ద్వారా గత ప్రభుత్వాల కాలంలో క్రమబద్ధీకరించిన ప్రైవేట్ భూములు, హైకోర్టు, జీహెచఎంసీ/హెచఎండీఏ అనుమతులు పొందిన స్థలాలు ఆన్‌లైన్ అప్‌లోడింగ్‌లో సాంకేతిక లోపం కారణంగా 22-ఏ జాబితాలోకి వచ్చాయని మంత్రి వివరించారు. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే గుర్తించిందని, బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పునరుద్ధరించామని తెలిపారు. 22-ఏ సమస్యల త్వరిత పరిష్కారం కోసం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, రాబోయే 15 రోజులపాటు ఈ కమిటీ రోజువారీగా దరఖాస్తులను పరిశీలించి నిజమైన ప్రైవేట్ ఆస్తులన్నింటినీ తక్షణమే క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కావాలనే 22-ఏలో భూములు పెట్టి వాటిని తొలగించడానికి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత హరీష్‌రావు చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి ఘాటుగా స్పందించారు. ‘విమర్శలు చేయడం చాలా సులువు.. కానీ బాధ్యత తీసుకోవడం అంత సులువు కాదు. 22-ఏ విషయంలో పొరపాటు జరిగిందని తాము బహిరంగంగా అంగీకరించాం.. ఆ పొరపాటును సరిదిద్దే బాధ్యతను కూడా తీసుకున్నాం.. వారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ‘ధరణి’ పేరుతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు, జరిగిన తప్పులకు ఏనాడైనా బాధ్యత తీసుకున్నారా.. కనీసం క్షమాపణ చెప్పారా’ అని ప్రశ్నించారు. పేదవాడి సమస్యను రాజకీయంగా వాడుకోవడం మానండి. మేం తప్పును ఒప్పుకుని దిద్దుతున్నాం.. మీ తప్పులను ఒప్పుకునే ధైర్యం మీకుందా అని నిలదీశారు. అబద్ధాలు, ఆరోపణలు, రాజకీయ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరన్నారు. తప్పు జరిగితే దాన్ని అధికారుల మీదకు నెట్టేసి చేతులు దులుపుకోవడం తమ ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న హరీష్‌రావుకు ఇప్పటికీ 30 శాతం కమీషన్లు ఎందుకు గుర్తుకొస్తున్నాయో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. పేదల సమస్యను పరిష్కరిస్తున్న ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం చాలా సులభం. కానీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారో కూడా సమాధానం చెప్పాలని మంత్రి అన్నారు. కాళేశ్వరం విషయంలో జరిగిన పరిణామాలకు హరీష్‌రావు ఏనాడైనా బాధ్యత తీసుకున్నారా.. ఇప్పుడు తాను మాత్రం తన శాఖలో పొరపాటు జరిగిందని చెప్పి దానికి పరిష్కారం చూపేందుకు బాధ్యత తీసుకుంటున్నాను.. ఇదే తేడా అని మంత్రి స్పష్టం చేశారు.

హరీష్ రావు కాదు.. అబద్ధాల రావు

మాజీ మంత్రి హరీశ్‌రావుపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. హరీశ్‌రావు కాదు ఆయన అబద్ధాల రావు అని ఎద్దేవా చేశారు. 22ఏలో ఆయన కొండను తవ్వి ఎలుకను పట్టారని.. దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారని సెటైర్లు గుప్పించారు. హైదరాబాద్‌లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. గతంలో సాప్ట్ కాపీ అప్‌లోడ్ చేయకపోవడం వల్ల తప్పు జరిగిందని తామే గుర్తించామన్నారు. విమర్శలు చేసే ముందు బుర్ర ఉపయోగించాలని మంత్రి వ్యంగ్యంగా మాట్లాడారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమన్నారు. ప్రభుత్వ భూములు కాకపోతే కచ్చితంగా వాటిని 22ఏ నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో మాదిరిగా తాము బుకాయించడం లేదని చెప్పారు.

ఆరోపణలకు ఆధారాలు చూపాలి

బీజేఎల్‌పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి స్పందిస్తూ తాటాకు చప్పుళ్లకు తాను భయపడననన్నారు. తనపై ఏదైనా ఆరోపణ చేస్తే ఆధారాలతో మాట్లాడాలి.. ఆధారం ఉంటే ప్రజల ముందు పెట్టాలి.. ఫీనిక్స్, రాఘవ తదితర సంస్థలతో వ్యాపార రంగంలో లావాదేవీలు జరగడం సహజం. వాటిని పట్టుకుని రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదు అని అన్నారు. తాను రెండు దశాబ్దాలుగా వ్యాపార రంగంలో ఉన్నాను.. అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చాను.. ఒక్క రోజులో వేల కోట్లకు ఎదిగిన వ్యక్తిని కాదు. తన వ్యాపార ప్రస్థానం, తన నేపథ్యం గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు.. ఆరోపణలు చేసేవారు ముందుగా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి అని మంత్రి హితవు పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *