– మేము అధికారంలోకి వస్తే భూలక్క్ష్మి కింద ఎకరం పంపిణీ
– టీఆర్ ఎస్ అధ్యక్షురాలు కవిత హెచ్చరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : తాము అధికారంలోకి వస్తే ’భూలక్క్ష్మి’ పేరుతో పేదలకు భూమి పంపిణీ చేస్తామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. పేదల భూములను రేవంత్‌రెడ్డి లాక్కుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. బీసీలకు పెద్ద పీట వేస్తామని చెప్పినా ఆచరణలో మాత్రం సామాజిక న్యాయం ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే భూమి లేని పేదలకు ఎకరం చొప్పున భూమి ఇచ్చేలా భూ లక్క్ష్మి పథకం అమలు చేస్తామని కవిత ప్రకటించారు. రాష్ట్రంలో భూమి పంపిణీ అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భూమి కేవలం లావాదేవీల అంశంగా కనిపించవచ్చని, అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు భూమి, అడవి జీవనాధారమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా ముందుగా అసైన్డ్ భూములనే తీసుకుంటున్నారంటూ రాష్ట్రంలో సుమారు 30 వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకుందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీ మేరకు పేదలకు అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి సోదరులపై కూడా కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. వారి ఆధ్వర్యంలో భూ దోపిడీ జరుగుతోందన్నారు. రేవంత్‌రెడ్డి, భట్టి కుటుంబ సభ్యుల ప్రభావం ప్రభుత్వంలో కొనసాగుతోందని ఆరోపించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి గత 31 నెలల్లో ఆ అంశాన్ని ఎందుకు పట్టించుకోలేదని కవిత ప్రశ్నించారు. ముందు కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ సలహాదారుల నియామకాల్లోనూ బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఒకే రోజు శివధర్‌రెడ్డి, వీహెచ్‌లను సలహాదారులుగా నియమించినప్పటికీ ఇద్దరి వేతనాల్లో తేడా ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఆర్టీఐ కమిషన్‌లో ఒక్క బీసీకి కూడా అవకాశం కల్పించలేదని, ప్రభుత్వ నియామకాల్లో సామాజిక న్యాయం పాటించడం లేదని విమర్శించారు. విజయశాంతి వంటి ఉద్యమకారులను పక్కన పెట్టి మంత్రి పదవి ఇవ్వకుండా ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టారని విమర్శించారు. అప్పర్ క్లాస్ మాట్లాడితే ఒక రకమైన చర్యలు.. లో క్లాస్ మాట్లాడితే మరో రకమైన చర్యలు తీసుకుంటారా.. ఇదేనా రేవంత్‌రెడ్డి సామాజిక న్యాయం అని ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డికి భూమి అంటే కమర్షియల్ ట్రాన్సాక్షన్‌గా మారిపోయిందని ధ్వజమెత్తారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో మూడు వేల ఎకరాల భూమిని పేదలకు ఇచ్చిందని, ఆ తర్వాత ఆపేసిందని చెప్పారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న, అన్యాక్రాంతమైన భూములను సేకరించి పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి ఎకరం భూమి ఇవ్వడం సాధ్యమేనని కవిత చెప్పారు. గతంలో జరిగిన విషయాలనే పదేపదే ప్రస్తావిస్తూ చేయాల్సిన పనులను పక్కన పెట్టొద్దని రేవంత్ కు హితవు పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



